స్లమ్ డాగ్ కాదనుకోండి, ఫార్మర్ మిలియనీర్ అని పిలుచుకోవచ్చు అపర్ణా మాలికర్‌ని. మిలియనీర్ అన్నది కూడా నిజం కాదు. అపర్ణ గెలిచింది 6 లక్షల 40 వేలు మాత్రమే. కానీ ఆమె కథ ఆ సినిమాకి ఏమాత్రం తీసిపోదు. రైతు ఆత్మహత్యలకి పేరు గాంచిన మహారాష్ట్ర యవత్ మాల్ జిల్లాకి చెందిన 27 సమ్వత్సరాల అపర్ణ మాలికర్‌కి కొద్ది రోజుల క్రితం వరకూ జీవితం అంధకారంగా ఉండేది. ఆమె భర్త ఆమెని, ఇద్దరు కూతుళ్ళని వారి ఖర్మకి వాళ్ళని వదిలి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు కుతుళ్ళని పెంచుతూ, వ్యవసాయం కోసం భర్త చేసిన అప్పులని మోస్తూ అదే వ్యవసాయాన్ని ముక్కుతూ, మూలుగుతూ లాగుతుండగా, విధి ఆమెకి ఒక అనుకోని అవకాశాన్ని అందించింది. కౌన్ బనేగా కరోర్‌పతి ప్రోగ్రామ్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది ఆమెకి.
కిశోర్ తివారీ అనే ఒక సామాజిక కార్యకర్త కృషి వలన ఆమెకి, అదే ప్రాంతానికి చెందిన మంజూష అనే మరో అమ్మాయి KBC స్పెషల్ షోలో పాల్గొనడానికి ఎంపికయ్యారు. మంజూష తండ్రి కూడా రైతే, ఆమె చిన్నప్పుడే అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అపర్ణ హాట్ సీట్‌లో అమితాబ్‌కి ఎదురుగా కూర్చుని ప్రశ్నలని ఎదుర్కొనడానికి ఎంపికయింది. అప్పటివరకూ తన ఊరు దాటి బయటకి రాని అపర్ణ తన బెరుకుని పొగొట్టుకొని అమితాబ్ అడిగే ప్రశ్నలకి సమాధానాలిచ్చి 6.40 లక్షలు గెలుచుకున్నాక ఆమెకి ఒక కష్టమయిన ప్రశ్న ఎదురయింది. అప్పటికే ఆమె తన లైఫ్ లైన్స్ అన్నీ వాడేయడం వలన అప్పటికి గెలుచుకున్న డబ్బుని కాపాడుకోవడం కోసం పోటీ నుండి వైదొలగింది.
"ఆ ప్రశ్నకు సమాధానం సంత్ తుకారాం అని నాకు తెలుసు. అయినా చాన్స్ తీసుకోదలచుకోలేదు" అని చెప్పిందామె తరువాత. ఆమె కథ విని కదిలిపోయిన బచ్చన్ తన వంతుగా ఆమెకి మరొక యాభయి వేలు ఇచ్చాడు. తను గెలుచుకున్న డబ్బుని ఏం చేయాలో కూడా ఆమె అప్పుడే నిర్ణయించుకొంది. ముందుగా తన భర్తని బలి తీసుకున్న అప్పుని తీర్చేయాలి, కూతుళ్ళ చదువు కోసం కొంత డబ్బు పక్కన పెట్టాలి, కూలి పోవడానికి సిద్ధంగా ఉన్న పాక తీసేసి పక్కా ఇల్లు కట్టుకోవాలి.
అపర్ణ, మంజూషల కథలు విని అమితాబ్ కూడా కదిలి పోయాడు. "వీళ్ళ బాధని, వేదనని వర్ణించడానికి నా దగ్గరున్న మాటలు చాలవు. కానీ ఇది మన కళ్ల ముందు కనిపిస్తున్న కౄరమైన వాస్తవం" అని తన బ్లాగ్‌లో రాసుకున్నాడు అమితాబ్. అంతే కాకుండా రైతు ఆత్మహత్యలని నివారించడానికి తన వంతు సాయం చేస్తానని కిశోర్ తివారీకి మాట కూడా ఇచ్చాడట. ఈ విషయమై ఇప్పటికే కృషి చేస్తున్న దీపా మెహతా, షర్మిలా ఠాగోర్, పి. సాయి నాథ్ లాంటి ప్రముఖులకి బచ్చన్ కూడా జత కలవబోతున్నాడు.
గత వారం షూటింగ్ జరుపుకున్న ఈ ఎపిసోడ్ ఈ నెలాఖరులో ప్రసారం అవుతుంది.
2 comments:
Really Heart touching
Yes, it really is.
Post a Comment