ఈ మాట కొత్తగా బైక్ కొన్న కుర్ర వాడితో చెప్తే వాడి తల్లో తండ్రో చెప్పుచ్చుక్కొట్టడం ఖాయం. అయితే చదరంగపు విశ్వ విజేత విశ్వనాధన్ ఆనంద్‌ని ఆ వేగమే గెలిపించింది. రెగ్యులర్ ఫార్మాట్‌లో జరిగిన పన్నెండు గేములూ సరి సమానంగా ముగిశాయి. ఆనంద్‌కి ఏ విషయంలోనూ తీసిపోకుండా జవాబిచ్చాడు గెల్ఫాండ్. ఇక రాపిడ్ గేములు మొదలయ్యాక ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. ఒక రాంగ్ మూవ్ వేసినా ఓడిపోయే గేమ్‌లు అవి. ఈ పద్ధతిలో గేమ్ ప్రారంభంలో ఇద్దరికి 25 నిముషాలు టైమ్ ఉంటుంది. ఒక్కో ఎత్తు వేసేకొద్దీ పది సెకన్లు కలుస్తూ ఉంటుంది.
మొదటి గేమ్‌లో ఇద్దరూ విజయం కోసం తీవ్రంగా పోరాడినా ఒక దశలో ఇద్దరికీ సమయం తక్కువగా ఉండడంతో ఇద్దరూ డ్రా దిశగానే ఆడారు. ఇక రెండవ గేమ్‌లో ఒక దశలో గెల్ఫాండ్ బాగా ఆధిక్యం సాధించినా గెలుపుకి అవసరమయిన వ్యూహం ఎంచుకోవడానికి తగిన సమయం లేక పోయింది. ఇక ఆ గేమ్ చివరి దశలో ఇద్దరికీ సమానంగా ఉన్న దశలో గెల్ఫాండ్‌కి ఎత్తు వేయడానికి రెండు సెకన్లే మిగిలి ఉంది. ఒక ఎత్తు వేస్తే పది సెకన్లు కలుస్తాయి అనుకున్న గెల్ఫాండ్ వేసిన తొందరపాటు ఎత్తు అతన్ని పరాజయం పాలు చేసింది.
వెను వెంటనే జరిగిన మూడవ గేమ్‌లోనూ ఇదే పరిస్థితి. ఆధిక్యంలో ఉన్నప్పుడు సమయాభావం వల్ల ఆ ఆధిక్యాన్ని విజయంగా మలుచుకొలేక డ్రాతో సరిపెట్టుకోవలసి వచ్చింది. అలా అన్ని విధాలుగా ఆనంద్‌తో సమ ఉజ్జీగా నిలిచినా ఆటలో వేగంలో ఆనంద్‌తో పోటీ పడలేకపోయాడు బోరిస్ గెల్ఫాండ్.
చిన్నప్పటి నుంచీ ఏ విధమయిన గేమ్‌లో అయినా చకచకా ఎత్తులు వేస్తూ "లైట్నింగ్ కిడ్" అని పేరు తెచ్చుకున్న ఆనంద్‌ని ఆ మెరుపు వేగమే ఈ సారి చాంపియన్‌ని చేసింది.
2 comments:
nenu kooda vegangane ettulu vestu untanu, kani enduko ekkuvaga odipotu untanandee!!
వేగమొక్కటే సరిపోదనుకుంటానండీ.
Post a Comment