నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Monday, August 22, 2011

ఉరుమి- ఆద్యంతం నయనానందకరం


చేయి తిరిగిన ఫోటోగ్రాఫర్ దర్శకుడయితే ఆ చిత్రం ప్రేక్షకులకు ఎలా కనువిందు చేస్తుందో ఉరుమి చిత్రం చూస్తే తెలుస్తుంది. దానికి తోడు సినిమా మొత్తం కేరళలో తీస్తే ఇక చెప్పేదేముంది. ఉరుమి సినిమా ఆద్యంతం పచ్చని లొకేషన్లతో ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది. అయితే ఈ సినిమాలో సంతోష్ శివన్ ఫోటోగ్రఫీ మాత్రమే కాదు దర్శకత్వ ప్రతిభ కూడా వీక్షకులను మెప్పిస్తుంది.


   


ఇదివరకు తెరమీద ఎవరూ సృజించని భారతీయ చరిత్రలోని ఒక అంకాన్ని శివన్ తన సినిమాకి కథగా ఎంచుకొన్నాడు. వాస్కో డా గామా అంటే భారత దేశానికి సముద్ర మార్గం కనిపెట్టిన గొప్ప నావికుడు అని స్కూలు పిల్లలు చదువుకొని ఉంటారు. కానీ వాస్కో డా గామా ఎంత కౄరుడో, అతను ఎంత దాఋణమైన అత్యాచారాలు చేశాడో ఈ సినిమాలో నేపధ్యం.




కథ: పృధ్వీ రాజ్ అతని స్నేహితుడు ప్రభు దేవా లని ఒక రోజు ఒక బహుళ జాతి సంస్థ తాలూకూ ప్రతినిధి ఒక ఆఫర్‌తో కలుస్తుంది. కేరళలో ఉన్న పృధ్వీ రాజ్ తాలూకూ పూర్వీకుల ఆస్థిని తమకు అమ్మితే చాలా అధిక మొత్తం చెల్లిస్తామని. అసలు అలాంటి ఆస్థి ఒకటి ఉందని తెలియని అతను దాన్ని అమ్మడానికి అక్కడకి వెళ్తాడు. అక్కడ ఒక NGO తాలుకూ ప్రతినిధి విద్యా బాలన్ ఆ సంస్థ అక్కడ మైనింగ్ మొదలు పెడితే వచ్చే నష్టాల గురించి అతన్ని హెచ్చరిస్తుంది. అయినా అతను మనసు మార్చుకోడు. తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతుండగా కొందరు అటవికులు వాళ్ళని కిడ్నాప్ చేస్తారు. వాళ్ళ నాయకుడు ఆర్య పృధ్వీ రాజ్‌కి అయిదు శతాబ్ధాల క్రితం అతని పూర్వీకుడయిన కేలూ నాయనార్ కథ చెప్తాడు. ఈ కథే ఈ సినిమాలో అసలు కథ.


కేరళ తీరంలో కాలు పెట్టిన తరువాత అక్కడి సుగంధ ద్రవ్యాలను చూసి వాస్కో డా గామా పిచ్చెత్తి పోతాడు. కానీ వ్యాపారానికి అక్కడ రాకు సాముద్రి అంగీకరించక పోవడంతో అతను అక్కడి జనం మీద అకృత్యాలు సాగిస్తాడు. నాలుగు వందల మందితో మక్కాకు వెళ్తున్న ఒక నౌకను తన అధీనంలోకి తెచ్చుకొంటాడు. బందీల విడుదల కోసం రాయబారానికి వెళ్ళిన ఒక బ్రాహ్మణుడి చెవులు కోసి కుక్క చెవులు కుట్టి పంపుతాడు. గామాని చంపడానికి ఒక వీర యువకుడు(ఆర్య) అతని నౌక మీదకి దాడి చేసి మరణం పాలవుతాడు. గామా తన ఆధీనంలోని నౌకలో ఉన్న వారితో సహా దాన్ని కాల్చేస్తాడు. 


ఆ ఘటనలో మరణించిన వారి శవాలు ఒడ్డుకు కొట్టుకొస్తే వారి ఆభరణాలని కరిగించి ఒక ఆయుధం తయారు చేసి, దానితోనే గామాని చంపాలని ఎదురు చూస్తుంటాడు ఆర్య కొడుకు కేలు నాయనార్(పృధ్వీరాజ్). అనాధ అయిన ఇతన్ని వవ్వాలి(ప్రభు దేవా) చేరదీస్తాడు. కేలు నాయనార్ తయారు చేసిన ఆయుధం పేరే ఉరుమి. ఇది ఒక పొడవాటి బెల్టులాగా ఉంటుంది. ఒక వైపు చేత్తో పట్టుకోవడానికి పిడి ఉంటుంది. 
 


అక్కడ మొదలయి కేరళ అందాలని, పోర్చుగీసు వారి అకృత్యాలని, కేరళలో అప్పుడున్న రాజకీయాలని చుడుతూ కథ సాగుతుంది. మధ్యలో ఒక ముస్లిం రాకుమారిగా, యుద్ధ విద్యలలో ప్రావీణురాలిగా జెనీలియా కనిపిస్తుంది. ఒక రెండు పాటలలో విద్యా బాలన్ , టబ్బూ అలా మెరిసి మాయమౌతారు.
   
సినిమా ఆద్యంతం పృధ్విరాజ్, ప్రభు దేవాలదే. జెనీలియా కూడా ఇక ముఖ్యమైన పాత్రలో తన స్వభావానికి విరుద్ధంగా బాగా నటించింది. మరొక పాత్రలో నిత్యా మీనన్ కూడా మెప్పిస్తుంది. అక్కడక్కడా నాలిగయిదు పాటలొస్తాయి. పెద్దగా  సూపరనిపించక పోయినా విసిగించవు. సినిమా అంతా సంతోష్ శివన్ చాయా గ్రాహణ, దర్శకత్వ ప్రతిభ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. క్లిష్టమయిన కథని ఎక్కడా విసిగించకుండా, తేలిగ్గా నడిపిస్తాడు స్క్రిప్ట్ రైటర్ శంకర్ రామక్రిష్ణన్.


సినిమాలో అక్కడక్కడా మెల్ గిబ్సన్ సినిమా బ్రేవ్ హార్ట్  పోలికలు కనిపిస్తే, తెలుగు వారికి చివరిలో పోర్చుగీసు సైనికులు కేలూ నాయనార్‌ని చుట్టు ముట్టి కాల్చి చంపే సీన్ అల్లూరి సీతారామ రాజు గుర్తుకొస్తుంది. తెలుగు వారి నేటివిటీకి కొంచెం దూరమైన కథ అయినా చక్కగా చూడవచ్చు అని చెప్పదగ్గ సినిమా.

6 comments:

హను said...

mi visleshana bagumdi

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Thanks verymuch,Hanu.

సుభద్ర said...

ట్రయిలర్ చూసి సినెమా చూడాలని అనుకున్నా..మలయాళం లో కొంచం చూసాను..నాకు హిస్టరీ బేస్డ్ సినిమాలు ఇష్టమ్...మీ విశ్లేషణ చాలా బాగుంది..నాకు సినిమా చూడాలన్న కోరిక మరింతా పెరిగిపోయింది ఇప్పుడు..

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

తప్పక చూడండి. ఏమాత్రం రొటీన్ చెత్త లేని మంచి సినిమా. కేరళ అందాల్ని బాగా కేప్ఛర్ చేశాడు దర్శకుడు. మనం అక్కడ ఉన్నట్టే అనిపిస్తుంది. ఆ మంచు మన చుట్టూ ఉన్నట్టు అనిపిస్తుంది కొన్ని సీన్లలో. Breath taking visuals.

రసజ్ఞ said...

ఈ సినిమాని నేను మలయాళంలో చుసేసినా తెలుగులో మళ్ళీ చూడాలనుంది. మీ విశ్లేషణ కళ్ళకు కట్టినట్టు ఉంది మళ్ళీ సినిమా అంతా గుర్తొస్తోంది. పాత్రలన్నీ బాగున్నాయి.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

థాంక్యూ రసగ్న.