మూడేళ్ళ క్రితం గుజరాత్‌లోని
ఆనంద్ నగరంలో జరిగిన యదార్ధ సంఘటన ఇది. ఆనంద్ నగరానికి మిల్క్ కాపిటల్ ఆఫ్ ఇండియా అని
పేరుంది. దేశంలోని అతి పెద్ద ఆహార బ్రాండ్‌గా పేరున్న అమూల్‌కి ఇది కేంద్రం. ఆ నగరంలో
ఒక ఉమ్మడి కుటుంబంలో ఆస్తి గొడవల కారణంగా నీతా పటేల్, ఆమె భర్త ముగ్గురు కూతుళ్ళనీ
బయటకి గెంటేశారు. చేతిలో చిల్లి గవ్వ లేదు, ముగ్గురు చిన్న పిల్లలని ఎలా పోషించాలో
తెలియక పిల్లలతో సహా ఆత్మ హత్య చేసుకోవాలని నీతా ఆమె భర్త నిశ్చయించుకొన్నారు. జేబులో
ఉన్న డబ్బులు పోగేసి పురుగుల మందు డబ్బా కొన్నారు. చేదుగా ఉండే ఆ మందు తాగడం పిల్లలకి
కష్టంగా ఉంటుందని మిగిలిన చిల్లరతో బజ్జీలు కొని ఒక నిర్మానుష్యంగా ఉన్న బస్ స్టాప్‌లో
కూర్చుని బజ్జీల పొట్లం విప్పారు. ఆ పొట్లంలో ఒక ప్రకటన వారిని ఆకర్షించింది. అయిదు
ప్రాణాలు నిలపగల ఆ ప్రకటన ఒక గైనకాలజిస్టు ఇచ్చింది.
ఆనంద్ నగరానికి పాల కేంద్రంగానే
కాదు, అద్దెకి గర్భం లభించే నగరంగా కూడా పేరుంది. ఈ మధ్యనే వెయ్యి కృత్రిమ గర్భం ఆపరేషన్లు
విజయవంతంగా పూర్తి చేసి రికార్డుల్లోకి ఎక్కిన నైనా పటేల్ అనే డాక్టర్ ముంబాయికి చెందిన
ఒక జంటకి తమ శిశువుని తొమ్మిది నెలలు మోయగల మహిళ కోసం ఇచ్చిన ప్రకటన అది. ఆకర్షణీయమైన
ప్రతిఫలం ఉంటుంది అన్న వాక్యం చూసి నీతా పటేల్ ఆత్మ హత్య ప్రయత్నాన్ని ఆపివేసి తెల్లవారగానే
ఆ డాక్టర్‌ని కలిసింది. ఆమె నీతాకి కొన్ని టెస్టులు చేసి ఆమెని ఓకే చేసింది. అడ్వాన్సుగా
కొంత డబ్బు ఇచ్చింది. దానితో ఒక చిన్న గది అద్దెకి తీసుకొని నితా కుటుంబం కొత్త జీవితాన్ని
మొదలు పెట్టారు.
తొమ్మిది నెలలు ఒక శిశువుని
మోసి ముంబాయి జంటకు అందించింది నీతా. ప్రతిఫలంగా ఆమెకి 2.75 లక్షలు లభించాయి. ఆ డబ్బుతో ఒక ఇల్లు కొనుక్కొని,
చిన్న కిరాణా కొట్టు మొదలు పెట్టారు. కొడుకు కావాలని నీతా మళ్లీ గర్భం ధరించి నాలుగో
కూతురుకి జన్మ ఇచ్చింది. అక్కడితో ఇక చాలు అనుకొని పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకొని
నలుగురు కూతుళ్ళకీ మంచి భవిష్యత్తు ఇవ్వడానికి భర్తతో కలిసి కష్ట పడుతూ ఉంది.
తమ ప్రాణాలు కాపాడిన
ఆ బజ్జీల పొట్లాం చుట్టిన పేపరు ముక్కని ఈ నాటికీ నీతా దాచుకొని ఉంది.
6 comments:
కృష్ణ గారు ఈ వార్త నిజమే అంటారా ? లేక అద్దె గర్భం వ్యాపారానికి మద్దతుగా ఆ వ్యాపారం లో ఉన్న వారు సాగిస్తున్న ప్రచారం అంటారా ? నాకయితే ప్రచారం లానే అనిపిస్తుంది . వీలుంటే ఈ వార్త ఎక్కడా వచ్చిందో ఆ లింక్ ఇస్తారా ?
అద్దె గర్భాల వల్ల AIDS రాదా?
బుద్ధ మురళి గారి కామెంట్ కొద్దిగా ఆలోచించ వలసినదే.
http://articles.timesofindia.indiatimes.com/2012-06-23/ahmedabad/32381670_1_bhajiya-daughters-mumbai-couple
Why can't they adopt orphan children rather than hiring surrogate mothers?
పిల్లలు లేని వాళ్ళు అనాధ పిల్లలని దత్తత తీసుకుంటే అన్ని విధాలుగా ప్రయోజనం. ఖర్చు తక్కువ, కావలసిన ఫీచర్లు ఉన్న అమ్మాయినో, అబ్బాయినో ఎంచుకోవచ్చు. ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చినట్లూ ఉంటుంది. ఎందుకో ఈ మార్గాన్ని వదిలి ఇల్లూ, వళ్ళూ గుల్ల చేసుకుంటారు.
Post a Comment