రామాయణంలో రావణాసురుడికి పది తలలున్నాయని రాశారు. అయితే సినిమాలలో ఎంటీఆర్ ఒక తలతోనే కనిపిస్తాడు. యానిమేషన్ చిత్రాలలో రాముడితో చివరి యుద్ధం చేసే సమయంలో పది తలలు ఉన్నట్లు, రాముడు వాటిని ఒక్కొక్కదాన్ని తెగ వేస్తుంటే అవి మళ్ళీ మొలుస్తున్నట్టు చూపిస్తారు. అయితే మనకు తెలిసి మనుషులకు ఒకటే తల ఉంటుంది. శరీరాలు అతుక్కుని పుట్టిన సయామీస్ ట్విన్స్ విషయంలో రెండు తలలు ఉన్నా అవి రెండు శరీరాలు.
అయితే ఈ సోమ వారం బ్రెజిల్‌లో ఒక తల్లి రెండు తలల శిశువుకి జన్మనిచ్చింది. ఒకటే శరీరం, రెండు తలలు ఉన్న ఆ శిశువు నిజానికి ఒక రకం సయామిస్ (conjoined) ట్విన్స్ రకానికి చెందినది. ఆమె బ్రెజిల్‌లో మారు మూల ప్రాంతంలో ఉన్నందువలన కాన్పుకి ముందు స్కానింగ్ తీసుకునే ప్రయత్నం చేయలేదు. అయితే కాన్పు కష్టం కావడం వల్ల హాస్పిటల్‌కి వెళ్ళి సిజేరియన్ చేశాక కానీ విషయం తెలియలేదు.
డాక్టర్లు పరీక్షలు చేశాక ఆ శిశువుకి రెండు మెదడులు, వెన్నుపూసలు ఉన్నట్లు, అయితే గుండె, కాలేయం ఒకటే ఉన్నట్లు, కిడ్నీలు, ఊపిరి తిత్తులు కూడా ఒక జత మాత్రమే ఉన్నట్లు తెలిసింది. సాధారణంగా ఇలా జన్యు లోపాలతో పుట్టిన వారిలో ఇతర అవయవ సంబంధమయిన లోపాలు ఉంటాయి. అయితే ఈ శిశువులో అవేమీ లేవు. ఆ శిశువు రెండు తలలతోనూ స్తన్యం సేవిస్తుంది. చాలా అరుదుగా సంభవించే ఈ రకమయిన కవలలని dicephalic paraphagus అంటారు.
రెండు తలలు పూర్తిగా అభివృద్ధి చెంది ఆరోగ్యంగా ఉన్నందు వలన ఆపరేషన్ చేసి ఒక తలని తొలగించాలన్న ఆలోచన ఏదీ చేయడం లేదని డాక్టర్లు చెప్పారు. మరి కొన్నాళ్ళు వేచి చూసి ఒక నిర్ణయం తీసుకొంటామన్నారు. క్రిస్‌మస్ నెలలో పుట్టారు కాబట్టి వారిద్దరికీ ఇమ్మాన్యుయేల్, జీసస్ అని పేర్లు పెట్టారు తల్లి తండ్రులు.
అతి అరుదయిన ఇలాంటి జననం మరొకటి ఈ సంవత్సరం బ్రెజిల్‌లోనే జరిగింది. అయితె ఆ శిశువు పుట్టిన కొన్ని గంటల్లోనే మరణించింది.
అమెరికాలోని మిన్నెసోటాలో అబిగైల్, బ్రిటాన్నీ అనే ఇలాంటి జంట 1990 లో జన్మించి ఎలాంటి ఆరోగ్యపర సమస్యలు లేకుండా జీవిస్తూ ఉంది. వీరి గురించి డిస్కవరీ చానల్, ఓప్రా విన్‌ఫ్రే షొ లలో కూడా చూపించారు.
శరీరాలు కలిసి ఉన్నా ఆలోచనలు వేరుగా ఉన్న వీరికి వ్యక్తిత్వాలు కూడా వేరుగా ఉన్నాయి. అభిరుచులు, ఇష్టాలు వేరు వేరుగా శరీరాలు ఒకటిగా వీరు బతుకుతున్నారు.
1 comment:
సృష్టిలో ఎన్నో వింతలు!
Post a Comment