ఈ ఏప్రిల్ నెల చివరిలో కూర్గ్ ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు ఒక రోజు నాగర్ హోళె నేషనల్ పార్క్‌లో ఉండేలా ప్లాన్ చేశాను పిల్లలకి అసలైన అరణ్యం ఎలా ఉంటుందో చూపించాలని. మేము కూర్గ్ నుంచి వెళ్ళేసరికి మద్ఝ్యాహ్నమయింది. ఆరోజు సాయంత్రం జంగిల్ సఫారీకి వెళ్ళే మూడు వాహనాలు అప్పటికే బుక్కయిపోయాయి. మా డిజప్పాయింట్‌మెంట్‌ని చూసిన అక్కడి గైడ్ "మరేం ఫర్లేదు సర్. అసలు జంతువులని చూడ్డానికి వేకువ జాము సరయిన సమయం. రేప్పొద్దున ఆరు గంటలకి జీప్ బుక్ చేసుకోండి. కావాలంటే ఇప్పుడు మీ టాక్సీలో మా జీప్ వెనకాలే రండి. అడవిలోకి వెళ్ళోచ్చు. వచ్చేటప్పుడు అక్కడ చెక్‌పోస్టులో అయిదు వందలు ఇస్తే సరి" అని చెప్పడంతో మేం మాటాక్సీలో బయలు దేరాం.
కర్ణాటక, తమిళ నాడు, కేరళల్లో విస్తరించి ఉన్న మహారణ్యం అది. కర్ణాటకలో రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అని పేరు పెట్టినా అందరూ నాగర్ హోళె అనే పిలుస్తారు. కేరళలో ఉన్న భాగాన్ని పెరియార్ నేషనల్ పార్క్ అంటారు. తమిళ నాడులో ఉన్న భాగంలోనే ఒకప్పుడు వీరప్పన్ వీర విహారం చేశాడు. దీనిని ముదుమలై నేషనల్ పార్క్ అంటారు.
మొదటి రోజు ఒక నీటి గుంట దగార దాహం తీర్చుకొంటున్న ఒక ఏనుగు, జింకలు, కొన్ని పక్షులు, అడవి కోళ్ళు, రోడ్డు దాటి తమ నివాసానికి వెళ్తున్న ఏనుగులు కనిపించాయి. అయితే తిరిగి వచ్చే సమయంలో రోడ్డు అంచు దాకా వచ్చిన ఒక గజ రాజు తొండం పైకెత్తి చెట్ల ఆకులు తుంచుకొని తింటూ చాలా సేపు మాకు, మా కెమెరాలకీ కను విందు చేసింది.
నీటి మడుగు దగ్గర దాహం తీర్చుకొంటున్న ఏనుగు. అది చాలా చిన్నగా ఉన్నందువల్ల ఫోటోని క్రాప్ చేసి మార్క్ చేశాను.
అడవి కోడి.
రోడ్డు దాటుతున్న ఏనుగుల మంద. మేం తిరిగి వస్తున్నపుడు మా వాహనం వెనకాల ఇవి ఉండడంతో అన్నీ దాటి వెళ్ళక గానీ మేం గమనించలేదు. మేము చూసినప్పుడు రెండే ఉన్నాయి.
లాంగూర్ అని పిలవబడే ఒక కోతి. కొండ ముచ్చు అంటారు తెలుగులో.
ఒక జింకల కుటుంబం.
మాకోసమే అన్నట్టు రోడ్డు అంచుదాకా వచ్చి విన్యాసాలు చేస్తున్న గజరాజు.
సఫారీ నుంచి తిరిగి వచ్చాక డిన్నర్ సమయంలో ట్రైబల్ డాన్స్ అరేంజ్ చేశారు రిసార్టు వాళ్ళు. ఉత్సాహం ఉన్న కొందరు గెస్టులు కూడా వారితో కలిసి చిందేశారు.
పక్కరోజు ఉదయం మాకు కనిపించిన నాగర్ హోళె అందాల గురించి మరో పోస్టు రాస్తాను.