1915లో గాంధీ గారు నెల్లూరు జిల్లా పర్యటించారు. అప్పుడు జిల్లా కలెక్టరుగా దివాన్ బహదూర్ రఘునాధరావు రామచంద్ర రావుగారు ఉండే వారు. ఈయన ఆంగ్ల కొలువు చేస్తున్నా స్వదేశీ బట్టలే ధరించేవారు. తన పంతొమ్మిదో యేట ఇండియన్ సివిల్ సర్వీసులో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి మొదట కర్నూలు జిల్లాకి ఆ పిమ్మట నెల్లూరు జిల్లకి కలెక్టరుగా నియమితులయ్యారు. ఈయనకి గాంధీ అంటే వల్లమాలిన అభిమానం. కలెక్టరుగా రిటైరయ్యాక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో చేరి రాజగోపాల చారికి అనుంగు శిష్యుడిగా స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు. ఈయనకి ఖగోళ శాస్త్రంలోనూ, గణితంలోనూ అమిత ఆసక్తి ఉండేది. ఉద్యోగంలేక అవస్థ పడుతున్న రోజుల్లో ప్రముఖ గణితవేత్త శ్రీనివాస రామానుజన్‌కి ఈయన మద్రాస్ పోర్ట్ ట్రస్ట్‌లో కొలువు ఇప్పించారు.
ఇక విషయానికొస్తే, నెల్లూరుకి వచ్చిన గాంధీగారికి రామచంద్ర రావుగారు తన నివాసంలో విడిది కల్పించారు. ఆ సంగతి ఈయన పై అధికారులు అంత తేలిగ్గా తీసుకోలేదు. ఆంగ్లేయుల అధికారాన్ని ధిక్కరిస్తున్న వ్యక్తికి బస కల్పించడం ఎలా సమర్ధనీయమో తెలుపమని ఒక నోటీసు ఇచ్చారు. దానికి సమాధానంగా గాంధీగారిని ఎవరెవరు కలుసుకుంటారో, వారి కార్యకలాపాలు ఏమిటో తెలుసుకోవడానికి, వారి మీద ఒక కన్నేసి పెట్టడానికి అనువుగా ఉంటుందని గాంధీగారికి తన ఇంట్లో విడిది ఏర్పాటు చేసి ఆయన మీద ఒక కన్నేసి నిఘా ఏర్పాటు చేశానని జవాబు రాశారు. ఆ సమాధానంతో తృప్తి చెందిన అధికారులు ఆ విషయాన్ని అంతటితో వదిలేశారు.
1926లో మద్రాసు కలెక్టరుగా రిటైరయ్యి, స్వాతంత్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు రావుగారు. అయితే 1930లో స్ట్రోక్ వచ్చిన తరువాత మంచాన పడ్డారు. దానితోనే 1936లో అరవై అయిదేళ్ళ వయసులో మరణించారు.
1 comment:
చాలా మంచి పొస్టు పెట్టారు. ఇలాంటివి మరిన్ని రాయండి. జాకెట్లు విప్పి రొమ్ములు చూపించే వారి గురించి కాదు.
Post a Comment