నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Monday, October 22, 2012

రామ్ గోపల్ వర్మ: నభూతో భవిష్యతి


శివ సినిమా చూసి రామ్ గోపాల్ వర్మకి పిచ్చి అభిమానిగా మారిన ఒక ఫ్రెండు వర్మని నభూతో న భవిష్యతి అనే వాడు. అలాంటి దర్శకుడు ఇంతకు ముందు లేడు ఇకపైన రాడు అని వాడి ఉద్ధేశ్యం. ఒకా సినిమా చూసి అంత sweeping statement ఇవ్వడం మాకు అంతగా నచ్చక పోయినా తరువాత్తరువాత క్షణ క్షణం, గోవిందా గోవిందా లాంటి సినిమాలతో బోల్తా పడ్డా రంగీలా, కంపెనీ,గాయం లాంటి హిందీ సినిమాలతో మా వాడికి కొంత బలం చేకూర్చాడు RGV. ఆ తరువాత మనుషుల కన్నా తన శైలికి భూతాలయితేనే కరెక్ట్ అని భావించాడేమో గానీ రాత్రి, దెయ్యం లాంటి సినిమాలతో నభూతో నభవిష్యతి, భూతాల్లేకపోతే తనకి భవిష్యత్తు లేదు అని భావించాడేమో బాస్ అనిపించింది.
   
అయితే భూతాలు కూడా తనని దెబ్బ తీశాక వాటి మీద అలిగి సర్కార్ లాంటి మనుష్యుల సినిమాలు తీసి విజయాలు చవి చూసినా RGVకీ ఆగ్ లాంటి అతి ప్రయోగాలతో హిందీలో దెబ్బ తిని, తెలుగులోకి వచ్చి అప్పల్రాజుతో , బెజవాడ రౌడీలతో మళ్ళీ దెబ్బయిపోయాక, మానవ జాతి మీదే అలుక వహించి మళ్ళీ భూతమేవ శరణం, అన్యధా శరణం నాస్తి అనుకొని, భూత్ రిటర్న్స్ అని ఈసారి ఏకంగా 3Dలో ప్రేక్షకులతొ, మహేష్ బాబు బిజినెస్ మాన్‌లో బొంబాయిని ఏం చేయాలనుకున్నాడో అది చేయించాలనుకున్నాడు. అయితే ఎక్కడో ఒకటి రెండు సీన్లు మినహా మిగిలిన చోట్ల ఎక్కడయితే భయపెట్టాలనుకున్నాడో అక్కడ ప్రేక్షకులకి నవ్వు వచ్చింది.
 
ఇప్పటికయినా RGV తనకి నభూతో భవిష్యతి, భూతాల్లేకపోతేనే తనకి భవిష్యత్తు అని తెలుసుకుంటే మంచిది. శివ, గాయం, రంగీలా,కంపెనీ లాంటి పెద్ద పెద్ద హిట్లన్నీ ఆయనకి మనుష్యుల ద్వారా వచ్చినవే. భూతాలు ఎప్పుడూ తనకి చెయ్యి ఇచ్చాయే గానీ హిట్లు ఇవ్వలేదు. ఇప్పుడు నిరాశా, నిస్పౄహలతో ఇటు మనుష్యుల మీదా అటు భూతాల మీద అలిగి ఏ గ్రహాంతర వాసుల సినిమాలో తీయకుండా మళ్ళీ మనుష్యులలోకి వస్తే విజయ పధంలో ఒకట్రెండు అడుగులు వేయవచ్చేమో ఆలోచించండి వర్మగారూ.

3 comments:

sree said...

భలేవారే, వర్మ నమ్మకాలు ఎప్పటికప్పుడు మారిపోతాయి. ఏమన్నా అంటే "నా ఇష్టం" అంటాడు. కొన్ని సార్లు ఈ నిర్మాతలు డైరక్టర్లూ"న బూతో న భవిష్యతి" అంటే "బూతు లేకపోతే భవిష్యత్తు లేదు" అని కూడా అనుకుంటారు. నా గుజరాతీ మిత్రుడు "సర్కార్" సినిమాని ఆహా ఓహూ అని పొగుడుతుంటే నేను అనుకున్నా "ఒరే వెర్రి పప్పా, ఈ సినిమా ని గాయం పేరుతో ఎప్పుడో మాకు చూపించాడు, ఇపుడు కాస్త అటు ఇటుగా మార్చి చూపిస్తున్నాడు గాని ఇదేం పెద్ద క్రియేటివిటీ కాదు నాయనా" అని.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

నిజమే అండీ. వర్మ గారి ఇంటర్వ్యూలు స్టేట్ మెంట్లూ చూస్తే ఏ కన్విక్షనూ లేకపోవడమే సార్ గారికున్న కన్విక్షన్ అని అర్ధమవుతుంది.

tarakam said...

రాంగోపాల్ వర్మ 'కృషితోనాస్తి దుర్భిక్షం' అనే దాన్ని బాగా నమ్మినట్లున్నాడు. అంటే బాగా కృషి చేసి ఆస్తి అంతా దుర్ భిక్షం చేయటమన్నమాట!