అదేదో కంపెనీ యాడ్‌లో ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అని చెప్తారు. అది నిజమే. కొన్ని ఐడియాలు జీవితాలనే కాదు ప్రపంచాన్ని కూడా మార్చగలవు. అయితే ఇదంత తేలిక కాదు. జీవితాన్ని మార్చగల ఐడియా పుట్టాలంటే బుర్రలో కొంచెం గుజ్జు, గ్రే మాటర్ అంటారు, ఉండాలి. దానికి పని పెట్టాలి. ఇవన్నీ ఉన్నా కొంచెం అదృష్టం కలిసి రావాలి. ఇదంతా అంత తేలిక యవ్వారం కాదు. ఎవరైనా వచ్చి నాకు ఉద్యోగం రావడం లేదు అనో, పరీక్షల్లో సరయిన మార్కులు రావడం లేదనో, వ్యాపారంలో అభివృద్ధి ఉండడం లేదనో చెబితే ఇలా జీవితాన్ని మార్చగల ఐడియా తెచ్చుకోండి అని చెబితే వాళ్ళు అంత హాపీగా ఫీలవరు. ఎందుకంటే తమని తాము మార్చుకుని విజయం వైపు నడవాలంటే అంత తేలిక పని కాదు.
ఈ నసంతా వద్దు. చిన్న పని చేయడం ద్వారా అనుకున్న ఫలితాన్ని సాధించవచ్చు అని చెబితే వినడానికి చాలా సమ్మగా ఉంటుంది. అద్భుత దీపం లోంచి భూతం బయటకొచ్చి మనకి కావలసినవన్నీ మన ముందు ప్ర్డితే ఎలా ఉంటుందో ఇదీ అలాగే ఉంటుంది. పూజలూ, పునస్కారాలు, తాయెత్తులూ ఎలాంటివే. వీటన్నింటిలోకి తేలికయినది ఇంకొకటి ఉంది.
********* **********
Bhaschkarr Raaju ఈ పేరు చదివారా? భాస్కర్ రాజుని ఇంగ్లీషులో కూడా ఇలా రాస్తారా అన్న అనుమానం వచ్చిందా? కొంతమంది అతి తెలివితోనో, తెలివి తక్కువతోనో తమ పేరుని ఇలా రాసుకుంటారు. దీన్ని చదివితే భాష్కర్ రాజు అని చదవాలి. ఎవడో మందు కొట్టి పిలిచినట్టు అనిపిస్తోంది కదూ. ఇదంతా న్యూమరాలజీ మహిమ.
వారానికొక రోజు సాక్షి పేపర్‌లో, వారానికి ఆరు రోజులు మహా న్యూస్ చానల్‌లో ఉదయం వేళ న్యూమరాలజీతో తమ సమస్యల పరిష్కారానికి ప్రజలు ప్రశ్నలు అడుగుతారు. ఒకసారి వాటిని చూడండి. వివేకం ఉన్న వారికి ఎవరికయినా నవ్వొస్తుంది.
"మీ బర్త్ నంబర్ బావుంది. డెస్టినీ నంబర్ బావోలేదు. Rajani అన్న పేరుని Rajjanni అని రాయండి/ Mahesh అన్న పేరుని Mmahesch అని రాయండి. ఇలా రోజుకి 120 సార్లు చొప్పున 120 రోజులు రాయడం ప్రాక్టీసు చేయండి. మీరు పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తారు/ ఉద్యోగ ప్రయత్నంలో విజయం సాధిస్తారు/ ప్రమోషన్ వస్తుంది/ పెళ్ళవుతుంది/ కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి." ఇలా ఉంటాయి ఆ సమాధానాలు.
మహా న్యూస్‌లో అయితే నెహ్రూ అనే ఒక కామెడీ పెద్దాయన( ఆయన తన పేరుని NEHHRRUU అని రాసుకుంటాడు) మధ్య మధ్యలో ఒక పెన్నూ పేపరు మీద లెక్కలేసి, మీ సమస్య ఇక్కడ పరిష్కరించడానికి సమయం చాలదు. అప్పాయింట్‌మెంట్ తీసుకుని నేరుగా కలవండి అని తన బిజినెస్‌ని ప్రమోట్ చేసుకుంటూ ఉంటాడు. బొచ్చెడు ఫీజు తగలేసి అప్పాయింట్‌మెంట్ తీసుకుని తమ సమస్యలకి పరిష్కారాలు వెతుక్కునే మహానుభావులుంటారు. నవ్వుకోవద్దు.
అయినా స్పెల్లింగుకీ జీవితానికి సంబంధమేమిటి అని అలోచించరెందుకు. పేరు బాగాలేదని మార్చుకోవడం ఒక విధంగా సరే. లావణ్య అన్న అమ్మాయికీ, పుల్లమ్మ అన్న అమ్మాయికీ సమాన అర్హతలుంటే లావణ్యకి ఎక్కువ అవకాశాలొచ్చే చాన్సుంది. అలాగే కొంచెం పాత తరహా పేర్లని మార్చుకోవడం సినిమా ఫీల్డులో మామూలే. భక్త వత్సల నాయుడు మోహన్ బాబయ్యాడు, శోభనాద్రి శోభన్ బాబయ్యాడు. కానీ మిగతా రంగాల్లో పాత చింతకాయ పేర్లు విజయానికి అడ్డు కాదని పాపులర్ షూస్ పిచ్చయ్య గారు, స్వీట్స్ పుల్లారెడ్డి గారు నిరూపించారు.
ఈ స్పెల్లింగు మార్చుకొనే పిచ్చి ఇప్పుడు హిందీ నటుల్లో బాగా ముదిరింది. Ajay Dvgn, Suneil Shetty ఇందుకు ఉదాహరణలు. IPL లో పరాజయాల పరంపరలో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టు పేరుని కూడా న్యూమరాలజీని అనుసరించి మార్చి పారేసి వచ్చే సారి కప్పు ఎగరేసుకొని పోవడానికి సిద్ధమవుతోంది సొట్ట బుగ్గల, బూరె బుగ్గల చిన్నది ప్రీతీ జింటా.
No comments:
Post a Comment