ఆ మధ్య మీడియాలో ఆరోగ్యశ్రీతో కడుపు కోత అన్న కథనాలు వచ్చాయి. నిండా పాతికేళ్ళు లేని అమ్మాయిలకి కూడా ఆరోగ్యశ్రీ పథకం కింద గర్భ సంచి తొలగించే ఆపరేషన్లు కుప్పలు తెప్పలుగా జరిగిపోవడం గురించిన స్టోరీ అది. ఆ తరువాత ఆ ప్యాకేజీకి ఇచ్చే డబ్బు తగ్గించి కొంచెం టైట్ చేశాక ఆ ఆపరేషన్లు కొంచెం తగ్గాయి. అయితే ఆరోగ్యశ్రీ కింద జరిగిపోతున్న మరొక అన్యాయం వెన్నుపూస ఆపరేషన్లు. వయసుతో నిమిత్తం లేకుండా, లక్షణాలతో సంబంధం లేకుండా, ఆపరేషన్ అవసరమా లేదా అన్న మీమాంస లేకుండా ఆరోగ్యశ్రీ కార్డు చేతబట్టుకొని నడుము నొప్పి అని హాస్పిటల్‌కి వెళితే వెన్నుపూసకి ఆపరేషన్ చేసిపారేస్తున్నారు.
వీటిలో రెండు ప్యాకేజీలున్నాయి ఆరోగ్యశ్రీలో. ఒకటి Discectomy. వెన్నుపూసల మధ్య ఉన్న inter vertebral disc అన్న భాగం వెనక్కి జారి నడుము నొప్పి, కాలు నొప్పి, తిమ్మిరి లాంటి లక్షణాలు వచ్చి MRI scan లో ఆ disc prolapse కనిపిస్తే ఆపరేషన్‌కి అప్రూవల్ వస్తుంది. ఈ ప్యాకేజీ 35,000 రూపాయలు ఉంటుంది. ఇందులో హాస్పిటల్‌కి పెద్దగా ఖర్చయ్యేది ఉండదు. కాబట్టి హాస్పిటల్స్‌కి ఈ ఆపరేషన్ వరప్రసాదినిలా కనిపిస్తుంది. అయితే నిపుణులు, పుస్తకాలు చెప్పేదాని బట్టి 90-95 శాతం పేషంట్లలో ఈ లక్షణాలు వాటికవే తగ్గుతాయి. డాక్టర్లు తేలికపాటి నడుముకి సంబంధించిన వ్యాయామం, కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపితే చాలు. American spine surgeons assocoation కూడా ఈ జబ్బుకి యోగా దివ్యంగా పని చేస్తుందని చాలా పరిశోధనల తరువాత అంగీకరించారు. భుజంగాసనం, శలభాసనం, నావాసనం ఈ నొప్పిని తగ్గించడమేకాక నివారిస్తాయి అని నిపుణుల ఉవాచ.
అయితే ఇలా ఆపరేషన్ లేకుండా చేసే వైద్యం అంత ఆకర్షణీయంగా ఉండదు. ఆరోగ్యశ్రీ లేని రోజుల్లో ఖర్చుకి జడిసి చాలా మంది ఆపరేషన్ అంటే వెనుకడుగు వేయడమో, ఒక డాక్టరు నుంచి మరొక డాక్టరు దగ్గరకి వెళ్ళడమో, ఆపరేషన్‌కి సిద్ధపడి డబ్బు సమకూర్చుకోవడానికి సమయం తీసుకోవడమో చేసినప్పుడు ఈ జబ్బు తానంతట అదే తగ్గిపోయి ఆపరేషన్‌తో పని లేకుండా పోయేది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ వల్ల డబ్బు అనేదానితో పని లేదు కాబట్టి ఆపరేషన్ వాయిదా వేయడానికి డాక్టరు, పేషంటు ఇద్దరూ సిద్ధంగా లేరు. చక చకా ఆపరేషన్లు జరిగి పోతున్నాయి.
ఈ ఆపరేషన్‌లో వెన్నుపూసని వెనక నుండి ఓఫెన్ చేసి, కొంత భాగం ఎముకని తొలగించి, అందులోంచి డిస్క్ తొలగిస్తారు. అయితే ఆపరేషన్‌లో వెన్నుపూసలోని ఒక భాగాన్ని శాశ్వతంగా తొలగించి చేసే ఈ ఆపరేషన్‌తో భవిష్యత్తులో నడుము నొప్పి తిరిగి రావడమే కాక అలా వచ్చినప్పుడు మరింత క్లిష్ట మైన మరొక ఆపరేషన్ అవసరం అవుతుంది. ఇది ఆపరేషన్ వల్ల ఎలాంటి కాంప్లికేషన్ లేకుండా జరిగిపోయినప్పటి సంగతి. కాళ్ళకి పోయే నరాలు, మల మూత్ర విసర్జనని అదుపు చేసే నరాలు, అంగ స్తంభన కలించే నరాలు ఆపరేషన్ జరిగే ప్రాంతంలోనే ఉండడం వల్ల కొన్ని సార్లు అవి గాయపడి వాటికి సంబంధించిన సమస్యలు అంటే కాళ్ళు చచ్చు పడడం మల, మూత్ర విసర్జన మీద అదుపు లేకపోవడం, నపుంసకత్వం రావడం లాంటివి జరగొచ్చు.
ఇక రెండవ ప్యాకేజి Discectomy with fixation. దీనిలో 65,000 రూపాయలు ఉంటుంది. ఇది వెన్ను పూసలు జారడం, spondylolisthesis
అనే జబ్బుకి, ప్రమాదంలో వెన్ను పూసలు దెబ్బతిన్నప్పుడు ఇస్తారు. మొదటి దానిలో నాలుగు స్టేజీలుంటాయి. ఇందులో నాలుగో దశలోకానీ ఆపరేషన్ అవసరముండదు. ఆరోగ్యశ్రీ కింద ఏ దశలో ఉంది అన్న దానితో పని లేకుండా స్కాన్‌లో వెన్ను పూస జారినట్లు కనిపిస్తే చాలు పేషంటుకి ఆరోగ్యశ్రీ కార్డు ఉండి ఆపరేషన్ చేయించుకుంటే మంచిది అని పేషంటుని కన్విన్స్ చేయగల టాలెంటు డాక్టరుకి ఉంటే ఆపరేషన్ జరిగిపోతుంది.
ఈ ఆపరేషన్లో వెన్నుపూసల్లో స్క్రూలు అమర్చి వాటికి రాడ్లు బిగిస్తారు. ఎముకలో స్క్రూ వేయడం అనేది మిగిలిన చోట్ల పెద్ద పని కాదు. ఓ అర ఇంచీ అటూ ఇటూ అయినా వచ్చే ప్రమాదమేమీ లేదు. కానీ వెన్నుపూసల మధ్య వెన్ను పాము, అందులోంచి వచ్చే నరాలు ఉంటాయి. ఏమాత్రం అటూ ఇటూ అయినా కాళ్ళు పడి పోవడం, మూత్ర మల విసర్జనల మీద అదుపు లేక పోవడం, అంగం స్థంభించక పోవడం లాంటివి జరగొచ్చు.
ఇందులో మరొక ఆందోళన కలిగించే విషయమేమిటంటే చాలా మంది డాక్టర్లకి ఇలాంటి క్లిష్టతరమైన ఆపరేషన్లు నేర్పించే గినియా పందుల్లాగా ఆరోగ్యశ్రీ పేషంట్లు ఉపయోగపడుతున్నారు. ఇలా ఎడాపెడా వెన్నుపూసల మీద జరిగిపోతున్న ఆపరేషన్ల తాలూకూ దుష్పరిణామాలు మరొక పది పదిహేను సంవత్సరాలలో క్రమేపీ బయట పడుతాయి. అయితే అప్పుడు వాటికి వైద్యం చేయించుకోవడానికి ఆరోగ్యశ్రీలో వెసులుబాటు లేదు.
ప్రమాదంలో వెన్నుపూస దెబ్బతిన్నప్పుడు కూడా చాలా సార్లు చిన్న చిన్న ఫ్రాక్చర్లకి ఆపరేషన్‌తో పని లేకుండా రెండు మూడు నెలలు బెడ్ రెస్ట్ ద్వారా నయం చేయవచ్చు. అయితే ఇలా ఆపరేషన్ చేయకుండా వైద్యం చేయడం చేతకాని తనంగా డాక్టర్లు భావించే రోజులివి. ఆరోగ్యశ్రీ పుణ్యమా అని పేషంటు కూడా అదే భావిస్తున్నాడు ఇప్పుడు.
4 comments:
ఫ్రీ గా వస్తే ఫినాయిల్ తాగే రకాలు కదండీ మన జనాలు , ఇటు రోగులు శస్త్ర చికిత్స ఎలాగు ఉచితమే కదా అని పోటు పొడిపించుకుంటున్నారు. అటు వైద్యులు కుడా డబ్బులకు కక్కుర్తి పడి అవసరం ఉన్నా లేకున్నా కోసేస్తున్నారు. అంతా ఫినాయిల్ మయం....!!!!
పరుల సొమ్ము పాముతో సమానం, ఫ్రీ సొమ్ము ఫినాయిల్‌తో సమానం.
రెండవ కేటగిరీ discectomy with fixation. ఇందులో వెన్ను పూసల్లో స్క్రూలు, రాడ్లు బిగిస్తారు. దీని గురించి మరింత రాయండి.
ఇంకా నయం, సాధారణ తలనొప్పి వచ్చినవానికి బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చెయ్యలేదు.
Post a Comment