నైజాం నవాబు వేసుకునే దుస్తులని పెట్టుకునే వార్డ్‌రోబ్ శుభ్రం చేయడానికి ముగ్గురు మనుషులు ఉండేవారట. ఇక నవాబు గారి ఆభరణాలకు, ఇతల విలాస వస్తువులకు లెక్క కట్టాల్సి వస్తే పెద్ద పెద్ద ఆడిటింగ్ కంపెనీలు కావాల్సిందే. అదంతా అప్పటి విషయం ఇప్పుడు అంత వైభవం, విలాసం మెయిన్‌టెయిన్ చేయడం అయ్యేపని కాదు అని ఎవరయినా అనుకుంటే అది తప్పు అని కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి నిరూపిస్తున్నారు.
ఇనుప ఖనిజపు గనులకు అధిపతి అయిన రెడ్డి గారు కూర్చునే బంగారు కుర్చీ ఖరీదు అక్షరాలా రెండు కోట్లా ఇరవై లక్షలు, ఆయన చేత పూజలందుకొనే దేవుడి ప్రతిమల ఖరీదు రెండున్నర కోట్లు, ఆయన ధరించే బెల్టు పదమూడు లక్షలు. ఇక ఆయనవీ, ఆయన సతీమణివీ ఆభరణాల లెక్కలు మూడు పేజీల నిండా ఉన్నాయి. ఇందులో బంగారు గాజులు, దండలు, విలువైన రాళ్లతో చేసిన ఆభరణాలు ఉన్నాయి. ఇక వెండి వస్తువులకయితే అంతే లేదు. అలాగే ఇంటినిండా ఉన్న ఖరీదైన ఏసీలు, టీవీలు, ఫర్నిచర్ అన్నీ కూడా లక్షల్లోనే విలువ చేస్తాయి.
అయితే బ్రూనై సుల్తాన్ లాగా గాలి గారి టయిలెట్ సీట్ కూడా బంగారుదేనా అన్న వివరం మాత్రం తెలియదు.
ఈ లెక్కలన్నీ ఆయనంటే పడని వాళ్ళో, కర్ణాటక గవర్నరో చెప్పినవి కాదు. స్వయానా శ్రీ గాలి గారు కర్ణాటక లోకాయుక్తకి దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆయన పొందుపరచిన వివరాలు.
ఇనుముని బంగారం చేయడమంటే ఇదే కాబోలు.
5 comments:
బిల్ గేట్స్‌కే ఇన్ని జల్సాలు ఉండవు.
enni kurchukunnaa chivaraku velledi mattiloke ane gamanika ledu
బిల్ గేట్స్ డబ్బు తేరగా వచ్చింది కాదు కాబట్టి ఇన్ని జల్సాలు ఉండవేమో?
బిల్ గేట్స్ కూడా సులభంగా డబ్బు సంపాదించినవాడే. కొన్ని హార్డ్‌వేర్ పరికరాలు మైక్రోసాఫ్ట్ విండోస్ సిస్టమ్‌తోనే పని చేస్తాయి. అవి కావలసినవాళ్ళు తప్పనిసరిగా మైక్రోసాఫ్ట్ విండోస్ కొంటారు. 1999లో విండోస్ 95 సిడి ధర 25,000 రూపాయలు ఉండేది. మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులకి అంత డిమాండ్ ఉంది. గాలి జనార్ధనరెడ్డిలాగ టాయ్‌లెట్ సీట్లకి బంగారం వాడే పిచ్చి ఎవరికీ ఉండదు.
దుర్గేశ్వర్ గారూ నాకు మీ కామెంటు చూశాక ఎప్పుడో చదివిన ఒక రష్యన్ కథ గుర్తొచ్చింది. ఒకడు తనకి భూమి కావాలని ఒక nomad నాయకుడి వద్దకు వస్తాడు. అతను కొంత డబ్బు తీసుకుని కళ్ళ ముందున్న భూమిని చూపించి "ఇదంతా మాదే. కొన్ని రాళ్ళు తీసుకో. సాయంత్రం వరకూ నువ్వు ఎంత నేలని చుట్టి రాగలిగితే ఆ భూమి చుట్టు హద్దుగా ఈ రాళ్ళు పెట్టు. అదంతా నీకిస్తం" అంటాడు. ఈ రైతు ముందు నడకతో ఆరంభించి ఆ తరువాత పరుగందుకుంటాడు. ఎక్కడ చూసినా సారవంతమైన నేల కావడంతో ఎక్కడా ఆపాలనిపించదు. ఆ ఎండలో అలా నిర్విరామంగా పరుగు తీసి మద్యాహ్నానికి కింద పడి చచ్చిపోతాడు. చివరికి అతనికి దక్కింది ఆరడుగుల నేల.
Post a Comment