మన నేతలు చాలా గమ్మత్తైన వాళ్ళు. రాజకీయ నాయకులకి హాస్య ప్రియత్వం లేదని అందరూ అనుకొంటారు కానీ వీళ్ళకున్న సెన్సాఫ్ హ్యూమర్ అంతా ఇంతా కాదు. ఎసీబీ అని ఒక దాన్ని పెట్టి అవినీతి మీద పోరాటం చేయాలని నిర్దేశిస్తారు. అయితే అది తమ కనుసన్నల్లోనే జరగాలని, ఎవరయితే తమకి కన్నులో నలకలాగా ఉంటారో వారి మీదనే ఈ ఏసీబీ అస్త్రాన్ని ఎక్కుపెడతారు. ఎక్కడైనా శ్రీనివాసులు రెడ్డి లాంటి మరీ చురుకైన అస్త్రాలు లక్ష్యం వైపు సూటిగా దూసుకు పోతూ ఉంటే రాత్రికి రాత్రి వాటి గమ్యాలనే మార్చి పారేసి అదేమంటే పని తీరు నచ్చి ప్రమోషనిచ్చాం అంటారు.
అసలు మనకి అవినీతి నిరోధక శాఖ అవసరమా? అవినీతి అంటని నాయకులు ఉంటారని ప్రజలు ఏనాడో మర్చిపోయారు. డైనోసార్ల లాగా అది కూడా ఎనాడో అంతరించిపోయిన జాతి అని అందరూ భావిస్తున్నారు. అసలు ప్రజలు ఇప్పుడు అవినీతిని ఒక మైనస్ పాయింట్‌గా భావించడం మానేశారు. రాజకీయ నాయకులు అందరూ అవినితిలో కూరుకుపోయి కనిపించడం ఒక కారణమైతే ఆ నాయకుల రాతని రాసే ప్రజలు కూడా తమ లెవెల్లో తాము కూడా అవినీతిలో మునిగిపోవడం ఇంకొక కారణం.
కాబట్టి ఎవరూ పెద్ద తప్పుగా భావించని అవినీతిని అరికట్టడానికి ఒక ప్రత్యేక శాఖ అవసరం ఉందా? ఈ అవినీతి నిరోధక శాఖకే పేరు మార్చి అవినీతి నిర్ధారక శాఖ అని ఒక దానిని పెడితే దానివలన చాలా ప్రయోజనాలుంటాయని అనిపిస్తుంది. ఉదాహరణకి ఎవరెంత తిన్నారో తెలిస్తే ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకోవడానికి చిన్నా చితకా నాయకులకి సులభంగా ఉంటుంది. బెల్లం చుట్టూ చీమలు చేరినట్లు ఎవరి దగ్గర ఎంత బెల్లముందో తెలిసి పోతే ఈ చీమలు ఎక్కడ చేరాలో సులభంగా తేల్చుకోగలుగుతాయి.
అలాగే ఓటర్లు కూడా తమ ఓటుకి ఏ పార్టీ కేండిడేట్ దగ్గర ఎంత డిమాండ్ చేయాలో తెలుసుకొని తమకు న్యాయంగా ఎంత రావాలో అంతా తీసుకోగలుగుతారు. దిగువ స్థాయి నాయకుల దగ్గరనుంచి తమకు చేరే సూట్‌కేసుల్లో అందే మొత్తం సరిగ్గా ఉంటుందో లేదో హై కమాండ్ వాళ్లకి కూడా ఒక క్లియర్ కట్ ఐడియా ఉంటుంది.
ఏమంటారు?
4 comments:
correct
నిజమే!
ఏ దేశంలోనైనా పోలీసులు పాలక వర్గంవాళ్ళు చెప్పినట్టే చేస్తారు. అవినీతి నిరోధక శాఖలో పని చేసేది కూడా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసిన అనుభవం ఉన్నవాళ్ళే కదా.
ఈ మధ్య జగన్మోహనాసురుడి అవినీతి గురించి వ్రాయడం లేదేమిటి?
Post a Comment