నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, February 7, 2013

కోట్ల ఆస్తితో పిల్లనిచ్చిన మామగారిమీద సుబ్రావ్ ఎందుకు అలిగాడంటే .........(ఒక జోకు)


అల్లుడు అలక పాన్పు ఎక్కాడని తెలియగానే పరంధామం ఆశ్చర్యపోయాడు. తన ఒక్కగానొక్క కూతురు, ఆస్తి పాస్తులు, లక్షల కట్నం అంతా ఇచ్చిన తరువాత అల్లుడికి ఏం తక్కువయ్యిందని అలక పూనాడో ఆయనకి అర్ధం కాలేదు. అస్సలు సుబ్రావ్ ఆయనకి అల్లుడు అయిన విధమే ఒక విచిత్రం. అదేమంటే......
 
ఇంజనీరింగ్ పూర్తి చేసి, బెంగుళూరులో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సుబ్రావ్ ఒకసారి పండగకని సెలవు పెట్టి తన ఊరొచ్చాడు. పిసినారిగా పేరున్న సుబ్రావ్ కూడా ఊరిలో పొద్దు పోక సినిమాకి వెళ్దామని బయలు దేరాడు. ఊరిలో ఉన్న ఒకే ఒక హాలు  బుకింగ్ కౌంటర్‌లో తల పెట్టి "టిక్కెట్ ఎంత?" అనడిగాడు. ఆ టాకీస్‌కి ఓనర్, టికెట్ అమ్మేవాడు ఒకడే. అతను పిసినారి పరంధామం. టిక్కెట్ కౌంటర్‌లో ఎవరినయినా పెడితే వాడు మోసం చేస్తాడేమోనన్న భయంతో, ఇంత పనికి మళ్ళీ ఇంకొకడు ఎందుకు అన్న భావంతో ఆ పని కూడా తనే చేసేవాడు. 
 
"కుర్చీ పది రూపాయలు, బెంచి అయిదు రూపాయలు, నేల మూడు రూపాయలు" అని చెప్పాడు పరంధామం. "సరే, బెంచి టికెట్ ఒకటి కావాలి. ఇచ్చే రేటు చెప్పు" అన్నాడు సుబ్రావ్. తన జీవితంలో సినిమా టికెట్‌ని బేరమాడేవాడిని తొలిసారిగా చూసిన ఆనందంలో అహ నా పెళ్లంట సినిమాలో ఎండు పుల్లలు ఏరుకుంటున్న రాజేంద్ర ప్రసాద్‌ని చూసినప్పుడు కోట శ్రీనివాస రావుకి కలిగిన అనుభూతి కలిగింది పరంధామానికి. సినిమా టికెట్ ఫిక్సెడ్ అని సుబ్రావ్‌కి నచ్చజెప్పి బెంచి టికెట్ ఇచ్చి పంపాడు.

లైట్లు ఆరిపోయి న్యూస్ రీల్ వస్తుండగా పైన ఎప్పుడో తిరగడం మానేసి అలంకార ప్రాయంగా ఉన్న ఒక సీలింగ్ ఫ్యాను జారి సరిగా సుబ్రావ్ నెత్తి మీద పడింది. కెవ్వుమని అతను అరిచిన అరుపుకి ఊరు ఊరంతా ఉలిక్కి పడింది. పరుగెత్తుకు వచ్చిన పరంధామం పక్క వీధిలో ఉన్న ఆరెమ్పీ డాక్టర్ దగ్గర సుబ్రావ్‌కి చికిత్స చేయించాడు. ఆ క్రమంలో సుబ్రావ్ తాలుకు పుట్టు పుర్వోత్తరాలు తెలుసుకొని అతను తమ కులం వాడేనని గ్రహించి అతనిలో తన ఒక్కగానొక్క కూతురుకి మొగుడ్ని చూశాడు. అంతేకాక సినిమా టికెట్ కోసం బేరమాడ గలిగిన అతని పొదుపరి స్వభావానికి ముగ్ధుడయి సుబ్రావ్ తల్లి తండ్రులతో మాట్లాడాడు.

ఒక్కగానొక్క కూతురు, పరంధామానికి  హాలు గాక ఒక రైస్ మిల్లు ఓ యాభయి ఎకరాల మాగాణి, పాతిక ఎకరాల మామిడి తోట ఉన్నందువల్ల, అమ్మాయి కూడా చక్కగా ఉన్నందువల్ల సంబంధం కుదిరిపోయింది. బంధువులలో ముఖ్యమయిన వాళ్లనే పిలిచి ఆర్భాటాలేవి పెట్టుకోకుండా పొదుపుగా పెళ్ళి జరిపించి కార్యమ్ గదిలొకి అల్లుడిని పంపిస్తే ఇలా అలక వహించాడు సుబ్రావ్.
.........................
"అల్లుడూ, ఏమి తక్కువయిందని అలిగావు తండ్రీ?" అని చేతులు పట్టుకున్నాడు పరంధామం.

"మామ గారూ, మీరు నాకు కట్నమిచ్చారు, ఆస్తి నా పేరు మీద రాశారు. అంతా బాగా ఉంది కానీ, ఆ రోజు నేను సినిమా చూడ్డానికి మీకు అయిదు రూపాయలిచ్చి బెంచి టికెట్ కొన్నాను కదా. అసలు సినిమా మొదలవకుండానే నా నెత్తిన ఫ్యాన్ పడింది కదా?" అన్నాడు సుబ్రావ్.

"నిజమే బాబూ. అందువల్లనే కదా నేను నిన్ను చూసింది. ఈ పెళ్ళి జరిగిందీనూ?"

"అయితే నేను సినిమా చూడలేదు కాబట్టి ఆ అయిదు రూపాయలు నాకు వెనక్కి రావాలి కదా. మరి మీరు ఇచ్చారా?" అన్నాడు సుబ్రావ్

Wednesday, February 6, 2013

ఒరిజినల్ చంద్రముఖి (లక లక లేదు)


తెలుగు తమిళ బాషల్లో వచ్చిన చంద్రముఖి ఎంత పెద్ద హిట్టో చెప్పాల్సిన పని లేదు. బాబా సినిమా దెబ్బకి కుదేలయిన రజనీ కాంత్‌కి కొత్త ఊఫు ఇచ్చింది పి.వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా. కన్నడంలో ఆప్త మిత్ర పేరుతో, బెంగాలీలో రాజ మహల్ పేరుతో, హిందీలొ భూల్ భులయ్యా పేరుతో రీమేక్ అయి అన్ని చోట్లా విజయం సాధించింది. అయితే ఈ సినిమాకి మాతృక 1993లో మళయాళంలో నిర్మితమయిన మణిచిత్రతాళ్ అన్న సినిమా. దీనికి దర్శకుడు ఫాజిల్. నాగార్జున హీరోగా, నగ్మా హీరోయిన్‌గా వచ్చిన కిల్లర్ సినిమా దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకి కూడా ఈయన పరిచితుడు.
  
ఈ మళయాళ సినిమాలో సురేష్ గోపి, శోభన ముఖ్య పాత్ర ధారులు. సైకియాట్రిస్టుగా మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించాడు. ఇందులో మోహన్ లాల్ పాత్ర సహాయ నటుడుగానే ఉంటుంది.  ఈ సినిమాలో జమీందారు పాత్ర లక లక శబ్ధం చేయదు. ఈ సినిమాలో నటనకు శోభనకి జాతీయ అవార్డు వచ్చింది. ఈ సినిమా ఆత్మ రాగం పేరిట తెలుగులో డబ్ అయింది. అంతగా ఆడలేదు. తరువాత పి.వాసు దీనిని ఆప్త మిత్ర పేరుతో కన్నడంలో విష్ణు వర్ధన్ హీరోగా తీసి హిట్ కొట్టాడు. దానిని చూపించి రజనీ కాంత్‌ని తమిళ సినిమాకి ఒప్పించాడు. అయితే ఈ కన్నడ, తమిళ, తెలుగు వెర్షన్లలో సైకియాట్రిస్టు పాత్ర నిడివి బాగా పెరిగింది. తిరిగి హిందీలో మాత్రం మళయాళ మాతృకననుసరించి తీశారు. 
 మళయాళంలో సినిమాకి కథకుడు మధు ముట్టం. కానీ కన్నడ, తమిళ సినిమాలకి కథకుడిగా పి.వాసు పేరు ఉంటుంది. ఆ విషయమ్మీద మధు ముట్టం కోర్టుకి ఎక్కడంతో హిందీలో కథకుడిగా ఆయన పేరు వేశారు. మణిచిత్రతాళ్ సినిమాకి రెండవ యూనిట్ దర్శకుడిగా ప్రియదర్శన్ పని చేశాడు. కన్నడంలో సౌందర్యకి, తమిళంలో జ్యోతికకి ఈ సినిమా ఉత్తమ నటి అవార్డు తెచ్చిపెట్టింది.

కేరళలో మూడు వందల రోజులు ఆడిన ఈ సినిమా అప్పట్లో అయిదు కోట్ల షేర్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమా విడుదల అయి రెండు దశాబ్ధాలు గడిచినా కేరళలో ఆసియా నెట్ చానల్ ఈ సినిమాని ప్రతి సంవత్సరం కనీసం పది సార్లు అయినా వేస్తుంది. టీవీలో ఈ సినిమా వచ్చిన ప్రతి సారీ టీఆర్‌పీ రేటింగ్‌లో అగ్రస్థానంలో నిలుస్తుంది. యూట్యూబ్‌లో రెండు గంటలా ముప్పయి ఆరు నిముషాల నిడివి ఉన్న ఈ సినిమా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో దొరుకుతుంది.https://www.youtube.com/watch?v=qdp4xudz958 టైముంటే చూడండి. బావుంటుంది. 


Monday, February 4, 2013

Google తో ఈ గమ్మత్తులు చేసి చూడండి


Google space bar లో Do a Barrel Roll అని టైప్ చేసి Enter నొక్కండి. ఏం జరుగుతుందో చూడండి.

Google ని వెనకనుంచి అంటే elgooG అని టైప్ చేసి Enter నొక్కి చూడండి.

Google space bar లో Zerg Rush అని టైప్ చేసి Enter నొక్కి రెండు నిముషాలు చూడండి.

Google space bar లో Funny Google అని టైప్ చేసి వచ్చిన మొదటి లింక్ ఓపెన్ చేయండి. అప్పుడు వచ్చిన బాక్స్‌లో మీ పేరు టైప్ చేసి Enter నొక్కండి. Google స్థానంలో ఆవే రంగుల్లో మీ పేరు వస్తుంది.

Saturday, February 2, 2013

1942లో పోలీసు స్టేషన్ ముందు వందే మాతర నినాదం చేసి తప్పించుకున్న సుబ్రావ్ కథ (కామెడి)


1942. మహాత్మా గాంధీ ఇచ్చిన క్విట్ ఇండియా పిలుపు నందుకొని అందరు భారతీయులూ స్వాతంత్ర్య ఉద్యమంలో దూకి పరాయి పాలనకి వ్యతిరేకంగా పోరాడుతున్న రోజులు. ఉద్యమ తీవ్ర రూపం చూసి బ్రిటీషు వారు బెంబేలెత్తిపోయి తమ అణచివేతని తీవ్రతరం చేశారు. అయినా ఉద్యమం ఏమాత్రం చల్లారలేదు. వందే మాతరం అన్నది భారతీయులకి రణ నినాదమయింది.
 
అలాంటి రోజుల్లోనూ సుబ్బారావు తన పనేమిటో తాను చూసుకోవడమె కానీ ఇలాంటి పనులకి దూరంగా ఉన్నాడు. తానొక్కడు పోరాటం చేసినంత మాత్రాన స్వాతంత్ర్యం ఒకరోజు ముందు రావడం కానీ, తాను చేయనంత మాత్రాన ఒకరోజు ఆలస్యంగా రావడం కానీ ఉండదని నమ్మిన అతగాడు తాను, తన చిల్లరకొట్టు, భార్యా బిడ్డలూ లోకంగా గడిపేవాడు. 
 
అలాంటి వాడు కూడా ఒక రోజు వీధిలో వెళ్తూ పోలీసు స్టేషన్‌ని, అక్కడ కాపలాగా ఉన్నబ్రిటీషు పోలీసులని చూసి ఆవేశపడి పోయాడు. ఆవేశంతో రెచ్చి పోయి ముందూ వెనకా ఆలోచన లేకుండా పిడికిలి బిగించి "వందే మాతరం" అని గొంతెత్తి అరిచాడు. ఆ కేక విని అయిదారు మంది పోలీసులు బిలా బిలా పరుగెత్తుకొచ్చి, "ఏంట్రా కూశావ్?" అనరిచారు. పోలీసులని వాళ్ళ చేతుల్లో లాఠీలు, తుపాకులనీ చూశాక సుబ్బారావుకి ఆవేశం ఒక్కసారిగా దిగిపోయింది.
 
"అబ్బెబ్బే, ఏం లేద్సార్. ఆ పక్కన పోతున్న సపోటా పండ్లు అమ్మే వాడిని వంద ఏ మాత్రం? అనడిగానంతే" అని జవాబిచ్చాడు. దానితో ఆ పోలీసులు మన వాడిని వదిలేసి స్టేషన్‌లోకి వెళ్ళిపోవడంతో బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకొని వెళ్ళి తన చిల్లర కొట్టులో కూర్చున్నాడు. ఆ తరువాత 1947 ఆగష్టు 16 వరకూ ఆ దారిలో నడవనే లేదు మన సుబ్రావ్.