ఈగ సినిమాలో సాంకేతిక విలువల గురించి, దర్శకుడు రాజ మౌళి ప్రతిభ గురించి చాలా మంది ఇప్పటికే రాసేశారు. అంచేత నేను మళ్ళీ అదే రాసి సుత్తి కొట్టబోవడం లేదు. ఈ సినిమాలో నాకు నచ్చిన మరొక కోణం గురించి మాత్రమే ఇక్కడ రాస్తాను. సినిమా కథ గురించి ఇప్పటికే అందరికీ తెలిసి పోయి ఉంటుంది కాబట్టి టూకీగా ప్రస్తావిస్తాను. దాని వలన ఇంకా చూడకుండా, చూడాలని అనుకునే వారికి ఇబ్బంది ఏమీ ఉండదు.
ఈ సినిమాలో నాని సమంతాని ప్రేమిస్తూ ఉంటాడు. ఎదురెదురు ఇళ్ళలో ఉంటున్నా, నాని తన వెంట రెండేళ్ళుగా తిరుగుతూ ఉన్నా పట్టించుకోనట్లు నటిస్తూ అతన్ని ఏడిపిస్తూ ఉంటుంది సమంతా. అయినా దానిని పాజిటివ్‌గానే తీసుకుంటాడు నాని. సమంతా ఒక మైక్రో ఆర్టిస్ట్. పెన్సిల్ ముక్కలతో, బియ్యం గింజల మీదా శిల్పాలు, బొమ్మలు చెక్కుతూ ఉంటుంది. ఒక నాటి రాత్రి అలా పనిలో ఉండగా కరెంట్ పోతుంది. దానితో కిటికీ వద్దకు వచ్చి చాలీ చాలని వెన్నెల వెలుగులో పని చేసుకుంటున్న సమంతాని ఎదురింట్లోంచి చూసిన నాని, శాటిలైట్ టీవీ డిష్‌కి సిల్వర్ ఫోయిల్ అతికించి, దాని మీదికి లైట్ ఫోకస్ చేసి ఆ వెలుగుని ఆమె మీదికి డైరెక్ట్ చేస్తాడు. ఆమె కిటికీ మూసి వెళ్ళిపోతుంది. అది చూసి, "చూశావా? నువ్వు ఇంత కష్టపడి లైట్ వేస్తే కిటికీ మూసి వెళ్ళిపోయిందిరా ఆ అమ్మాయి. తనకి నువ్వంటే ఇష్టం లేదు" అని అన్న స్నేహితుడితో,"రేయ్ నేనంటే ఇష్టం ఉండబట్టే వెళ్ళిపోయిందిరా తను. మంచులో రాత్రంతా నేను ఇక్కడే తనని చూస్తూ ఉంటే జలుబు చేస్తుందేమోనని నామీద అభిమానం ఉండబట్టే తనకి పని ఆపడం ఇష్టం లేకపోయినా ఆపేసి వెళ్ళింది" అంటాడు నాని. మరొక సారి గుడిలో అర్చన చేయించి అందరికీ ప్రసాదం పంచి, నాని ఒక్కడికే ప్రసాదం పెట్టదు."చూశావా మీ అందరికీ పెట్టి నా ఒక్కడికే పెట్టలేదు అంటే తనకి నేనంటే ఎంతో స్పెషల్ కాబట్టే కదా" అంటాడు.
ఇలా ప్రతి సంఘటనలోనూ పాజిటివ్‌ని మాత్రమే చూస్తాడు నాని. ఈ పాజిటివ్ దృక్పధం అన్నది ఒక్క ప్రేమ లోనే కాకుండా అన్ని విషయాల్లోనూ అందరూ అలవరచుకోవాలన్నది రాజమౌళి ఉద్ధేశ్యమేమో. అందరూ అలా ఉంటే ప్రేమించలేదని చావడం, చంపడం, ఆసిడ్ పొయడం, చిన్న చిన్న కారణాలతో నిండు ప్రాణాలు తీసుకోవడం లాంటి విపరీత చర్యలకు యువత పాల్పడకుండా ఉంటారేమో?
2 comments:
పాజిటివ్ దృక్పథం ప్రతి ఒక్కరు అలవరచుకోవాలి. మీరు అన్నట్లు యువతకు ఈ వైఖరి అలవడితే వారి జీవనం మొత్తం చక్కగా వుందనటములో సందేహములేదు.
It's true
Post a Comment