ఆరోగ్యశ్రీ పథకంలో శాస్త్రీయత లేదని నిపుణులు గొంతు చించుకొంటున్నా, ఓట్లు రాల్చడంలో అది పాశుపతాస్త్రమని ఎవరయినా ఒప్పుకోక తప్పదు.ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని ఒక కార్పొరేట్ హాస్పిటల్‌కి వెళ్ళి ఒక సాధారణ పౌరుడు పైసా ఖర్చు లేకుండా వైద్యం చేయించుకోవడమనేది చాలా గొప్ప పాపులిస్టు స్కీము. కానీ ఇది ఆచరణలో ప్రజల ఆరోగ్యంతో ఆడుకొంటున్న విషయాన్ని అప్పుడప్పుడూ మీడియా బయటపెడుతున్నా అది ఎంత తీవ్రంగా ఉందన్నది ఈ పథకంతో బాగా పరిచయమున్న డాక్టర్లతో మాట్లాడితే తెలుస్తుంది.
కడుపు కోత అని హెడ్ లైన్స్ పెట్టి ఆ మధ్య అన్ని చానళ్ళూ ఆరోగ్యశ్రీ పథకం కింద ఎడాపెడా చిన్న వయసులో ఉన్న యువతులకి కూడా ఎలా గర్భ సంచులు కోసి పారేస్తున్నారో బయట పెట్టారు. కానీ ఇదొక్కటే కాదు. హైదరాబాద్‌లో ఒక హాస్పిటల్‌కి ఒక పేషంటు హెర్నియా సమస్యతో వెళితే అది ఆరోగ్యశ్రీ లో లేదని ఆ పథకంలో ఉన్న గాల్‌బ్లాడర్ తీసేసే ఆపరేషన్(కోలిసిస్టెక్టమీ) చేయడం కూడా అప్పట్లో కొంత సంచలనం సృష్టించింది.
ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకోని కడుపునొప్పితో హాస్పిటల్‌కి వెళితే ఆడవారికయితే గర్భసంచి, మగవారికయితే గాల్ బ్లాడర్ తీసి వేయించుకోకుండా బయటకి రాలేని పరిస్థితి. చాలామందికి గాల్ బ్లాడర్‌లో రాళ్ళు ఉంటాయి. ఇవి చిన్నవిగా ఉంటే వీటి వలన ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అయితే ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్‌కి అప్రూవల్ ఇచ్చేటప్పుడు స్కానింగ్‌లో ఏముందా అని చూస్తారు తప్ప ఆప్రూవల్ ఇచ్చే డాక్టరు పేషంటుని చూడరు. ఎందుకంటే ఈ అప్రూవల్ ఇచ్చే డాక్టరు హైదరాబాద్‌లో ఉంటాడు. ఆన్‌లైన్‌లో స్కానింగ్ రిపోర్టులో ఏముందో చూసి అప్రూవల్ ఇస్తాడు. కాబట్టి ఈ రాళ్ళ వలన పేషంటుకి ఏదైనా ఇబ్బంది ఉందా లేదా అని చూసే పరిస్థితి లేదు.
మరొక అంశమేమంటే అపెండిసైటిస్ లాంటి కంప్లైంటుతో వెళ్ళినా స్కాన్‌లో అపెండిసైటిస్‌తో బాటు గాల్ బ్లాడర్‌లో రాళ్ళు కనుక ఉన్నట్లయితే రెండు ఆపరేషన్లకీ పర్మిషన్ తీసుకొని రెండు ఆపరేషన్లూ చేసి రెండింటికీ డబ్బులు తీసుకుంటారు హాస్పిటల్ వాళ్ళు. తేరగా ఆపరేషన్ అయిపోతూంది కదా ఇందులో తప్పు బట్టడానికి ఏముంది అని ఎవరయినా అడగొచ్చు. అవసరం లేని ఆపరేషన్ చేయడం వల్ల అనవసరంగా కాంప్లికేషన్‌లు వస్తాయని ఏ నిపుణుడిని అడిగినా చెప్తారు.
ఈ అనవసర ప్రమాదకర ఆపరేషన్‌ల లిస్టులో మరొక కేటగిరీ వెన్నుపూస ఆపరేషన్లు. వెన్నుపూసల మధ్యలో ఉన్న డిస్కు జారిపోవడమనేది చాలా మందిలో ఉన్న సాధారణ సమస్య. ఇది చాలా మటుకూ మందులతో, ఎక్సర్‌సైజులతో తగ్గుతుంది. కొన్ని సార్లు ఏ వైద్యం చేయకపొయినా కొన్నాళ్ళు వేచి చూడడం వల్ల కూడా తగ్గిపోతుంది. అయితే MRI scan లో డిస్కు జారిన చాయలు కనిపిస్తే ఆపరేషన్‌కి అప్రూవల్ వచ్చేస్తుంది. కాకపోతే పేషంటుతో తనకి ఈ సమస్య ఆరునెలల పైగా ఉందనీ, మందులు వాడినా తగ్గడం లేదని చెప్పించి ఆ వీడియో క్లిప్ కూడా జత చేయాల్సి ఉంటుంది. అలా చెబితే ఉచితంగా ఆపరేషన్ అయిపోతుందని చెప్పి పేషంటుతో అలా చెప్పించడం పెద్ద పనేమీ కాదు కదా.
ఇందులోనే మరొకటి spondylolisthesis. వెన్నుపూసలు ఒక దాని మీద మరొకటి జారడం. దీనిలో చాలా స్థాయిలు(grades) ఉంటాయి. 3,4 grades లో కానీ ఆపరేషన్ అవసరముండదు. అయినా MRI scan లో వెన్నుపూస జారిన చాయలు కనిపిస్తే ఆపరేషన్‌కి అప్రూవల్ వస్తుంది. దీనికి ప్యాకేజీ 60,000 రూపాయలు. ఈ ఆపరేషన్‌లో వెన్నుపూసలకి రాడ్లు, స్క్రూలు వేసి బిగించడం ఉంటుంది. ఇంత ప్యాకేజీ ఉన్నప్పుడు ఈ జబ్బుతో ఆరోగ్యశ్రీ గుర్తింపు ఉన్న హాస్పిటల్‌కి వెళ్ళి ఆపరేషన్ జరక్కుండా పేషంటు బయటకి రావడం చాలా కష్టమైన విషయం.
కొన్ని సార్లు ఎత్తు నుండి పడడం, లేదా వాహనాల ప్రమాదాల్లోనూ వెన్నుపూసకి దెబ్బ తగలవచ్చు. ఇలాంటి ప్రమాదాల్లో చాలా సార్లు ఆపరేషన్ అవసరం ఉండదు. Stable fractures అంటారు వాటిని. అయినా ఎక్స్ రేలో ఫ్రాక్చర్ కనిపిస్తే ఆరోగ్యశ్రీలో ఆపరేషన్‌కి అప్రూవల్ వచ్చేస్తుంది. కాబట్టి చాలాసార్లు ఆపరేషన్ జరిగిపోతుంది.
ఈ ఎడా పెడా ఆపరేషన్లతో ఇప్పటికి పేషంట్లు హ్యాపీగా ఉండొచ్చు.పైసా ఖర్చు లేకుండా ఆపరేషన్ జరిగిపోయిందని ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, పథకం పెట్టిన మహా నేతకూ మనసులో జేజేలు కొట్టొచ్చు. కొన్నాళ్ళు గడిచాక ఈ ఆపరేషన్ల తాలూకూ దుష్పరిణామాలు బయట పడడం మొదలయ్యాక ఉంటుంది అసలు కష్టం. ఆపరేషన్ తరువాత సంవత్సరం గడిస్తే ఆపరేషన్ చేసిన హాస్పిటల్‌కి పేషంటు గురించి ఎలాంటి బాధ్యతా ఉండదు. అప్పుడు ఈ కాంప్లికేషన్లకి సంబంధించిన వైద్యం చేయించుకోవాలంటే పేషంటు తన స్వంత డబ్బు కక్కాల్సిందే.
6 comments:
రాజశేఖరరెడ్డి చనిపోయినా అతని స్కీమ్‌తో కార్పరేట్ ఆసుపత్రులకి కనక వర్షం కురుస్తోంది.
కొన్ని హాస్పిటల్స్ కేవలం ఈ స్కీముని నమ్ముకునే నడుస్తున్నాయంటే మీరు నమ్మగలరా?
శ్రీకాకుళం పట్టణ శివార్లలోని రాగోలు గ్రామం దగ్గర కొత్తగా కట్టిన మెడికల్ కాలేజిలో సీట్ ధర ముప్పై లక్షలు. అంత డబ్బు ఖర్చు పెట్టి సీట్ కొనుక్కున్నవాళ్ళు డాక్టర్లైన తరువాత ఆరోగ్యశ్రీనే నమ్ముకుంటారు.
మన ముఖ్యమంత్రి ఇది చదువుతాడో లేదో కానీ అతనికి మెయిల్ పంపాను. తమిళనాడు ప్రభుత్వం ఆరోగ్యశ్రీని రద్దు చేసింది. ఆ డబ్బులు మిగిలితే బోలెడన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలు పెంచొచ్చు.
But what about votes?
విశాఖపట్నం జిల్లాలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కావాలనే ఆరోగ్యశ్రీ నుంచి తప్పుకున్నాయి. కొన్ని ఆసుపత్రులు మొదటి నుంచి ఆరోగ్యశ్రీలో చేరలేదు. ఎందుకంటే న్యూరోసర్జరీ లాంటి ఆపరేషన్‌లకి ప్రభుత్వం ఇచ్చే డబ్బు వాళ్ళకి సరిపోదు. ఇప్పుడు విశాఖపట్నం జిల్లాలో 19 ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రమే ఆరోగ్యశ్రీ పరధిలో ఉన్నాయి. ఈ విషయం సాక్షి పత్రికవాళ్ళకి తెలిస్తే అదంతా కిరణ్ కుమార్ రెడ్డి కుట్ర అంటూ వార్తలు వ్రాస్తారు. కొన్ని ఆసుపత్రులు రాజశేఖరరెడ్డి టైమ్‌లో కూడా ఆరోగ్యశ్రీలో చేరలేదనే నిజాన్ని కావాలని మర్చిపోతారు.
Post a Comment