రాజ శేఖర్ రెడ్డి ఎన్నికలలో గెలిచి రెండవసారి అధికారంలోకి రావడానికి ఆరోగ్యశ్రీ పథకం చాలా ఉపయోగపడిందని అందరూ ఒప్పుకుంటారు. ఈ పథకం ద్వారా లాభపడ్డవాళ్ళే కాకుండా వారి చుట్టుపక్క కుటుంబాలవారిమీద కూడా దీని ప్రభావం బాగా పని చేసింది. ఇందులో మరొక గొప్పతనం ఏమిటంటే ఈ పథకం వల్ల ప్రజారోగ్య వ్యవస్థ దెబ్బతిని పొయినా అది ఎవరికీ కనిపించక పోవడం. ఎన్నికలలో ఎలాంటి పథకాలే ఓట్లు రాలుస్తాయి. ఆరోగ్య శ్రీలో లాభపడ్డవారిలో పోలింగ్ బూత్ దాకా వెళ్ళి ఓట్లు వేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. హైటెక్ సిటీలూ, ఐటీ కంపెనీలూ తీసుకొస్తే వాటి వల్ల లాభ పడ్డ వాళ్ళెవరూ వెళ్ళి క్యూలో నించుని ఓటేసే శ్రమ తీసుకోరు.
ఇలా ఓట్లు రాల్చే మహత్తర పథకమే నేను చెప్పబోతున్న స్కాముశ్రీ. ఇది అధికారంలో లేకుండా, అధికారంలోకి రావాలని తపన పడే వారి కన్నా ఆల్రెడీ అధికారంలో ఉండి ఎన్నికలను ఎదుర్కోబోతున్న వారికి బాగా ఉపయోగపడుతుంది. దిన్ని శ్రద్ధగా చదివి ఆచరిస్తే కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ పీఠం ఎక్కడం (సోనియమ్మ ఎక్కనిస్తే) ఖాయం.
పొద్దున్న లేచి పేపర్ తెరిస్తే, న్యూస్ చానల్ పెడితే ప్రతి రోజూ ఏదో ఒక స్కామ్ కనపడుతూ ఉంటుంది. ప్రతి రోజూ scam of the day అని పత్రికలు ఒక కాలమ్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అంతా స్కాము మయం, ఈ జగమంతా స్కాము మయం అని శ్రీరామదాసు సినిమాలో పాట ట్యూనులో పాడుకోవలసి వస్తూంది. మద్యం దుకాణాలు, ఇసుక మాఫియా, గనుల కుంభకోణాలు, టూజీ స్పెక్ట్రం, బొగ్గు గనుల వేలం ఇలా జిల్లాల, రాష్ట్రాల, దేశం లెవెల్లో వివిధ స్థాయిల్లో స్కాములు బయట పడుతూ ఉన్నాయి.
అయితే జాగ్రత్తగా గమనిస్తే జనం ఈ స్కాములని చూసి నాయకులని అసహ్యించుకోవడం లేదు. ఒక చిన్న స్కామైనా చేయడానికి తమకు చాన్స్ లేదే అని బాధ పడే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. నేతనైనా కాకపోతిని స్కాము ఒక్కటి చేయగా అనుకొనే వాళ్ళే ఎక్కువమంది ఉంటారు. ఇలా స్కాములు చేయడానికి అవకాశం, అధికారం లేని సాధారణ ఓటర్లకు స్కాములు చేసే అవకాశం కల్పించడమే ఈ స్కాముశ్రీ లక్ష్యం.
దీనిలో క్షేత్ర స్థాయిలో స్కాము మిత్రలు ఉంటారు. వీళ్ళు ఇంటింటికీ వెళ్ళి ఆ ఓటర్ల గురించిన వివరాలు నమోదు చేస్తారు. ఆ వివరాలను స్టడీ చేయడానికి ఆ పై స్థాయిలో స్కాము కోఆర్డినేటర్లు, స్కాము జీఎంలూ ఇలా నానా స్థాయి ఆఫీసర్లు ఉంటారు. ఈ ఉద్యోగాలు అన్నీ రాజీవ్ యువ కిరణాల కింద లెక్కేస్తే ఆ పథకం కూడా గట్టెక్కుతుంది. ఈ స్టడీ పూర్తయ్యాక ఒక్కో తెల్ల కార్డు కుటుంబానికీ కొంత స్కాము చేసే అవకాశం వస్తుంది. అలాగే ఎక్కడేక్కడ స్కాములు చేసే వీలుందో పరిశీలించే విభాగం మరొకటి పెట్టి అందులో నానా స్థాయి అధికారులని నియమిస్తే అదొక ఉద్యోగాలు పుట్టించే విభాగం అవుతుంది.
స్కాముల కోసం గనులు, పోరంబోకు స్థలాలు, ఇసుక రీచ్‌లు, ప్రాజెక్టులు, నీటి కాలువలు ఉండనే ఉన్నాయి. అవి చాలక పొతే ఉన్న తారు రోడ్లు తవ్వే పనులు ఇవ్వచ్చు. ఆ పిదప ఆ రోడ్ల స్థానంలో సిమెంటు రోడ్లు వేయించవచ్చు.
ఈ స్కాము శ్రీ వల్ల అధికారంలో ఉన్న వారికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. ప్రజలందరికీ ఏదో రూపంలో డబ్బు అందుతుంది కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉంటారు. మహా నేత అన్న బిరుదు తగిలించుకోవచ్చు. బతికుండగానే ప్రతి ఊరిలో, కూడలిలో విగ్రహాలు పెట్టుకోవచ్చు. పాలనలో దొర్లే తప్పులు ప్రతిపక్షాలు ఎత్తి చూపించినా పట్టించుకునే తీరికా ఓపిక జనానికి ఉండదు. అది గాక అందరూ స్కాముల్లో భాగస్వాములు అవుతారు కాబట్టి నేతలు చేసే బడా స్కాములని ఎవరూ పట్టించుకోరు. అప్పుడు దర్జాగా ఖజానాని దోచిపారేసి తరువాత వచ్చే ఎన్నికలలో కొంత ఖర్చు పెట్టి మళ్ళీ అధికారం చేజిక్కించుకోవచ్చు.
కిరణ్ కుమార్ రెడ్డి గారూ దీని మీద కొంత మనసుపెట్టి ఆలోచించండి మరి.
No comments:
Post a Comment