ముక్కు మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. వాసన చూడ్డానికే కాకుండా ముఖానికి అందాన్నివ్వడంలో కూడా ముక్కుకి చాలా ప్రాధాన్యత ఉంది. కావ్య నాయికలకి ముక్కు కోటేరేసినట్లు ఉంటుంది. కమేడియన్లకి గద్ద ముక్కు ఉంటుంది. గొల్లపూడి మారుతీరావు గద్దముక్కు పంతులుగా కొన్ని సినిమాల్లో నటించాడు. పినోచియో అనే కామిక్స్ కారెక్టరుకి అబద్దం చెప్పినప్పుడల్లా ముక్కు పొడవు పెరుగుతుంది. ఈ శాపం మన రాజకీయ నాయకులకి గనుక ఉన్నట్లయితే ఒక్కొక్కడికి పదేసి కిలోమీటర్ల పొడవునా ముక్కులు ఉండేవేమో!
ముక్కు షేపు బాగా లేకపోతే దేవుడ్ని తిడుతూ కూర్చోనే రోజులు కావు ఇప్పుడు. కాస్మెటిక్ సర్జన్ దగ్గరకు వెళితే కావలసిన సైజుకి, షేపుకి మన ముక్కుని మార్చి పారేస్తాడు. రైనోప్లాస్టి అని పిలిచె ఈ ఆపరేషన్‌ని క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలోనే మన దేశంలో సుశ్రుతుడు చేశాడు. ఇప్పటికీ ఈ ఆపరేషన్‌ని ఇంచుమించు అదే పద్దతిలో చేస్తున్నారు.
సినీ తారలు ఎక్కువగా ఈ ఆపరేషన్‌ని చేయించుకుంటారు. శ్రీదేవితో మొదలుపెట్టి కత్రినా కైఫ్, రాణీ ముఖర్జీ, కంగన రనౌత్, మినిషా లంబా, కరీనా కపూర్ లాంటి తారలందరూ తమ ముక్కుని కాస్మెటిక్ సర్జన్ కత్తి కింద పెట్టిన వారే.
అయితే పెద్ద ముక్కు ఉండడం ఒక గొప్పగా బావించే వాళ్ళు ఒక క్లబ్ లాగా ఏర్పడి ప్రతి అయిదేళ్ళకీ ముక్కు సైజులో పోటీలు పెట్టి ప్రైజు ఇచ్చే ఆచారం జర్మనీలోని లాంగెన్‌బ్రుక్ అనే ఊరిలో ఉంది. గత యాభయి ఏళ్ళుగా ఇక్కడ ఈ ఆచారం కొనసాగుతూ ఉంది. 1961 లో ఇక్కడి ఒక పబ్‌లో కొందరు తాగుబోతుల మధ్య సరదాగా మొదలయిన ఒక గొడవ ఈ ఆచారానికి నాంది.
1961 లో ఒక సాయంత్రం పబ్‌లో మందుకొడుతూ కొందరు ముక్కు సైజుల గురించి ఒకరినొకరు ఎత్తి పొడుస్తూ ఉండగా వారికి ఈ ఆలోచన వచ్చింది. ముక్కు పొడవులో పోటీ పెడితే ప్రైజు నీకొస్తుంది అంటే నీ కొస్తుంది అని అనుకొంటూ ఉండగా మాక్స్ రిచర్ట్, విలియమ్ హోఫ్లర్ అనే ఇద్దరికి ఈ ఆలోచన వచ్చి పెద్ద ముక్కు ఉన్న వారి సంఘం అని ఒక దాన్ని స్థాపించి పోటీలు పెట్టాలని నిర్ణయించారు.
ప్రతి అయిదేళ్ళకి ఒక సారి జరిగే ఈ పోటీలలో 60మిల్లీ మీటరు పొడవూ, 40 మిల్లీ మీటర్లూ వెడల్పు ఉన్న వాళ్ళెవరైనా పాల్గొనవచ్చు. ఈ పెద్ద ముక్కు క్లబ్‌లో ఇప్పటివరకూ 330 మంది రిజిస్టరయిన సభ్యులు ఉన్నారు. ముక్కు పొడవు, వెడల్పు కొలవడానికి వీళ్ళు ఒక ప్రత్యేకమైన్ పరికరాన్ని రూపొందించారు. కొలిచే సమయంలో ముక్కు పొడవు పెరిగేలా చేయడానికి మొహం చిట్లించడం, మొహాన్ని వింత వింతగా తిప్పడం లాంటివి కూడా చేయవచ్చు. ప్రస్తుతం ఈ పెద్ద ముక్కు చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన వ్యక్తి ముక్కు పొడవు అయిదు అంగుళాలు. అంతకన్నా పెద్ద ముక్కు ఉన్న వాళ్ళెవరైనా ఉంటే ఈ పోటీలో పాల్గొన వచ్చు.
2 comments:
ఆయనెవరో టీవీ లో ఉజ్జమం పోరాటం సాధన అంటూ ఉంటాడే ఆయనకి చెప్పండి పనికి వస్తుంది ఆ పోటీ ఏదో ...!!
KCR? Yes. He is qualified to enter this contest.
Post a Comment