ఏ.ఆర్. రెహ్‌మాన్ కడప పెద్ద దర్గాని దర్శించుకున్నాక ఆస్కార్ అవార్డు గెలిచాక ఈ దర్గా బాగా పాపులరయింది. ఆ తరువాత ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్, మగధీర సినిమాకి ముందు రామ్ చరణ్ తేజ ఈ దర్గాని దర్శించుకోవడం, మగ ధీర సూపర్ డూపర్ హిట్ కావడంతో మతాలకి అతీతంగా ఈ దర్గాకి సందర్శకుల తాకిడి పెరిగిపోయింది. ఎందరు వచ్చినా ఈ దర్గాకి పెట్టని బ్రాండ్ అంబాసడర్ రెహ్మానే. "నెలకి ఒకసారయినా ఆయన వచ్చిపోతూ ఉంటాడు" అని చెప్పాడు దర్గాలో ఉండే ఇమామ్.
ఇక్కడికి వచ్చిన భక్తులు ఏ కోరిక కోరినా తీరుతుంది అన్న నమ్మకం ఉండడంతో, రెహ్మాన్, రామ్ చరణ్‌ల విషయంలో అది నిజం కావడంతో ఇటీవల ఈ దర్గాకి మతాలతో సంబంధం లేకుండా భక్తుల తాకిడి ఎక్కువ అయింది. ఈ దర్గాకి మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. పీరుల్లా హుస్సేని, అరీఫుల్లా హుస్సేని అనే ఇద్దరు ముస్లిం సాధువుల సమాధులు ఇక్కడ ఉన్నాయి.
ఖ్వాజా పీరుల్లా హుస్సేని, ఈయన్ని పీరుల్లా మాలిక్ అని పిలుస్తారు, 16వ శతాబ్ధిలో కర్ణాటకలోని బీదర్‌లో జన్మించాడు. ఈయన మహమ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వాడు అంటారు. సూఫీ మతానికి చెందిన సాధువుల సమాధులను దర్శించుకుంటూ అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి సమాధిని దర్శించుకున్నప్పుడు కడప ప్రాంతానికి వెళ్ళమని ఆగ్న లభించిందట. అలావస్తూ ప్రస్తుత చెన్నూరు దగ్గర పెన్నా నది ఒడ్డున విడిది చేసి ఉన్నప్పుడు సిద్ధవటం నవాబు నేక్ నామా సాహెబ్ ఈయన్ని దర్శించుకొని ఆశీస్సులు పొందాడు. ఆ నవాబు పీరుల్లా మాలిక్ ఉండడానికి తగిన సదుపాయాలను కల్పించగా అక్కడే ఉండి శాంతి, కరుణ, సామరస్యం అందరికీ బోధిస్తూ ఉన్నాడు పీరుల్లామాలిక్.
ప్రచారంలో ఒక కథ ప్రకారం అతి తక్కువ కాలంలో ఈయనకి వచ్చిన పేరు కొందరు ముస్లిం పెద్దలకు నచ్చక వారు ఈయన మోసగాడు అని ప్రచారం చేసి, ఏదైనా అద్భుతం చూపిస్తేనే నిన్ను నమ్ముతాం అని చాలెంజ్ చేశారు. అప్పటికప్పుడు భూమి విడిపోయి పీరుల్లా మాలిక్‌ని తనలో కలిపేసుకుందట. ఇది జరిగింది 1716ల, మొహర్రం నెల పదవ రోజున. అలా జీవ సమాధి అయిన పీరుల్లా మాలిక్ మూడు రోజుల తరువాత బయటకి వచ్చి ప్రార్ధనలు చేయడం భక్తులు చూశారు. దాంతో పీరుల్లా మాలిక్ శక్తి మీద అందరికీ అనుమానాలు తొలిగి పోయాయి. ఆ తరువాత కాలంలో నవాబ్ అబ్దుల్ హమీద్ ఖాన్ ఆయనకి ఒక సమాధి కట్టించారు. ఇప్పుడు పెద్ద దర్గాలో తూర్పు వైపు ఈ సమాధి ఉంది.
పీరుల్లా మాలిక్‌కి ఇద్దరు కొడుకులు. వీరిలో ఒకరు అరీఫుల్లా హుస్సేన్. ఈయన కూడా నాన్నగారి బాటలో నడిచాడు. ఈయన మనవడు అరీఫుల్లా హుస్సేన్-2. పీరుల్లా మాలిక్‌లాగా ఈయన కూడా సూఫీ తత్వవేత్తగా బాగా పేరు గడించాడు. ప్రచారంలో ఉన్న ఒక కథ ప్రకారం ఒకసారి తన పూర్వీకుల సమాధులు దర్శించుకోవడానికి ఈయన బీదర్ వెళ్ళాడు. అక్కడ ఉన్న కాపలాదారు ఈయన్ని లోపలికి వెళ్ళనీయలేదు. గేటు ముందు నిలుచుని తాతా అని పిలవగానే సమాధి లోపల నుండి రా మనవడా అన్న పిలుపు వినిపించి తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయట. ఈయన సమాధి కూడా ఇక్కడ ఉంది. ముస్లిం కాలెండర్ ప్రకారం అయిదవ నెలలో ఈయన పేరిట ఇక్కడ ఉరుసు జరుపుతారు. ఈ ఉరుసుకి దేశం నాలుగు మూలల నుండి భక్తులు వస్తారు. రెండు రోజులు జరిగే ఈ ఉత్సవంలో భక్తులు ఆయన సమాధికి చద్దార్ అర్పిస్తారు. రెహ్మాన్, చరణ్ లాంటి సందర్శకులు ఈ సమాధి సందర్శించినప్పుడు వారి తలమీద పోటోలో కనిపించేది ఇదే..
"మీరు నాకు అది కావాలి, ఇది కావాలి అని ఆశించి ఇక్కడికి రావొద్దు. అల్లాని ప్రార్దించండి. మికు ఏం కావాలో ఆయనకి తెలుసు. అది మీకు దొరికేలా ఆయనే చేస్తాడు" అని చెప్పాడు ఒక సాధువు.
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు, నీలం సంజీవ రెడ్డి, మహ్మద్ రఫీ లాంటి వాళ్లు ఎందరో ఈ దర్గాని దర్శించుకున్న లిస్టులో ఉన్నారు.
No comments:
Post a Comment