తెలుగు తమిళ బాషల్లో వచ్చిన చంద్రముఖి ఎంత పెద్ద హిట్టో చెప్పాల్సిన పని లేదు. బాబా సినిమా దెబ్బకి కుదేలయిన రజనీ కాంత్‌కి కొత్త ఊఫు ఇచ్చింది పి.వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా. కన్నడంలో ఆప్త మిత్ర పేరుతో, బెంగాలీలో రాజ మహల్ పేరుతో, హిందీలొ భూల్ భులయ్యా పేరుతో రీమేక్ అయి అన్ని చోట్లా విజయం సాధించింది. అయితే ఈ సినిమాకి మాతృక 1993లో మళయాళంలో నిర్మితమయిన మణిచిత్రతాళ్ అన్న సినిమా. దీనికి దర్శకుడు ఫాజిల్. నాగార్జున హీరోగా, నగ్మా హీరోయిన్‌గా వచ్చిన కిల్లర్ సినిమా దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకి కూడా ఈయన పరిచితుడు.
ఈ మళయాళ సినిమాలో సురేష్ గోపి, శోభన ముఖ్య పాత్ర ధారులు. సైకియాట్రిస్టుగా మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించాడు. ఇందులో మోహన్ లాల్ పాత్ర సహాయ నటుడుగానే ఉంటుంది. ఈ సినిమాలో జమీందారు పాత్ర లక లక శబ్ధం చేయదు. ఈ సినిమాలో నటనకు శోభనకి జాతీయ అవార్డు వచ్చింది. ఈ సినిమా ఆత్మ రాగం పేరిట తెలుగులో డబ్ అయింది. అంతగా ఆడలేదు. తరువాత పి.వాసు దీనిని ఆప్త మిత్ర పేరుతో కన్నడంలో విష్ణు వర్ధన్ హీరోగా తీసి హిట్ కొట్టాడు. దానిని చూపించి రజనీ కాంత్‌ని తమిళ సినిమాకి ఒప్పించాడు. అయితే ఈ కన్నడ, తమిళ, తెలుగు వెర్షన్లలో సైకియాట్రిస్టు పాత్ర నిడివి బాగా పెరిగింది. తిరిగి హిందీలో మాత్రం మళయాళ మాతృకననుసరించి తీశారు.
మళయాళంలో సినిమాకి కథకుడు మధు ముట్టం. కానీ కన్నడ, తమిళ సినిమాలకి కథకుడిగా పి.వాసు పేరు ఉంటుంది. ఆ విషయమ్మీద మధు ముట్టం కోర్టుకి ఎక్కడంతో హిందీలో కథకుడిగా ఆయన పేరు వేశారు. మణిచిత్రతాళ్ సినిమాకి రెండవ యూనిట్ దర్శకుడిగా ప్రియదర్శన్ పని చేశాడు. కన్నడంలో సౌందర్యకి, తమిళంలో జ్యోతికకి ఈ సినిమా ఉత్తమ నటి అవార్డు తెచ్చిపెట్టింది.
కేరళలో మూడు వందల రోజులు ఆడిన ఈ సినిమా అప్పట్లో అయిదు కోట్ల షేర్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమా విడుదల అయి రెండు దశాబ్ధాలు గడిచినా కేరళలో ఆసియా నెట్ చానల్ ఈ సినిమాని ప్రతి సంవత్సరం కనీసం పది సార్లు అయినా వేస్తుంది. టీవీలో ఈ సినిమా వచ్చిన ప్రతి సారీ టీఆర్‌పీ రేటింగ్‌లో అగ్రస్థానంలో నిలుస్తుంది. యూట్యూబ్‌లో రెండు గంటలా ముప్పయి ఆరు నిముషాల నిడివి ఉన్న ఈ సినిమా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో దొరుకుతుంది.https://www.youtube.com/watch?v=qdp4xudz958 టైముంటే చూడండి. బావుంటుంది.
No comments:
Post a Comment