భారత స్వాతంత్ర్య పోరాటానికీ, అండమాన్ దీవులకూ విడదీయరాని సంబంధం ఉంది. కాలాపానీ అని పిలిచే సెల్యులార్ జైలు కొన్ని వేలమంది పోరాట యోధులని తన చీకటి గుయ్యారంలో బంధించి వాళ్ళ జీవితాలని బలి తీసుకున్న విషయం అందరికీ తెలుసు. కానీ 1906 నుండి ఆ జైలులో ఖైదీలని ఉంచడం మొదలవక ముందే వైపర్, రాస్ ఐలండ్‌లలో జైళ్ళు ఉండేవి. 1857లో మొదటి స్వతంత్ర సంగ్రామం తరువాత రాజకీయ ఖైదీలని, అతివాదులనీ తీవ్రవాదుల పేరిట అండమాన్‌కి పంపి వారిని తమ మాతృ భూమి నుండి, స్నేహితులు, కుటుంబం నుండీ వేరు చేసే ప్రక్రియని ప్రారంభించారు ఆంగ్లేయులు.
అలా వచ్చిన తొలినాటి ఖైదీలలో ఒకడు ఖైదీ నంబర్ 286, దూధ్‌నాధ్ తివారీ. ఇతడు బెంగాల్ పదాతిదళానికి చెందిన 14వ రెజిమెంట్‌లో సైనికుడు. వాయవ్య సరిహద్దులో విధి నిర్వహణలో ఉండగా సిపాయి తిరుగుబాటు మొదలయ్యింది. మంగళ్ పాండే తుపాకి పేల్చిన వెంటనే ఆ తిరుగుబాటు దేశమంతా వ్యాపించి వయవ్యానికి కూడా చేరింది. తన సహచరులతో కలిసి తివారీ కూడా తిరుగుబాటు చేశాడు. ఆంగ్ళేయుల చేతిలో చిక్కాక జీలం కమీషనరు ఇతన్ని 27-9-1857న అండమాన్ దీవులలో ప్రవాసానికి పంపవలసిందిగా శిక్ష విధించాడు. ఒక ఓడలో తోటి ఖైదీలతో కలిసి 6-4-1858న పోర్ట్ బ్లెయిర్‌కి వచ్చాడు తివారీ.
అప్పట్లో ఈ ఖైదీలకి కనీసం సరయిన జైలు కూడా ఉండేది కాదు. ఒక వందా, నూట యాభయి మందిని కలిపి గొలుసులతో బంధించి అడవులలో కలప నరికడానికి పంపేవాళ్ళు. వీళ్ళని Chain Gang అనే వాళ్ళు. ఇంత మందిని కలిపి బంధిస్తే తప్పించుకోవడానికి అవకాశం ఉండదని అధికారుల ఆలోచన. అయినప్పటికీ చాలా మంది అందరూ కలిసి తప్పించుకొనే ప్రయత్నం చేసే వాళ్ళు. మొత్తం గ్యాంగ్ అంతా కలిసి దట్తమైన అడవుల్లోకి పారిపోయేవాళ్ళు. అలా లోపలికి వెళ్తే బర్మా చేరుకోవచ్చన్న తప్పుడు నమ్మకంతో కొంతమందీ, అడవుల్లో పగలు తెప్పలు తయారు చేసుకొని రాత్రుళ్ళు వాటిమీద సముద్రమార్గాన భారత భూభాగం చేరుకోవాలని మరికొంతమందీ ప్రయతించారు.
అడవుల్లోకి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్న ఆదిమ జాతి తెగల బాణాలకో, జబ్బులకో గురయి మరణిస్తే, సముద్రంలోకి వెళ్ళిన వాళ్ళు దారి తెలియక కొన్నాళ్ళకి తిరిగి వెనక్కి వచ్చి ఉరి శిక్షలకి గురి కావడమో, లేదా అలా దారీ తెన్నూ లేక ఆకలి దప్పికలతో చావడమో జరిగేది. అయినా అక్కడ బ్రిటిష్ అధికారులు పెట్టే హింసకి తాళలేక తప్పించుకొనే ప్రయత్నాలు చేస్తూనే ఉండే వాళ్ళు ఆ ఖైదీలు.
ఆ దీవుల్లో కేవలం సముద్రపు ఒడ్డున మాత్రమే నివాసాలు, ఖైదీల గుడారాలు ఉండేవి. లోపల అంతా దట్టమైన చీమలు, కాకులు కూడా దూరలేని అడవులుండేవి. బయటి వారి రాకతో భయపడి పారిపోయిన ఆదివాసీలు అడవుల లోపల ఉండేవారు. అండమానీయులు, జరవ, ఓంగ్ తెగల వాళ్ళు ఈ అడవులలో నివాసముండేవారు. బయట వాళ్ళెవరైనా, తెల్ల వారైనా, నల్ల వారైనా వారికి కనిపిస్తే విషపూరిత బాణాలతో చంపేసే వాళ్ళు. అడవులు చదును చేయడానికో, కలప కోసమో అడవులలోకి వెళ్ళిన ఖైదీలు కొన్ని సార్లు వారిబారిన పడి మరణించేవాళ్ళు.
తివారీ ఉన్న chain gang లోని 80 మంది సభ్యులు పగలు అడవిలో పని చేసే సమయంలో ఎండు దుంగలూ, తీగల సాయంతో తెప్పలు తయారు చేసి పెట్టుకొని 23-4-1856 రాత్రి Ross island నుంచి పరారయ్యారు. వాళ్ళు అలా సముద్రంలో కొంత దూరం వెళ్ళాక మరొక దీవిని చేరుకున్నారు. ఆ దీవిలో అండమానీస్ అనే తెగ వాళ్ళు తమ విష బాణాలతో, ఆయుధాలతో వీళ్ళ మీద దాడి చేశారు. ఆ దాడిలో అందరూ చనిపోతే తివారీ మాత్రం తీవ్రగాయాలతో వాళ్ళ చేతికి చిక్కాడు.
తివారీకి భూమ్మీద నూకలింకా మిగిలి ఉన్నాయి కాబోలు, వాళ్ళు అతన్ని చంపకుండా తమతో బందీగా తీసుకెళ్ళారు. కొన్ని రోజులకి గాయాల నుండి కోలుకొని వారిలో ఒకడిగా కలిసిపోయాడు తివారి. వాళ్ళ అలవాటు ప్రకారం గుండు చేసుకొని, బట్టలు వదిలేసి వారి బాష నేర్చుకొని వారిలో కలిసిపోయాడు. తరువాత ఇద్దరు అమ్మాయిలను పెళ్ళి కూడా చేసుకున్నాడు. వాళ్ళతో కలిసి వేటాడ్డం, ఆట, పాటలు ఇలా వారిలో మమేకమైపోయాడు.
ఇలా ఉండగా 1859 మే నెలలో తెగ వాళ్లు తమలో తాము గుస గుస లాడుకోవడం, రహస్యంగా చర్చించుకోవడం గమనించాడు తివారీ. ఈ చర్చలలో తనని పాలు పంవుకోనీయకపోవడంతో అతనిలొ ఆసక్తి పెరిగి తెగలోని నాయకులమీద నిఘా పెట్టాడు. దానితో అతనికి తెలిసిందేమిటంటే త్వరలో వాళ్ళందరూ కలిసి తెల్లవారిమీద దాడి చేయబోతున్నారు. దాడికి ముహూర్తం నిశ్చయమయ్యాక ఎక్కడెక్కడినుంచో 3000నుంచి 3500 మంది గుమికూడి తెప్పలలో తమ ఆయుధాలు, విల్లు బాణాలు, గొడ్దళ్ళూ, ఈటెలు పట్టుకొని తెప్పలలో దాడికి బయలు దేరారు.
అయితే అంతకుముందే తివారి ఒక తెప్పలో ముందుగానే వెళ్ళిపోయాడు. ఈ సంవత్సర కాలంలొ అతనికి ఆ ఆదిమ జాతి వాళ్ళ తెప్ప నడపడం బాగా వచ్చేసింది. నేరుగా వెళ్ళి పోర్ట్ బ్లెయిర్‌లోని సైనిక పటాలాన్ని కలిసి ముంచుకు రాబోతున్న దాడి గురించి హెచ్చరిక చేశాడు. ముందుగా తెలియడం వల్ల ఉన్న కొద్దిమంది సైనికులూ తుపాకులతో అప్రమత్తంగా ఉండి తమ కన్నాసంఖ్యా బలంలో ఎన్నో రెట్లు అధికంగా ఉన్న ఆదివాసుల దాడిని తిప్పికొట్టారు. వీళ్ళ తుపాకుల ముందు వారి బాణాలు,ఈటెలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. ఆ ఒక్క పోరాటంతో అండమానీయుల జాతి దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది.
ఈ పోరాటం జరిన ప్రదేశం ఇప్పటి పోర్ట్ బ్లెయిర్ లోని అబర్దీన్ బజార్. ఇది ఇప్పుడు మంచి షాపింగ్ కేంద్రం.
ఆ పోరాటానికి ఇక్కడ ఎలాంటి ఆనవాళ్ళూ లేవు. కానీ అండమాన్ వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మాత్రం ఈ యుద్ధానికి గుర్తుగా ఒక గ్నాపిక ఉంది.
సెల్యులార్ జైలులోని మ్యూజియంలో అబర్డీన్ యుద్ధం గురించిన వర్ణ చిత్రం. క్లియర్‌గా లెకపోతే అది నా సోనీ కెమెరా తప్పు. అసలు చిత్రం చాలా బావుంది.
అయితే ఆంగ్లేయులపై ద్వేషభావంతో ఉండాల్సిన తివారీ గర్భవతి అయిన తన భార్యని వదిలేసి, తనకి ఆశ్రయమిచ్చిన అండమాన్ వారిని మోసం చేసి వాళ్ళ నాశనానికి కారణమెందుకయ్యాడు? బ్రిటీష్ వాళ్ళు చావకుండా ఎందుకు సాయం చేశాడో ఎవరికీ తెలియదు. ఒక వెర్షన్ ప్రకారం ఆ ఆదిమ జాతి వాళ్ళు దాడి చేస్తే భారతీయులు, ఆంగ్లేయులు అని చూడకుండా అందరినీ చంపేస్తారేమోనని భయపడి తన సహచరులని రక్షించేందుకు అలా చేసి ఉంటాడు. మరొక వెర్షనేమిటంటే ఆంగ్లేయులందరినీ చంపేస్తే తను ఇంక ఎప్పటికీ అక్కడే ఉండిపోవాల్సి వస్తుండేమోనని, తాను ముందుగా దాడి గురించి తెలియ చేస్తే తనకి క్షమాభిక్ష పెట్టి శిక్ష రద్దు చేసి తన స్వస్థలానికి పంపేస్తారేమోనన్న ఆశ అతనితో అలా చేయించి ఉంటుందని.
ఏదేమైనా తివారీ పుణ్యమా అని అండమాన్‌లో సమూలంగా తుడిచిపెట్టుకు పోవలసిన బ్రిటీషర్లు అక్కడ తిష్ఠ వేసుకుపోయి తరువాతి కాలంలో సెల్యులార్ జైలు నిర్మించి వేలమంది సమర యోధులని నరక కూపంలో ఉంచగలిగారు. తివారీకి బ్రిటీష్ ప్రభుత్వం 5-10-1860 నాడు క్షమాభిక్ష పెట్టి శిక్ష రద్దు చేసి అతని స్వస్థలానికి పంపింది. ఆ తరువాత అతనేమయ్యాడో ఎవరికీ తెలియదు.
4 comments:
fascinating story.
తివారీ అలా ఎందుకు చేశాడో అర్ధం చేసుకోవడం కష్టం.
yudddhaallo Otami ki kaaranam manalone okadu untadani cheppe maroka katha idi! Edemaina manishi enno elluga ila poratalu chesi chesi ippudunna sthitiki vachchadu. konnintlo mundadugu konnintlo venakadugu vesadu manishi. kaadantaara?
Very interesting history...
i heard this story in first time. it's interesting.
Post a Comment