యోగా అంటే ఒక చోట కూర్చునో లేక పడుకొనో చేతులూ కాళ్ళూ కదల్చడమేనా, లేక దీని వలన ఏమైనా ఉపయోగాలున్నాయా అన్న ప్రశ్నకి నాకు తెలిసిన సమాధానాలివి.
Flexibility: యోగా వలన ఖచ్చితమైన ప్రయోజనం కండరాలలో బిగుతుతనం తగ్గడం. ఇందులో ఏవిధమైన సందేహం లేదు. మన కండరాలలో actin,myosin అన్న రెండు మూలకాలు ఉంటాయి. వయసుతో బాటు వీటిలో సాగే తత్వం, elasticity, తగ్గి పోతుంది. అందుకే చిన్న పిల్లలు వంగి తమ పాదాలని తేలికగా చేతులతో తాక గలుగుతారు. వయసు మళ్ళిన వారికి ఇది సాధ్యం కాదు. మోకాళ్ల చుట్టూ, వెన్నెముక చుట్టూ ఉండే కండరాల stiffness కూడా మోకాళ్ళ నొప్పులకీ, వెన్నెముక నొప్పికీ కారణం అని డాక్టర్లు తేల్చారు. యోగా వలన ఈ కండరాలలోని బిగుతు తనం తగ్గుతుంది.
Osteo arthritis, Rheumatoid arthritis లాంటి కీళ్ళ జబ్బులలోనూ, వెన్నెముక దెబ్బ తిన్న వారిలోనూ, Multiple sclerosis లాంటి వ్యాధులలోనూ ఈ కండరాల బిగుతు తనం చాలా ఇబ్బంది పెడుతుంది. వీరు దీన్ని తగ్గించుకోవడం కోసం stretching exercises అని చేస్తూ ఉంటారు. యోగా కూడా ఇలాంటిదే. డిస్క్ సమస్యలతో నడుము నొప్పి వచ్చిన వారికి డాక్టర్లు spinal extension exercises చేయమని చెబుతూ ఉంటారు. భుజంగాసనం కూడా ఇలాంటిదే.
Lung expansion: వయసు మీరిన వారిలో ఏదైనా ఆపరేషన్ చేశాక వారి ఊపిరితిత్తుల సామర్ధ్యాన్ని పెంఛడానికి incentive spirometry అని చేయిస్తూ ఉంటారు డాక్టర్లు. ఒక ప్లాస్టిక్ పైపు లోకి గాలి ఊది దానికి మరో వైపు ఉన్న చిన్న బంతిని పైకి లేపడం ఈ ఎక్సర్సైజ్. గట్టిగా గాలి పీల్చి ఊడదం వలన ఊపిరి తిత్తులలో శాఖోప శాఖలుగా ఉన్న గాలి గదులలోని (alveoli) చివరి శాఖలు కూడా గాలి వలన తెరుచుకుంటాయి అన్నది ఇందులోని లాజిక్. ప్రాణాయామం అంటే ఇదే. ఊపిరితిత్తుల సామర్ధ్యం పెంచడం వలన అనేక లంగ్, మరియు గుండె జబ్బులని నివారించవచ్చు అంటారు నిపుణులు.
బరువు తగ్గడం: ఆ మధ్య బాలీవుడ్ చిన్నది(మరీ అంత చిన్నదేమీ కాదు లెండి. ఈమె వయసు ఇప్పుడు 31) జీరో సైజుతో ఒక సినిమాలో ప్రత్యక్షమై తన సన్న ఫిగరుకి కారణం పవర్ యోగా అని కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పింది. దానితో యోగా వల్ల బరువు తగ్గుతారు అన్న అపోహ చాలా మందిలో పెరిగింది.
మాంసాహారం మానేసి మితాహారం తీసుకోవడం వలన బరువు తగ్గ వచ్చేమో కానీ యోగా వలన బరువు తగ్గడం ఉండదు. ఇక ఈ అమ్మడు చెప్పిన పవర్ యోగా లేదా ఫిగర్ యోగా గురించి నాకు తెలియదు.
No comments:
Post a Comment