2011 లో రష్యా ప్రయోగించిన ఉపగ్రహాలు ఎక్కువ భాగం నేల మీదే రాలిపోయాయి. ఈ సంవత్సరం మొత్తం ఆరు ఉపగ్రహాలు తమ కక్ష్యలోకి చేరకుండా రాలిపోయాయి. సాధారణంగా ఇలా భూమి మీద పడ్డ వాటిలో అధిక భాగం ఎక్కడో ఎడారులలోనో, సముద్రాలలోనో పడుతుంటాయి. అప్పుడెప్పుడొ స్కైలాబ్ గానీ, మొన్నీ మధ్య ఒక అమెరికన్ ఉపగ్రహం కానీ జనావాసాల మధ్య పడే అవకాశం ఉందని భయ పెట్టినా అవి చివరికి ఎక్కడో సముద్రాలలో కూలిపోయి ఎవరికీ హాని కలిగించలేదు.
అయితే శుక్రవారం రష్యన్లు సోయుజ్ రాకెట్ ద్వారా ప్రయోగించిన మెరిడియన్ అనే ఉపగ్రహం మాత్రం అలా కాకుండా జనావాసం మధ్య పడడానికి ఎంచుకుంది. దీనిలో ఐరనీ ఏమిటంటే అది అందుకు ఎంచుకున్న ప్రదేశం. రష్యా దేశానికి చెందిన ఆసియా భూభాగంలోని సైబీరియా ప్రాంతంలో నోవోబిర్స్క్ ప్రాంతంలో ఒర్డిన్స్క్ జిల్లాలో వాగైత్సెవో అన్న గ్రామం ఉంది. ఈ ఊరిలో కాస్మొనాట్ వీధి ఉంది. కాస్మొనాట్ అంటే వ్యోమగామి. అమెరికన్లు ఆస్ట్రొనాట్ అంటే రష్యన్లు కాస్మొనాట్ అంటారు. తమ దేశానికి అంతరిక్ష రంగంలో పేరు తెచ్చి పెట్టిన యూరి గగారిన్, వాలెంటినా టెరిష్కోవా లాంటి వ్యోమగాములని పురస్కరించుకొని ఆ వీధికి ఆ పేరు పెట్టారు.
ఆ వీధిలో ఆండ్రీ క్రివోరుచెంకోకి చెందిన ఇంటి మీద మెరీడియన్ ఉపగ్రహానికి చెందిన అర మీటరు వ్యాసం గల ఒక గోళం వచ్చి పడి ఇంటి కప్పుకి రంధ్రం చేసింది. అయితే ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు తగల్లేదు. ఇంటికి జరిగిన నష్టాన్ని తాము భరిస్తామని రష్యా అంతరిక్ష సంస్థ తెలిపింది.
ఈ సంవత్సరం రష్యా అంతరిక్ష ప్రయోగాలకి అచ్చి రాలేదు. ఆరు ప్రయోగాలు విఫలమయ్యాయి. ఇదే సోయుజ్ రకానికి చెందిన మరో రాకెట్ ప్రయోగం ఇవాళ(డిసెంబరు26) రష్యాలోని బైకనూర్‌లో జరగనుంది. అదైనా విజయవంతం కావాలని అధికారులు ఆశిస్తున్నారు.
No comments:
Post a Comment