లండన్‌లో పికడిల్లీ సర్కస్‌లోని DSTRKT అన్న పేరుతో ఒక రెస్టారెంట్ ఉంది. దాని మెనూలో కోపి లువాక్ అన్న పేరుతో ఒక రకం కాఫీ ఉంటుంది. దీని ధర ఒక కప్పు 70 పౌండ్లు. ఇప్పటి మారకం విలువతో చూస్తే అక్షరాలా 5670 రూపాయలు. అయితే ఈ ఖరీదైన కాఫీ ఎక్కడి నుంచి వస్తుందో తెలిస్తే కొందరయినా దాన్ని చూసి యాక్.. థూ.. అంటారు. ఈ కాఫీని తయారు చేయడానికి వాడే గింజలు పునుగు పిల్లి విసర్జనల నుండి అంటే పిల్లి పెంట నుంచి సేకరిస్తారు.
సుమాత్రా, జావా, బాలి, ఇండోనీషియా లలో ఉండే కాఫీ తోటలలో తిరిగే పునుగు పిల్లుల జాతికి చెందిన పిల్లులు కాఫీ చెట్లమీద ఉండే పక్వానికి వచ్చిన పండ్లను తింటాయి. వీటి జీర్ణ వ్యవస్థలో పండులోని గింజ జీర్ణం కాదు. అయితే వీటి కడుపులో, పేగుల్లో ఉండే ఎంజైములు ఈ గింజలపై ఉన్న తొక్క లోంచి లోపలికి వెళ్ళి ఈ గింజల రుచిని మారుస్తాయి. ఈ పిల్లులు అడవుల్లో వేసిన రెట్ట/పెంటని సేకరించి నీటిలో శుభ్రపరచి, ఎండ పెట్టి వేయించి. పొడి చేస్తారు. దాని నుండి తయారు చేసిందే ఈ కోపి లువాక్. కోపి అంటే కాఫీ అని అర్ధం. లువాక్ అనేది ఈ పిల్లులకి స్థానికంగా ఉన్న పేరు.
ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ. దీనిలో కూడా వీజెల్ కాఫీ అని ఒక రకం కిలో ఆరు వేల డాలర్లు, అంటే సుమారుగా మూడు లక్షల రూపాయలు పలుకుతుంది. అందుకే ఈ పునుగు పిల్లులని పెంచడానికి ఆరాలు పెట్టి మరీ ఈ రకం కాఫీని తయారు చేస్తున్నారు. పిల్లుల విసర్జనలోంచి తీసిన గింజలు బాగా కడిగి ఎక్కువ వేడిలో వేయించాక ఈ గింజలలో ఎలాంటి హాని చేసే క్రిములు ఉండవని నిరూపించినా, మరీ పిల్లుల పెంట తాగడమేమిటి అన్న ఫీలింగ్ లేకుండా ఆ రుచి ఉండేలా చేయడానికి అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక రసాయనిక ప్రక్రియ ద్వారా పునుగు పిల్లుల పేగుల్లో జరిగె ప్రక్రియని బయట జరిపే విధానం తయారు చేశారు. ఈ ప్రక్రియ ద్వారా తయారు అయ్యే కాఫీ పిమెరో ఇతర రకాల కాఫీల ధరకే మార్కెట్‌లో దొరుకుతుంది. అయినా పిల్లుల లోంచి వచ్చిన గింజలతో చేసిన కాఫీని అంత డబ్బూ తగలెసి తాగే వారికి కొదవ లేదు.
ఎలా మొదలయింది?
మలయా, సుమత్రా దీవుల్లో కాఫీ పంటకి బాగా అనువయిన వాతావరణం ఉండడంతో పంతొమ్మిదో శతాబ్ధి చివరిలో ఆంగ్లేయులు ఇక్కడ కాఫీ సాగు మొదలు పెట్టారు. అయితే కాఫీ తోటల్లో పని చేసే స్థానికులని కాఫీ గింజలు ఇళ్ళకి తీసుకెళ్ళనిచ్చేవారు కాదు. దానితో వారిలో ఆ పానీయం పట్ల ఉత్సుకత పెరిగింది. అందులో ఏముందో చూడాలి అనుకున్నారు. అడవుల్లో తిరిగే పిల్లి జాతి జంతువులు పక్వానికి వచ్చిన కాఫీ పండ్లు తిని వాటి గింజల్ని ఎలాంటి మార్పూ లేకుండా విసర్జించడం చూసి, ఆ గింజలు సేకరించి వాటితో కాఫీ చేసుకుని తాగే వారు. అయితే ఈ సంగతి ఎలాగో తోటల యజమానులకి తెలిసింది. వారు ఆ పిల్లి పెంట కాఫీ తాగి దాని రుచి అమోఘంగా ఉండడంతో వారు కూడా ఆ గింజలు సేకరించి వాటితో వ్యాపారం మొదలు పెట్టారు. ఈ కాఫీ రుచి బాగా ఉండి, పరిమితంగా లభ్యం అవడం వల్ల ఈ కాఫీ వెల బాగా ఎక్కువ అయింది.
ఒక కప్పు కాఫీ చేయడానికి సరిగ్గా ఎనిమిది గ్రాముల పొడి తూకమేసి మరీ వాడుతారు. పిల్లి పెంటలో తీసిన గింజలతో కాఫీ చేసుకొని తాగడమేమిటి..థూ.. అనే వాళ్ళు ఉన్నా ఈ రకం కాఫీకి ఆదరణ బాగా ఉంది. జిహ్వకో రుచి అని ఊరికే అన్నారా?
No comments:
Post a Comment