ఈ నెల రెండవ తేధీన పక్కనున్న ఆఫ్ఘనీస్థాన్ నుంచి బయలుదేరి పాకిస్తాన్ సైన్యానికి గానీ, రక్షణ వ్యవస్థకు గానీ అనుమానం రాకుండా ఆ దేశంలో ప్రవేశించి వాళ్ల డిఫెన్స్ అకాడెమీకి అతి సమీపంలో ఒక బిల్డింగ్‌లో తలదాచుకున్న ఒసామా బిన్ లాడెన్‌ని మట్టుబెట్టిన US Navy SEALS సాహసవంతమైన ఆపరేషన్‌ని చూసి అందరం ముక్కున వేలేసుకుని, ముక్త కంఠంతో "శభాష్" అన్నాం. అయితే 35 సంవత్సరాల క్రితమే ఇజ్రాయెల్ కమాండోలు హైజాక్‌కు గురయి ఒక శతృ దేశంలోకి తీసుకు వెళ్ళబడి అక్కడ ఉన్న తమ విమానాన్ని, ప్రయాణికుల్ని క్షేమంగా తమ దేశానికి తీసుకెళ్తూ, హైజాకర్లనీ, వాళ్ళకు మద్ధతుగా తమ మీద దాడి చేసిన ఆ శతృ దేశ సైనికులనీ మట్టుబెట్టిన వీరోచిత గాధ ఆపరేషన్ ఎంటెబ్బీ గురించి ఒక సారి గుర్తు చేసుకోవడం అవసరమని భావించి ఈ పోస్టు పెడుతున్నాను.
ఓపికగా రాస్తే ఈ ఆపరేషన్ గురించి ఒక పెద్ద నవలే రాయవచ్చు. అంచేత టూకీగా రాస్తున్నాను. ఆసక్తి ఉన్నవాళ్ళు గూగుల్‌లో వెదికితే కావలసినంత మెటీరియల్ దొరుకుతుంది.
జూన్ 27,1976 ఉదయాన్న ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నుండి పారిస్‌కు బయలుదేరిన ఒక ఎయిర్ ఫ్రాన్స్ విమానాన్ని అది బయలుదేరిన కాస్సేపటికే నలుగురు పాలస్తానీయులు హైజాక్ చేసి, దారి మల్లించి, ఉగాండా రాజధాని కంపాలాకు సమీపంలోనున్న ఎంటెబ్బీ విమానాశ్రయంలో దింపుతారు. అక్కడ మరో నలుగురు ఉగ్రవాదులు వీరికి తోడవుతారు. ఈ హైజాక్ టీమ్‌కి ఉగాండా అధ్యక్షుడు, నరరూప రాక్షసుడిగా పేరు గాంచిన ఇడీ అమీన్ ఆశీస్సులు ఉన్నాయన్న విషయం జగద్విదితం.
విమానంలో ఉన్న 248 మంది ప్రయాణీకులలో నుండి యూదుల్ని, యూదులు కాని వారిని విడదీసి యూదులు కాని వారిని ఒక విమానంలో ఎక్కించి పంపేస్తారు. అయితే విమానం కెప్టెన్ మాత్రం తను ప్రయాణీకులందరికీ బాధ్యుడిని అని, అందర్నీ వదిలిపెట్టే వరకూ వారితోనే ఉంటానని బందీగా ఉండిపోతాడు. మిగతా సిబ్బందిలో అధికులు తమ కెప్టెన్‌తోనే ఉండిపోతారు. మొత్తం 105 మందిని బందీలుగా ఉంచుకుని హైజాకర్లు ఇజ్రయెల్ ప్రభుత్వానికి అల్టిమేటమ్ జారీ చేస్తారు. ఇజ్రాయెల్ జైళ్ళలో ఉన్న 40 మంది ఖైదీలని, కెన్యా, జర్మనీ, స్విట్జర్లాండ్ జైళ్ళలో ఉన్న మరొక 13 మందినీ విడుదల చేయాలి అన్నది వాళ్ళ డిమాండ్. లేదంటే బందీలనందరినీ చంపేస్తామని అల్టిమేటమ్ జారీ చేస్తారు.
ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ సమస్యని దౌత్యపరంగా పరిష్కరించడానికి అన్ని మార్గాలు వెతికింది. అప్పట్లో ఈజిప్టుకి అధ్యక్షుడిగా ఉన్న అన్వర్ సాదత్ ద్వారా ఇడీ అమీన్‌ని అప్రోచ్ అయింది. మరొక వైపు అమెరికా కూడా తన ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఫలితంగా జులై 4 వరకూ డెడ్ లైన్ దొరికింది గానీ హైజాకర్లు తమ డిమాండ్ మార్చుకోలేదు.
జులై 3 న ఇజ్రాయెల్ కేబినెట్ రెస్క్యూ మిషన్‌కి, Israel Defence Force (IDF) కి అనుమతి మంజూరు చేసింది. అప్పటికే ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ ఎంటెబ్బీ విమానాశ్రయాన్ని నిర్మించిన సంస్థ నుండి బ్లూ ప్రింట్ సంపాదించి, ఒక మోడల్‌ని నిర్మించింది. హైజాకర్లు వదిలి పెట్టిన ప్రయాణీకులనుండి హైజాకర్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది. వారిలో మిలిటరీ ట్రైనింగ్ ఉన్న ఒక వ్యక్తి హైజాకర్ల గురించి, వారి వద్దనున్న ఆయుధాలగురించి పూర్తి సమాచారమందించాడు.ఆపరేషన్‌లో పాల్గొనే టీమ్ విమానాశ్రయం మోడల్‌లో తమ అస్సాల్ట్‌ని ప్రాక్టీసు చేసి మిషన్‌కి సిద్ధమయ్యారు. ఆపరేషన్ థండర్‌స్టార్మ్ అని కోడ్‌నేమ్ పెట్టారు ఈ మిషన్‌కి.
మొత్తం నాలుగు పెద్ద C-130 విమానాలలో కమాండో టీమ్, వాళ్ళకి శత్రు సైనికుల నుండి ఆటంకం కలిగితే వాళ్ళతో పోరాడడానికి ఒక సైనిక దళం, వాళ్ళకి అవసరమైన వాహనాలతో బయలుదేరాయి. ఈ విమానాలననుసరించి మరో రెండు బోయింగ్ విమానాలు వెళ్ళాయి. ఒక దానిలో మెడికల్ టీమ్ ఉంది. మరొక విమానం కింద ఆపరేషన్ జరిగినంత సేపు విమానాశ్రయం మీద చక్కర్లు కొడుతూ కింద జరుగుతూ ఉన్న ఆపరేషన్‌కి కాపలా కాసింది..
ఈజిప్టు, నైరోబి,కెన్యా,సోమాలియా, ఇథియోపియాల మీదుగా తక్కువ ఎత్తులో ఎగరడం ద్వారా వాళ్ళ రాడార్లకి అందకుండా రాత్రి 11 గంటల సమయంలో ఎంటెబ్బీని చేరుకుంది ఈ దాడి బృందం.
Rescue Operation
విమానం లాండయ్యే సమయానికే దాని కార్గో బే తెరిచి అందులోంచి అచ్చు ఇడీ అమీన్ వాడే నలుపు రంగు మెర్సిడెస్ బెంజ్ ఒకటి, అతని కేన్వాయ్‌లో ఉండే వాహనాలని పోలిన మరో రెండు వాహనాలలో ఇజ్రాయెల్ కమాండోలు విమానాశ్రయం టెర్మినల్ వైపు దూసుకెళ్ళారు. ఆ సమయానికి అమీన్ విదేశీ పర్యటనలో ఉండడంతో, స్వయానా ఇడీ అమీనే విమానం దిగి వెళ్తున్నాడని విమానాశ్రయంలో సెక్యూరిటీ గార్డులు భావిస్తారని ఇజ్రాయెలీల అంచనా. అయితే అంతకు కొన్నాళ్ళ క్రితమే నలుపు బెంజ్ స్థానంలో తెల్ల బెంజ్ కొన్నాడు. వీళ్ళ నల్ల బెంజ్‌ని ఇద్దరు గార్డులు ఆపడంతో వాళ్ళిద్దరినీ సైలెన్సర్ బిగించిన తుపాకులతో కాల్చారు. అయితే వాళ్ళు కింద పడ్డారే గానీ చావలేదు. అది గమనించిన వెనక వాహనంలో వచ్చే కమాండో ఒకడు తన అటోమేటిక్ తుపాకితో వాళ్ళిద్దరినీ కాల్చి చంపాడు. ఆ చప్పుడుకి హైజాకర్లు అలర్టవుతారేమోనని భావించిన కమాండోలు వేగంగా టెర్మినల్ వైపు దూసుకెళ్ళారు.
లోపలికెళ్ళడానికి ఎలాంటి ఆటంకం ఎదురవలేదు. మధ్యలో ఉన్న హాలులో బందీలందరూ కూర్చుని ఉన్నారు. వాళ్ళకి కాపలాగా నలుగురు హైజాకర్లు ఉన్నారు. ఇలాంటి ఆపరేషన్‌ని ఊహించకపోవడంతో వాళ్ళు చాలా రిలాక్స్‌డ్‌గా ఉండడం కమాండోలకు బాగా కలిసి వచ్చింది. లోపలికి వెళ్ళగానే, "ఎవరూ పైకి లేవద్దు. అందరూ కూర్చోండి. మేము ఇజ్రయెలీ సైనికులం" అని మెగాఫోన్‌లో ఒక కమాండో హీబ్రూ అరిచాడు. ఏం జరుగుతుందో తెలిసే లోపలే ఇద్దరు హైజాకర్లని మట్టుబెట్టారు. ఇలోగా మిగతా ఇద్దరు హైజాకర్లు అలర్టయి ఎదురు కాల్పులు జరిపారు.
ఈ సంఘటనలో కన్ఫ్యూజయి ఒక వ్యక్తి పైకి లేవడంతో, అతన్ని హైజాకర్‌గా భావించి కమాండోలు కాల్చి చంపారు. కాల్పులు ఎదురు కాల్పులలో మరో ఇద్దరు బందీలు మరణించారు. మిగిలిన ఇద్దరు హైజాకర్లని కూడా చంపాక, " మిగిలిన వాళ్ళెక్కడ?" అని బందీల నడిగాడు ఒజ కమాండో. బందీలు లోపలి గది వైపు చూపించడంతో ఆ గది తలుపులు తెరిచి లోపలికి గ్రనేడ్లు విసిరారు. బయటకి పరుగెత్తుకొచ్చిన మిగిలిన హైజాకర్లని కాల్చి చంపడంతో ఒక ఘట్టం పూర్తయింది.
బందీలని అందర్నీ బయటకి నడిపించి విమానాలలోకి ఎక్కించారు. అప్పటికి జరుగుతున్న సంగతి పసిగట్టిన విమానాశ్రయ సిబ్బంది కాల్పులు జరపడంతో బయట అలాంటి పరిస్థితి ఎదురవచ్చని వేచి చూస్తున్న ఒక బృందం వారి మీదకి కాల్పులు జరిపి వారిని అంతం చేసింది. ఈలోగా మరొక బృందం విమానాశ్రయంలో ఉన్న ఉగాండాకి చెందిన మిగ్ విమానాలని ధ్వంసం చేసి, మిగిలిన రన్‌వేల పైన బాంబులు వేసి నాశనం చేసి, తమ విమానాలని అవి వెంబడించే అవకాశం లేకుండా చేసింది.
క్షణాలలో బందీలందర్నీ విమానాలలో ఎక్కించారు. ఉగాండా సైనికుల కాల్పులలో కమాండో బృందానికి నాయకత్వం వహిస్తున్న యోనాధన్ నెతన్యాహు మరణించాడు. అతని మృత దేహాన్ని కూడా విమానంలో ఎక్కించి ఇజ్రాయెల్ విమానాలు గాల్లోకి లేచాయి. ఈ విమానాలు గాల్లోకి ఎగరగానే వాటి వెంట వచ్చిన యుద్ధ విమానాలు మరొక రౌండు బాంబులేసి విమానాశ్రయాన్ని నేలమట్టం చేశాయి. వచ్చిన దారిలోనే, మధ్యలో ఎలాంటి ఆటంకం లేకుండా టెల్ అవీవ్ చేరుకోవడంతో మిషన్ పూర్తయింది.
ఈ మిషన్ జరగడానికి ముందు బందీలలో ఒక మహిళ అనారోగ్యానికి గురవడంతో ఆమెని ఒక స్థానిక ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. దానితో ఆపరేషన్ పూర్తయినా ఆమె ఉగాండాలో ఉండిపోవల్సి వచ్చింది. ఆపరేషన్ వివరాలు తెలిశాక అగ్గి మీద గుగ్గిలమైన ఈడీ అమీన్ ఆదేశాల మేరకు ఉగాండా పోలీసులు ఆమెని కాల్చి చంపారు.
ఈ ఆపరేషన్‌లో కమాండో బృందానికి నాయకత్వం వహించి, ఆ పనిలో మరణించిన యోనాధన్ నెతన్యాహు సోదరుడు బెంజమిన్ నెతన్యాహు తరువాత ఇజ్రాయెల్ ప్రధాని అయ్యాడు.
ఊహించినట్లుగానే అరబ్ ప్రపంచం, సోవియట్ రష్యాలు ఈ ఆపరేషన్ ఉగాండా సార్వభౌత్వాన్ని ఉల్లంఘించడం అని ఖండిస్తే, అమెరికా తదితర పాశ్చాత్య దేశాలు సమర్ధించాయి.
ఈ ఆపరేషన్ గురించి చదివినప్పుడల్లా హైజాక్ చేసి ఖాందహార్‌లో దింపబడ్డ మన విమానం, దాన్ని విడిపించడానికి ఉగ్రవాదులని సగౌరవంగా ఒక విమానంలో తీసుకెళ్ళి విడిచిపెట్టిన జశ్వంత్ సింగూ అలా విడిపించమని నిrణయం తీసుకున్న ఉక్కు మనిషి అద్వానీ గుర్తుకొస్తారు.
8 comments:
Yes, Operation Entebbe అనేది నాకు ఎన్నిసార్లు డిస్కవరీ చానెల్ లో చూసినా, యూ ట్యూబు లో చూసినా కూడా రోమాలు నిక్కబొడుచుకునే అనుభవాన్నిచ్చే అనుభవం కలుగుతుంది. మీరన్నట్లు ఆపరేషన్ బిన్ లాడెన్, అస్సలే మాత్రమూ పోలికలోకి రాదు. అంతగా తేడా వస్తే అమెరికన్ ప్రసిడెంట్ పాకిస్తాన్ అథారిటీస్ కి ఫోన్ చేసి, ఆపరేషన్ జరుగుతోంది, మీరడ్డం రావద్దు అని చెప్పే వెసులుబాటు ఉంది. Entebbe లో అది లేదు. అసలు చుట్టూ శత్రు దేశాలే,ఫ్యూయల్ రీఫిల్లింగ్ అనేదే పెద్ద సమస్య, దానికి సందు దొరకడమే ఎక్కువ. వాళ్ళ కాబినేట్ మీటింగూ, ఎయిర్ బార్న్ అయ్యి మద్యలోకెళ్ళే దాకాఆపరేషన్ కి గో ఎహెడ్ అనే పర్మిషన్ రాకపోవటం..ఆపరేషన్ లో Jonathan Netanyahu చనిపోవటమ్ ఇవన్నీ కూడా, చూసినప్పుడల్లా నన్ను ఎమొషనల్ చేస్తాయి.
అసలా మధ్య రాత్రి సైనికాధికారుల గెటప్పుల్లో, వాళ్ళ కార్ల నమూనాలతో, వాళ్ళ జెండాలతో లైట్లు లేకుండా రన్ వే మీద దిగి, అతి తక్కువ ప్రాణ నష్టం తో, ఆపరేషన్ సక్సెస్ చేపించటం అనేది, నభూతో నభవిష్యత్.
Actually Operation Entebbe is being taught as a subject in Academia.
good information.
అబ్బ ! బాగా నెరేట్ చేసారు. ద లాస్ట్ కింగ్ ఆఫ్ స్కాట్లాండ్ సినిమా గుర్తొచ్చింది. కాందహార్ ఉదంతం ప్రపంచ గతి నే మార్చేసింది.
nice post.
అంత దూరం తక్కువ ఎత్తులో విమానాలు నడపడం అసాధ్యం అనిపిస్తుంది. బాగా రాశారు చెప్పుదండ. ఇలాంటి సాహసాలు చేస్తారు కాబట్టే అన్ని తోడేళ్ళ మధ్య సింహంలా వుండే ఇజ్రేయిల్ అంటే నాకూ అదోరకమైన అభిమానం.
రష్యా కూడా వుగాండా సార్భౌమత్వాన్ని ఖండించేదేనా! మొన్నని జార్జియాలో, అంతకుముందు 10ఏళ్ళు ఆఫ్ఘనిస్థాన్లో వాళ్ళు వెలగబెట్టినదేంటో!
ధన్యవాదాలు కుమార్, సుజాత, తేజస్వి, స్పారో, అనోనిమస్.
ప్రవీణ్ మరేం పర్లేదు.
Dear Krishna, Thanks for such a wonderful post.
I dint know about this incident so far. Not sure how I missed it.
I will definitely watch this in Youtube or somewhere.
I've seen "Munich" movie many times. It is also one of the epic how Israelis(Mossad) perform their commando operations successfully.
I admire their heroics.
There are some movies on this episode. Try to see them. really daring operation.
Post a Comment