మొన్నీమధ్య నాకు బాగా తెలిసిన ఒకామె ఫోన్ చేసి తన మోకాళ్ళ నొప్పుల గురించి బాధను చెప్పుకొచ్చింది. అల్లోపతి డాక్టర్ ట్రీట్ మెంట్‌లో ఉందామె. "ప్రతి సారీ నెల రోజులు వాడమని రెండు వేల రూపాయలు మందులు రాస్తున్నారు. అంత పవర్‌ఫుల్ మందులు వాడడం వల్ల నా శరీరానికి ఏమవుతుందో అన్న భయం ఉంది. పైగా పూర్తిగా తగ్గుతాయన్న నమ్మకం నాకే కాదు, ఆ డాక్టర్‌కి కూడా ఉన్నట్టు లేదు. హోమియో ట్రై చేద్దామనుకుంటున్నాను. నీ అభిప్రాయం చెప్పు" అనడిగింది. నాకు డాక్టర్ ఫ్రెండ్స్ ఎక్కువమంది ఉండడం వలన మా బంధువులు, సన్నిహితులు ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తే జేబులకి పడే చిల్లులు తక్కువగా ఉంటాయో అని తెలుసుకోవడానికి నన్ను సంప్రదిస్తుంటారు. నేనూ నా యధాశక్తి సలహాలో, సూచనలో ఇస్తూ ఉంటాను.
"పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడినందువలన కడుపులో అల్సర్స్, కిడ్నీలు పాడవడం లాంటివి జరుగుతాయి. హోమియోలో ఇలాంటి కాంప్లికేషన్స్ ఉండవు. పైగా చాలా చవకయిన విధానం. ఒకసారి ప్రయత్నించి చూడండి. తప్పు లేదు" అని చెప్పాను. తరువాత ఒక నెల రోజులకి ఆమె మళ్ళీ పోన్ చేసింది. "హోమియో సెంటర్‌కి వెళ్ళాను. అక్కడ ఫ్రీ కన్సల్టేషన్ అన్నారు. కానీ ట్రీట్‌మెంట్ మొదలు పెట్టాలంటే ఇరవై వేలు కట్టాలని చెప్పారు. మళ్ళీ వస్తానని చెప్పి వచ్చేశాను" అని చెప్పింది ఆమె. నేను అవాక్కయ్యను. ఇదేదొ ఆపరేషన్‌కి అయ్యే అమౌంట్. సాధారణంగా హోమియోలో అంత బాదుడు ఉండదు. "ఇంతకీ మీ హోమియో డాక్టర్ ఎవరు" అనడిగాను. రోజూ పేపర్లలో, టీవీ చానళ్లలో ఊదరగొడుతున్న ఒక ఇంటర్నేషనల్ హోమియో చైన్ పేరు చెప్పింది.
"అదేనమ్మా మీరు చేసిన తప్పు. హోమియో పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని క్యాష్ చేసుకోవడానికి పుట్టిన పుట్టగొడుగుల్లాంటివి ఇవి. అయినా ఊరు ఊరునా బ్రాంచిలు పెట్టి అన్ని బ్రాంచిల్లో ఒకేలాంటి హోమియో వైద్యం అందిస్తామంటే వీలుకాదు. మారుతీ కారు ఎక్కడ కొన్నా ఒకేలా ఉంటుంది. కానీ వైద్యం అలా కాదు. వైద్యుడిని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఇంటర్నేషనల్ వైద్యాన్ని వదిలి పెట్టి మీ ఊరిలో లోకల్‌గా ఉండే ఎవరైనా మంచి హోమియో డాక్టర్‌ని కలిసి వైద్యం మొదలు పెట్టండి. ఫలితం కనిపిస్తుంది" అని చెప్పాను.
ఈ మధ్య ఈ హోమియో చైన్ ఆఫ్ హాస్పిటల్స్ ఎక్కువ అయి టీవీ చానల్స్‌లో, పేపర్లలో అన్ని రకాల జబ్బులకీ తమ దగ్గర తిరుగు లేని వైద్యం లభిస్తుందని ఉదేస్తున్నాయి. హోమియో వైద్యం అన్నది ఒక బ్రాండ్ కాదు. అది పేషంటుతో మాట్లాడి, లక్షణాలను బట్టి చేసే వైద్యం. డాక్టరు డాక్టరుకీ మారుతూ ఉంటుంది. ఇరవై ముప్పై బ్రాంచిలు పెట్టి అన్ని చోట్లా ఒకే వైద్యం అందిస్తామని ఎలా చెప్తారో అర్ధం కాదు. తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న వైద్యం హోమియో అన్న అభిప్రాయం ఈ చైన్ల వల్ల మారిపోయింది.
4 comments:
Don't assume homoeo is cheaper. There is exploitation in that branch too.
THIS BLOGGER IS FROM KAKINADA.
NOPE.
చాలా మంచి ఇంఫర్మేషన్ చెపారు.నేనూ వెల్దామనుకున్నాను ఆ హాస్పిటల్కి.
Post a Comment