మార్చి,2008. 15 నెలల వయసున్న అవా వర్తింగ్‌టన్ చనిపోయింది. కారణం నిమోనియా, సరయిన యాంటీ బయోటిక్స్ వాడితే తేలిగ్గా నయమయ్యే జబ్బు. అయినా చనిపోయింది. అదే సంవత్సరం జూన్‌లో ఆ అమ్మాయి దగ్గర బంధువు నీల్ బాగ్లీ చనిపోయాడు. కారణం మూత్ర నాళానికి అవరోధం. చిన్న ఆపరేషన్‌తో పూర్తిగా నయమయ్యే వ్యాధి.
జూన్, 2011. తిమోతీ, రెబెక్కా వైలాండ్‌ల కూతురు అయిలానా కంటి మీద గడ్డతో బాధ పడుతోంది. బఠాణీ గింజ సైజులో మొదలయిన గడ్డ క్రికెట్ బంతి సైజుకి వచ్చి, ఆ అమ్మాయి కంటి చూపు శాశ్వతంగా కోల్పోయే పరిస్థితికి వచ్చింది. పై రెండు కేసుల్లోనూ, ఈ అమ్మాయి కేసులోనూ తల్లి తండ్రులు తమ పిల్లలను హాస్పిటల్‌కి తీసుకుపోవడం కానీ, డాక్టర్లకి చూపడం కానీ చేయలేదు. అయిలానా విషయంలో పోలీసులు కలగజేసుకొని ఆమెని బలవంతంగా హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించడం వల్ల ఆమె కన్ను దక్కింది.
ఆగస్టు, 2011 లో డేల్, షానాన్ హిక్‌మన్‌లకు ఒక కొడుకు పుట్టాడు. నెలలు నిండక ముందే పుట్టిన ఈ శిశువు బరువు బాగా తక్కువగా పుట్టాడు. అయినా హాస్పిటల్‌కి తీసుకుపోకపోవడం వలన పుట్టిన తొమ్మిది గంటలకే మరణించాడు. సరయిన వైద్యంతోఈ శిశువుని కాపాడ్డం వీలయి ఉండేది. మరొక విషయమేమిటంటే నెలలు నిండకముందే డెలివరీ జరిగినా, ఇంత హై రిస్క్ డెలివరీని ఈ చర్చిలో సభ్యులుగా ఉన్న ఆడవారే చేశారు. వారెవరికీ మిడ్ వైఫ్ ట్రైనింగ్ కానీ అనుభవం కానీ లేదు.
పైన పేర్కొన్న అన్ని సంఘటనలూ ఎక్కడో వైద్య సదుపాయం లేని మూడవ ప్రపంచ దేశాలలో జరిగినవి కావు. అత్యంత అభివృద్ధి చెందిన అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రంలో జరిగినవి. ఈ అన్ని సంఘటనల్లో పిల్లలకి వైద్య సలహా తీసుకోక పోవడానికి కారణం వారి తల్లి తండ్రులకి ఉన్న మత విశ్వాసాలే.
వీళ్ళందరూ ఫాలోయర్స్ ఆఫ్ క్రైస్ట్ అన్న చర్చికి చెందిన వారు. ఆ చర్చి నమ్మకాల ప్రకారం ఏ జబ్బుకీ మందులూ, ఆపరేషన్లు ఉపయోగించకూడదు. ఏ జబ్బు అయినా ప్రార్ధన వలన కానీ, ఆ చర్చిలో ఉన్న ఫాదర్ ఆయన చేతులు పేషంట్ల కళ్ళ మీద ఉంచడం ద్వారా కానీ తగ్గాల్సిందే. ఎంత ప్రాణం మీదకి వచ్చే జబ్బు అయినా వీళ్ళు హాస్పిటల్‌కి వెళ్ళనే వెళ్ళరు.
ఈ దిక్కుమాలిన చర్చిని పంతొమ్మిదవ శతాబ్ధం చివరిలో అమెరికాలోని కాన్సాస్‌లో స్థాపించారు. 1940లో ఈ చర్చి ఓరెగాన్‌కి వచ్చి స్థిరపడింది. ఈ చర్చి సభ్యులు కొన్ని నమ్మకాలని నమ్మి వాటిని ఆచరిస్తారు. ఆధునిక వైద్యాన్ని బహిష్కరించడం అందులో ఒకటి. ఒకవేళ ఎవరైనా సభ్యులు చాటుమాటుగా డాక్టర్ల దగ్గరికి వెళ్ళినట్టు తెలిస్తే వారిని చర్చి నుండి బహిష్కరిస్తారు.
ఇరవయ్యవ శతాబ్ధం రెండవ అర్ధంలో ఈ చర్చి ఉన్న చోటల్లా శిశు మరణాల సంఖ్య అధికంగా ఉండడంతో ఈ చర్చి వార్తల్లో కెక్కింది. ఓరెగాన్‌లో శిశు మరణాలు మిగతా దేశంతో పోలిస్తే 26 రెట్లు అధికంగా ఉన్నాయి. ఈ మరణాలు కూడా తేలిగ్గా నివారించదగ్గ కారణాలు, అంటే ఇన్‌ఫెక్షన్లు, నెలలు నిండక ముందు పుట్టడం లాంటి కారణాలతోనే సంభవిస్తాయి. ఈ చర్చి ఆవరణలోని శ్మశానంలో పూడ్చిపెట్టిన 78 మంది రికార్డులని పరిశీలిస్తే అందులో 38 మంది ఏడాది తిరక్కుండానే చనిపోయినట్లు, వారిలో 21 మంది చాలా సాధారణ, నివారించ దగ్గ కారణాలతో చనిపోయినట్లు వెల్లడైంది.
దాంతో అప్పటివరకూ మత స్వేచ్చ పేరిట తమ పిల్లల్ని హాస్పిటల్‌కి తీసుకు వెళ్ళాలా లేదా అన్నది తమ ఇష్టమని, అది తమ మత స్వాతంత్ర్య హక్కు అని వాదిస్తూ వచ్చిన ఈ చర్చి సభ్యులకి శిక్ష పడేలా 1999లో ఓరెగాన్ రాష్ట్ర చట్టాన్ని సవరించారు. మొదట్లో చెప్పిన కేసుల్లో నీల్ బాగ్లీ కేసులోనూ, అయిలానా కేసులోనూ తల్లి తండ్రులని కోర్టు శిక్షించింది. డేవిడ్ హిక్‌మన్ కేసు ఇప్పుడు విచారణలో ఉంది. కాబట్టి ఈసారి ఎప్పుడైనా జబ్బు పడ్డప్పుడు ఎవరయినా తాయెత్తో, దారమో కట్టుకొని కనిపిస్తే చీ..చీ.. మనది ఎంత వెనక పడ్డ దేశమో అని ఈసడించుకోకండి.
అంతకన్నా పిచ్చి నాయాళ్ళు ఎంత మందో ఉన్నారు.
2 comments:
ఆహా !!! మీ సహనాన్కి జోహార్లు . తిక్క చర్చి , వెర్రి సభ్యులు ఏంటి సర్ , బండ బూతులు తిట్టాల్సిఉన్న దానికి తిక్క వెర్రి అంటారా? ఇంత కంటే భయంకరమైనవి ఇంకా చాలా ఉన్నాయి . హైదరాబాద్ లో కూడా కొన్ని ఉన్నాయి అని విన్నాము కాని వివరాలు తెలియవు .
నా బ్లాగ్ పేరే నా ఫీలింగ్
Post a Comment