నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, January 31, 2012

దళిత ముద్ర లేకపోతే అంబేద్కర్‌కి ఇంత సీనుండేదా?


మొన్న అమలాపురంలో కొందరు దుండగులు అంబేద్కర్ విగ్రహాలు నాశనం చేయగానే అన్ని పార్టీలకు చెందిన నాయకులు యుగాంతం వచ్చినట్లు రియాక్ట్ అయ్యారు. ఎక్కడెక్కడో ఉన్న వారందరూ వచ్చి ఆ విగ్రహాలను పరిశీలించి ఆ సంఘటనని ఖండించారు. చివరికి వి. హనుమంత రావు కూడా రంగంలోకి వచ్చాడు. అంబేద్కర్ విగ్రహాలని ప్రభుత్వమే పునరుద్ధరించాలని, కాంస్య  విగ్రహాలని ఏర్పాటు చేయాలని, అన్ని అంబేద్కర్ విగ్రహాలకి ప్రభుత్వం రక్షణ ఏర్పాటు చేయాలని ఇలా ఎవరికి తోచినట్లు వారు స్టేట్‌మెంట్లు ఇచ్చి అంబేద్కర్ అంటే తమకి ఎంతో భక్తి ఉందని చాటుకోవాలని ప్రయత్నించారు. మరి కొందరయితే అంబేద్కర్ అసహ్యించుకున్న బ్రాహ్మణవాద రిచువల్స్ అయిన క్షీరాభిషేకం, గంగా జల, గంధపు అభిషేకం లాంటి వాటితో ఆ విగ్రహాలని శుద్ధి చేసే తిక్క పనులు కూడా చేశారు.
   

ఈ ఎపిసోడ్ మొత్తంలో అందరూ వినిపించిన రాగం ఏమంటే అంబేద్కర్ ఏ ఒక్క మతానికో, కులానికో చెందిన వ్యక్తి కాదు, భారత రాజ్యాంగ నిర్మాతగా మొత్తం జాతికే ఆరాధ్యనీయుడు, భారత జాతి మొత్తం గర్వించదగ్గ వ్యక్తి అన్నది. అంబేద్కర్ దళితుడు కాకపోయినా, దళిత ఓటు బ్యాంకుకి ఆయన ఐకాన్ కాకపోయి ఉన్నట్లయితే ఈ నాయకులు ఈ విషయంలో ఇంతగా స్పందించి ఉండేవాళ్ళా? రాజ్యాంగాన్నే ఎప్పుడో తుంగలో తొక్కిన ఈ నాయకులు రాజ్యాంగ నిర్మాతకి ఈ విలువ ఇచ్చేవారా? 

Wednesday, January 18, 2012

ఒక్క రోజులో పది వేల రూపాయలు 49 వేల కోట్ల రూపాయలుగా మారిపోయిన వైనం


ఇదేదో ముఖ్యమంత్రి కొడుకుగా జగన్ మోహన్ రెడ్డి చేసిన స్కామో, తన పదవిని అడ్డు పెట్టుకొని 2G రాజా చేసిన కుంభ కోణమో తండ్రి నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి అంబానీలు సంపాయించిన అస్థులో కావు. ఒక బడి పంతులు బ్యాంక్ అకౌంట్‌లో జరిగిన విడ్డూరం ఇది.
 


పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలోని బాలుర్‌ఘాట్ అనే ఊరిలో నివసిస్తున్న పారిజాత్ సహా అనే బడి పంతులుకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆదివారం గూబ గుయ్యిమనేలా షాక్ ఇచ్చింది. నెలకి ముప్పయి అయిదు వేలు జీతం అందుకొనే ఈ అయ్యవారికి ఆ బ్యాంక్‌లో అకౌంట్ ఉంది.  అకౌంట్‌లో బ్యాలన్స్ చూసుకొందామని ఆదివారం ఇంటర్‌నెట్‌లో చెక్ చేశాడు సహా. అతని లెక్క ప్రకారం అందులో పది వేల రూపాయలు ఉండాలి. వడ్డీ కలుపుకొన్నా ఇంకో వందో రెండొందలోఅదనంగా ఉంటుంది అంతే అనుకుని తన ఖాతా వివరాలు ఓపెన్ చేసిన పారిజాత్ సాహాకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాకయింది. అతని ఖాతాలో ఉన్న బ్యాలన్స్ అక్షరాలా నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు. అంకెల్లో అయితే 49,000,00,00,000 రూపాయలు.
Parijat Saha 
ఎప్పుడో ప్రభుత్వ బడ్జెట్ లెఖ్ఖల్లో, అంబానీల ఆస్తి పాస్తుల వివరాల్లోనో, 2G స్కాముల గొడవల్లోనో తప్ప అంత మొత్తం చూసి ఉండని మనలాంటి మామూలు పౌరుడు అయిన పారిజాత్ సాహా షాక్ నుండి తేరుకొని మరుసటి రోజు బ్యాంక్ మానేజర్‌ని కలిసి విషయం చెప్పాడు. ఆ పొఅరబాటు ఎలా జరిగిందో అర్ధం కాక జుట్టు పీక్కుని ఈ విషయం ఎక్కడా చెప్పొద్దని ఆయన అకౌంట్‌ని బ్లాక్ చేశారు. 


తనకి రావలసిన పది వేల రూపాయలు డ్రా చేసుకున్న సాహా తన అకౌంట్‌లో ఆ మొత్తం ఇంకా అలాగే ఉంది అంటున్నాడు. అసలే జరిగిందో తెలుసుకొనే ప్రయత్నంలో సదరు బ్యాంక్ సిబ్బంది మునిగి పోయారు. 

Sunday, January 15, 2012

భారత క్రికెట్ జట్టుని అజేయంగా మార్చడం ఎలా (విదేశీ గడ్ద మీదయినా సరే)?


అస్ట్రేలియాలో మన జట్టు ఎదుర్కొంటున్న అపజయాలని, అవమానాలనీ చూస్తుంటే చాలా బాధ వేస్తుంది.  99  సెంవరీలు చేసిన టెండూల్కర్, కోటాను కోట్ల వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్న ధోని ఇలాంటి అద్వితీయమైన ఆటగాళ్ళు ఉండీ అలా అపజయాల బారిన పడ్డం ఏమైనా న్యాయమా? అందులోనూ మన BCCI  వీరి వెనక ఉంది అన్న విషయం తెలిసి కూడా ఈ మీడియా ఇలా విజృంభించి వీరిని ఇలా చీల్చి చెండాడుతుంది అంటే మరి బాధేయదూ? ఈ వరుస పరాజయాలు మన ఆర్ధిక వ్యవస్థను కూడా దెబ్బ తీస్తాయి మరి. ఇంకొన్నాళ్ళు ఈ పరాజయ పరంపర కొనసాగితే అభిమానులు క్రికెట్‌ని వదిలి పారేస్తే వందల కోట్ల పెట్టుబడితో నడుస్తున్న ఐపీఎల్ ఏం కావాలి? వేల కోట్లతో నడుస్తున్న వ్యాపార సామ్రాజ్యాలు ఏం కావాలి?
 

కాబట్టి BCCI రంగంలోకి దిగి కొన్ని చర్యలు చేపడితే ఈ అపజయాలకు అడ్డు కట్ట వేసి మన జట్టుని విజయాల వైపు మళ్ళించవచ్చు. ఇలా చేయడం అయ్యే పనేనా అన్న అనుమానం వద్దు. ఈ BCCI కి ఉన్న ఆర్ధిక బలంతో ఏమైనా చేయొచ్చు. ICC కూడా మనవాళ్ళు చెప్పినట్లు ఆడుతోంది కదా? అంపైర్ నిర్ణయాలని పునఃపరిశీలించే DRS మాకొద్దు అని మనవాళ్లంటే సరే అలాక్కానివ్వండి అని సర్దుకుపోలేదూ?



మనం మన దేశంలోనే, కాదంటే భారత ఉపఖండంలోనే అన్ని మ్యాచ్‌లు ఆడాలి. అప్పుడప్పుడూ విదేశీ టూర్స్ లేకపోతే మరీ బావుండదు అనుకొంటే అక్కడ మన వాళ్ళు ఆడే పిచ్‌లన్నీ మన వాళ్ళు నియమించిన క్యూరేటర్స్ మాత్రమే డిజైన్ చేయాలి. మన ప్రత్యర్ధి జట్లు వాళ్ల జట్లలో ఇద్దరికి మించి ఫాస్ట్ బౌలర్లకి చోటివ్వకూడదు. మన వాళ్ళు అయిదు వికెట్లు కోల్పోతే ఆ తరువాత మన ప్రత్యర్ధి జట్లు ఎప్పుడు ఎవరు బౌలింగ్ చేయాలి అన్నది నిర్ణయించే అధికారం మన కెప్టెన్‌కి ఉండాలి. 
 
 బ్యాట్స్‌మెన్‌లో కనీసం ఒకరికయినా సెంచరీ పూర్తయిందాక అవుట్ కాకుండా అడే సౌలభ్యం ఉండాలి. ఎన్ని సార్లు అవుటయినా వంద పరుగులు అయ్యేదాకా క్రీజ్‌లోనే ఉంటాడన్నమాట. ఇక బౌలింగ్ విషయానికొస్తే పిచ్ ఎక్కడయినా ఫాస్ట్ బౌలింగ్‌కి అనుకూలిస్తుంది అన్న అనుమానం వస్తే మన జట్టు ప్రపంచంలో ఏ దేశానికి చెందిన బౌలర్లనయినా కొనుక్కోవచ్చన్న అధికారం కూడా మనకి ఉండాలి. మన వాళ్ళిచ్చే డబ్బుకి ఎవరయినా వాళ్ళ జట్టు అప్పుడు మరెవరితోనయినా సిరీస్ ఆడుతున్నా ఆ జట్టుని వదిలేసి వచ్చి ఆడిపోరూ?
 
ఇలాంటి నిబంధనలు అంగీకరించం అని ICC మొండికేస్తే మేం ICC నుంచి తప్పుకుంటాం అని బెదిరిస్తే వాళ్ళు చచ్చినట్లు దిగి వస్తారు. మన BCCI తడాఖా అలాంటిది. 


ఈ కోతి చాలా చిలిపి!!!


ఎవరయినా తిక్క పని చేస్తే కోతి బుద్ధి అని తిడతాం. కానీ కోతులే ఆ పనులు చేస్తే ఏమనాలి? నైజీరియాలోని పాన్‌డ్రిల్లస్ సాంక్చువరీలోని ఒక చింపాంజీ జూ కీపర్‌గా ఉన్న అందమైన అమ్మాయిని అందాలను చూడడానికి ఏం చేసిందో ఈ ఫోటోలో చూడండి. కాబట్టి ఇలాంటి చిలిపి పనులు చేసే బుద్ధి మన ముత్తాత్తాత్తాతల జీన్స్ నుండి వచ్చింది అనుకోవాలేమో?
Cheeky: Two-year-old chimp couldn't resist taking a quick peek down his keeper's top

 
ఉపకరణాలు (tools) తయారు చేసుకోవడం మానవులకి మాత్రమే తెలిసిన విద్య కాదని, చింపాంజీలకు కూడా ఈ సామర్ధ్యం ఉందని జేన్ గూడాల్ అనే పరిశోధకురాలు నిరూపించింది. ఆడవారి అందాలను తొంగి చూడడం కూడా చింపాజీలకు కూడా ఉందని అనుకోవాలేమో!

Friday, January 13, 2012

ఈ కారణాలు చాలవా సూర్యుడు దేవుడు అని దండాలు పెట్టడానికి.


ఊహించినట్లే స్కూలు పిల్లల చేత సూర్య నమస్కారం చేయించాలన్న మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదన వివాదాస్పదమయింది. పిల్లలతో మాస్ బెల్లీ డాన్స్ (mass belly dance) చేయించాలని ప్లాన్ చేస్తే ఏమాత్రం ఎవరు కూడా అడ్డు చెప్పి ఉండే వారు కాదేమో. అది విగ్రహారాదన కాదని ముస్లిం మత పెద్దలు వదిలేసి ఉండే వాళ్ళు. ఇక దేవుని బిడ్డలకి కూడా దానిలో ఏమీ అభ్యంతరకరమయిన విషయం ఉండేది కాదు.

ముస్లిం మత పెద్దలు సహజంగానే మూర్ఖులు కాబట్టి( అరటి పండ్లు తాకితే ఆడవారికి శృంగార పరమయిన ఆలోచనలు వస్తాయి కాబట్టి అరటి దోస లాంటి  పండ్లు కూరగాయలు ఆడ వారు తాక కూడదు అని ఫత్వా జారీ చేసిన చరిత్ర వీరిది.మూర్ఖులు అన్న పదం ముస్లిం మత పెద్దలకే, ముస్లింలు అందరినీ ఉద్దేశించి అన్నది కాదు ) వాళ్ళు అభ్యంతరం చెప్పడంలో వింత ఏమీ అనిపించలేదు. కానీ సూర్యుడు దేవుడా అని క్రిస్టియన్స్ అభ్యంతరం చెప్పడమే వింత అనిపించింది.
 


 మిగిలిన దేవుళ్ళ విషయంలో అభ్యంతరం చెబితే ఏమో అనుకోవచ్చు.  దాని కోసం రూపం మార్చుకొని వెళ్ళిన నువ్వూ ఒక దేవుడివా? నువ్వొక లోఫర్‌వి, డాఫర్‌వి అని సాక్షాత్తూ దేవుళ్ళకి అధిపతి అయిన ఇంద్రుడిని యమగోల సినిమాలో ఎన్టీఆర్ నిలదీసాడు కదా? కానీ సూర్యుడు దేవుడా అని అడగడమే వింతగా ఉంది. ఏ మతస్థులయినా, చివరికి దేవుడి మీద నమ్మకం లేని నాలాంటి నాస్తికులయినా సరే దేవుడు అని నమ్మాల్సిన వాడు సూర్యుడు.
 
ఏ స్కూలు పిల్ల వాడి నడిగినా సూర్య రశ్మిలో విటమిన్ D ఉంటుంది అది ఎముకల పటుత్వానికి అవసరం అని చెబుతారు. అంతే కాకుండా విటమిన్ D కణ విభజనలో కూడా తోడ్పడుతోంది. దీన వలన గాయాలు మానడమే కాకుండా కాన్సర్ రాకుండా కూడా ఉపయోగం ఉంటుంది. సూర కాంతికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయిన వారిలో చాలా రకాల కాన్సర్ తక్కువగా వస్తుంది అని డాక్టర్స్ చెబుతారు. ముఖ్యంగా పెద్ద పేగు, మల ద్వారానికి సంబంధించిన కాన్సర్ మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
   
 ఇక Multiple Sclerosis అన్న ఒక వ్యాధి ఉంది. ఇది మెల్ల మెల్లగా శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థని దెబ్బ తీసి ఆ రోగి నడవ లేని స్థితికి తీసుకెళ్తుంది. ఇప్పటికింకా ఈ వ్యాధికి మందు లేదు. యుక్త వయస్సులో వచ్చే ఈ వ్యాధి ఉష్ణ మండలాల్లో తక్కువగా, శీతల దేశాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇందుక కారణం సూర్య రశ్మి అని శాస్త్రవేత్తల అభిప్రాయం. 


ఈ కారణాలు చాలవా సూర్యుడు దేవుడు అని దండాలు పెట్టడానికి.

Sunday, January 8, 2012

ఈ సెలబ్రిటీలకు మానర్స్ పట్టవా ?


మొన్న టీవీలో అలా చానల్స్ తిప్పుతూ ఉండగా ఒక చోట శ్రీ రామ రాజ్యం అర్ధ శత దినోత్సవ వేడుకలు కనిపించింది. ఒక మంచి సినిమా కష్ట పడి, బాగా ధైర్యం చేసి తీశారు అన్న అభిప్రాయం నాకు ఉండడంతో కాస్సేపు చానల్ మార్చకుండా చూశాను. ఇలాంటి వేడుకలలో హీరోని ఆకాశానికి ఎత్తేయడం మామూలు. కానీ ఇక్కడ బాలకృష్ణని పొగడ్డం సమంజసం అనిపించింది. ఈ సినిమాలో వయసు స్పష్టంగా కనిపించినా, తొడగొట్తడాలు, సుమోలు గాలిలోకి ఎగరడాలు లేకపోయినా, తన restrained performance తో బాగా చేశాడు బాల కృష్ణ.
  
అయితే మధ్యలో ఒకాయన మాట్లాడుతూ హీరోని ఆకాశానికి ఎత్తేస్తూ ఉండగా బాల కృష్ణ మరొక వైపు తన సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ బిజీగా ఉండిపోయాడు. అంతే కాకుండా పక్కన కూర్చున్న కృష్ణం రాజుకి ఆ ఫోన్ అందించి ఆయనతో ముచ్చట్లాడుతూ కనిపించాడు. పాపం ఆ వక్త తన మాటల మధ్యలో తల తిప్పి బాల కృష్ణ వైపు చూసినప్పుడు హీరో గారు తన సంభాషణలో బిజీగా ఉన్నారు.


కనీసం ఇలాంటి సమావేశాలలో అయినా కొంచెం మానర్స్‌తో మెలగాలని ఈ సెలబ్రిటీలకి అనిపించదేమో పాపం.