నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, July 25, 2012

వాళ్ళు ఆమె చేతుల్తో పతాక ధారణ చేయిస్తే మనం మనమ్మాయి చేతులతోమట్టి పిసికిస్తున్నాం


కాస్టర్ సెమెన్యా, పింకీ ప్రమాణిక్, శాంతి సౌందరాజన్......ఈ ముగ్గురూ మిడిల్ డిస్టెన్స్ రన్నర్లు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతాకాలు సాధించారు. ఈ ముగ్గురూ ఒకే రకమైన ఆరోపణలతో తమ బహుమతులు కోల్పోయి, తాము సాధించిన విజయాలు రికార్డులలోంచి తొలగించబడి తమ పతకాలు కోల్పోయారు. ఇది గతం. ఒకే రకమైన ఆరోపణలతో, ఒకే శిక్షకు గురయిన ఈ ముగ్గురి వర్తమానం పరిశీలిస్తే  హస్తి మశకాంతరం తేడా కనిపిస్తుంది.  వివిధ అంతర్జాతీయ వేదికల మీద మహిళల విభాగంలో గెలిచిన వీరు లింగ నిర్ధారణ పరీక్షలలో విఫలమై బహుమతులు కోల్పోయారు అయితే ఇప్పుడు వీరిలో ఒకరు తిరిగి సగర్వంగా అంతర్జాతీయ వేదిక మీద పోటీకి సిద్ధమవగా మిగిలిన ఇద్దరూ అవమానాలకు గురయి భవిష్యత్తు అంధకారమయి విలవిలలాడుతున్నారు.
 
కాస్టర్ సెమెన్యా, సౌత్ ఆఫ్రికాకి చెందిన మిడిల్ డిస్టెన్స్ రన్నర్. 2009 బెర్లిన్ ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో 800 మీటర్ల పోటీలో బంగారు పతకం సాధించింది.అయితే లింగ నిర్ధారణ పరీక్షలో విఫలమై తన పతకాన్ని కోల్పోయింది. ఆరు నెలల పాటు అంతర్జాతీయ పోటీలకు దూరం అయింది. అయితే తన దేశానికి చెందిన క్రీడా మంత్రిత్వ శాఖ ఆమె వెనక గట్టిగా నిలబడి, అంతర్జాతీయ అథ్లెటిక్ ఫెడరేషన్ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆమె మళ్ళీ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేలా చేయడమే కాకుండా ఆమె సాధించిన పతకాలన్నీ మళ్ళీ వెనక్కి వచ్చేలా చేసింది. ఫలితంగా రెండు రోజుల్లో లండన్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో సెమెన్యా పాల్గొనడమే కాకుండా, తన దేశ పతాకాన్ని చేబూని తమ జట్టుకి అగ్ర స్థానంలో నడిచే గౌరవం కూడా దక్కించుకొంది.
 
మన దేశానికి చెందిన పింకీ ప్రమాణిక్ పైన అనామికా ఆచార్య అని ఆమెతో కొంత కాలంగా జీవిస్తున్న ఓ అమ్మాయి పింకీ అమ్మాయే, కాదని తనని మాన భంగం చేసిందని అరోపణలు చేసిన వెంటనే ఆమెకి స్పోర్ట్స్ కోటాలో వచ్చిన ఉద్యోగం నుంచి తొలగించి, లింగ నిర్ధారణ పేరిట అవమానాల పాలు చేయడమే కాకుండా, అరెస్టు చేసి, ఆమె అమ్మాయో కాదో తేలకుండానే ఆమెని మగ వాళ్ళ సెల్‌లో పెట్టారు. ఏషియన్ గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్, శాఫ్ గేమ్స్‌లో వివిధ విభాగాలలో పతకాలు సాధించిన పింకీ ఇప్పుడు తనని సపోర్టు చేసేవారెవరూ లేక కష్టాల్లో ఉంది.
 
ఇక శాంతి సౌందరాజన్‌ది మరింత దీనమయిన గాధ. అంతర్జాతీయ స్థాయిలో 11, జాతీయ స్థాయిలో 50 పతకాలు సాధించిన ఈ అమ్మాయి ఇప్పుడు ఒక రోజువారీ కూలీగా తన బతుకు వెళ్ళదీస్తోంది. దోహా ఏషియన్ గేమ్స్‌లో 800 మీటర్ల పరుగులో రజత పతక విజేత అయిన ఈ అమ్మాయి లింగ నిర్ధారణలో విఫలమై తన పతకాన్ని పోగొట్టుకొని ఆసరగా నిలిచేవారు లేక రోజుకి రెండు వందల రూపాయల కూలితో, అంతర్జాతీయ పోటీలలో విజయం సాధించి సగర్వంగా ఎత్తిన చేతులతో ఇప్పుడు మట్టి పిసుక్కొంటూంది. 
 
ఇన్ని కోట్ల జనాభా ఉన్నా మనకి ఒలింపిక్స్‌లో తక్కువ పతకాలు ఎందుకు వస్తున్నాయో ఇప్పుడు అర్ధమయిందా?

1 comment:

sree said...

aina ee linga nirdharana pareekshalu potee ki munde cheste inni paatlu undevi kadu kada. okavela ammayi+abbayi kani varu unte, vaallaki verega poteelu pettadamo leda vere category create cheyyatamo cheyyali. Talent anedi e okkari sotto kadu kabatti.