గోదావరి నది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకొని శిష్యులకి విద్యా బోధ చేస్తూ ఒక ముని దంపతులు ఉండేవారు. ఆయన చాలా ప్రతిభావంతుడు. ఆయనకి తెలియని శాస్త్రం కానీ, విద్య కానీ లేదని అంటారు. ఆమె సాక్షాత్తూ అన్నపూర్ణ. శిష్యులని కన్న బిడ్డల్లా చూసుకొనేది. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా ఆకలి తీర్చేది. వారి వద్ద వసంతుడు అనే ఒక అనాధ పెరిగేవాడు. అతను బాగా చురుకైన వాడు, తెలివి పరుడూ కావడంతో అతనికి విద్యలన్నీ ఇట్టే అబ్బేవి. కొన్నాళ్ళకే తన గురువుకి తెలిసిన విద్యలన్నీ నేర్చేసుకున్నాడు వసంతుడు. అతనికి నేర్పడానికి తన వద్ద ఉన్న గ్నానం సరిపోకపోవడంతో తన గురువులని పిలిపించి మరీ అతనికి విద్యాభ్యాసం చేయించాడు. అయితే కొన్నాళ్ళకే అతనికి నేర్పడానికి తమ వద్ద ఉన్న విద్యలన్నీ పూర్తయ్యాయని వాళ్ళూ చెప్పేశారు.
ఇలా ఉండగా గురుపత్ని గర్భం ధరించింది. వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులూ తానే చూసుకుంటూ ఆమెని కాలు కింద పెట్టనీయకుండా చూసుకున్నాడు. ఆమెకి ప్రసవ సమయం వచ్చింది. ఆశ్రమం లోపల ప్రసవం జరుగుతుండగా గుమ్మం బయట కూర్చుని ఉన్నాడు వసంతుడు. కాస్సేపట్లో లోపల నుంచి చంటి పాపల ఏడుపులు వినిపించాయి. కవల పిల్లలకి జన్మనిచ్చింది గురు పత్ని. ఒక మగ పిల్ల వాడు, ఒక ఆడ పిల్ల. ఇంతలో ఒక దివ్య పురుషుడు వడి వడిగా ఆశ్రమంలోపలికి వెళ్ళాడు. మామూలు మనుషులకి అతను కనిపించేవాడు కాదు కానీ, దేవరహస్యాలు కూడా నేర్చుకొని ఉన్నాడు కాబట్టి అతనెవరో ఇట్టే కనిపెట్టాడు వసంతుడు. అతను బ్రహ్మ. అప్పుడే పుట్టిన పిల్లల నుదుటి రాత రాయడానికి లోపలకి వెళ్ళాడు.
ఓపిగ్గా బయట కాచుకుని కూర్చుని బ్రహ్మ బయటకి రాగానే అడ్డుకుని, ప్రణామం చేసి, "స్వామీ మా గురువు గారి పిల్లల నుదుటిన ఏమి రాశారో కాస్తా సెలవివ్వండి" అని అడిగాడు. తనని చూడగలిగిన ఈ పిల్లవాడు సామాన్యుడు కాడు అని తెలిసిన వాడయిన బ్రహ్మ, ఇతరులకి తెలియజేయరానిదయిన రహస్యాన్ని అతనికి చెప్పాలని నిశ్చయించుకొన్నాడు.
"నాయనా, ఈ అబ్బాయి నిరక్షర కుక్షి అవుతాడు. ఏ రోజయినా అతని వద్ద ఒక మూట బియ్యం, ఒక ఆవు, ఒక పూరి పాక తప్ప మరేమీ ఉండవు. రోజంతా కష్టపడి తన రెక్కల కష్టంతో కనా కష్టంగా పెళ్ళాన్ని, పిల్లలనూ పోషిస్తాడు. ఇక ఆ అమ్మాయి వేశ్య అయి డబ్బుల కోసం రోజుకి ఒక పురుషుడితో సంభోగించే వారకాంత అవుతుంది" అని చెప్పి వెళ్ళి పోయాడు బ్రహ్మ.
అది విని నిశ్చేష్టుడవుతాడు వసంతుడు. సాక్షాత్తూ దైవ సమానులయిన తన గురువు దంపతులకి పుట్టిన పిల్లలకి ఇలాంటి రాత రాశాడేమిటి విధాత అని ఆలోచనలో మునిగిపోయాడు. బ్రహ్మ రాత మార్చగలమా అని తన గురువుని అడిగాడు ఒక రోజు వసంతుడు. "అది అసాధ్యం నాయనా" అని చెప్పాడు గురువు.
పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ వాళ్ళ రాత నిజమవడం కనిపించసాగింది. ఇద్దరికీ చదువు వంటబట్టలేదు. ఎందరికో విద్య నేర్పిన గురువు గారి పిల్లలు ఇలా అయ్యారేమిటా అన్న దిగులుతో వసంతుడికి తన విద్య మీద ఏకాగ్రత కుదరలేదు. పిల్లలిద్దరూ వసంతుడి వెంట అన్నయ్యా...అన్నయ్యా అంటూ తిరుగుతుంటే అతని దుఃఖం ఎక్కువ కాసాగింది. ఒకరోజు గురువుగారితో చెప్పి దేశం చుట్టిరావడానికి వెళ్ళాడు. ఎన్నో చోట్లకి వెళ్ళి ఎందరో పండితులని కలిశాడు. అందరూ బ్రహ్మ రాతని మార్చడం అసాధ్యం అని చెప్పారు. అలా అక్కడా ఇక్కడా తిరుగుతూ తన విద్యాభ్యాసం కొనసాగిస్తూ ఇరవై సంవత్సరాలు గడిపాడు. అప్పటికి గురువుగారు పిల్లలకి పాతికేళ్ళు వచ్చాయి. వారు ఎలా ఉన్నారో చూడాలని తిరిగి వచ్చాడు వసంతుడు.
1 comment:
ఈ కథని "తలరాతని మార్చుకున్న వాళ్ళు" అనే పేరుతో ఒకసారి ఏదో పత్రికలోనో, చందమామలోనో చదివినట్టు గుర్తు. చాలా కాలానికి మళ్ళీ ఇలా ఇక్కడ చూస్తున్నాను. చాలా సంతోషం!
Post a Comment