నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, August 31, 2010

zugzwang లో y.s.జగన్

చదరంగంలో zugzwang అని ఒక పదం ఉంది. ఎత్తు వేయాల్సిన ఆటగాడికి ఎక్కువ ఆప్షన్స్ ఉండని స్థితి ఇది. ఉన్న కొన్ని ఎత్తులు కూడా అతని ఆటని మరింత దిగజార్చేవిగా ఉంటాయి.
ఇప్పుడు అధిష్టానం వేసిన AICC ద్వారా ఓదార్పు అన్న ఎత్తుతో జగన్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారయ్యింది. వై ఎస్ మరణం తరువాత ఆ షాక్ తో చనిపోయిన వాళ్ళను పార్టీ ఎందుకు ఆదుకోలేదు అని జగన్ తనే స్వయంగా పావురాలగుట్టలో ఒక మీటింగ్ లో అడిగాడు. ఇప్పుడు పార్టీ తనంత తానుగా ఆ చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్ధిక సాయం ప్రకటించినప్పుడు ఆ డబ్బు అందించడానికి వెళ్ళే వారితో పాటు జగన్ కూడా వెళ్తాడా లేదా అన్నది ప్రశ్న ఇప్పుడు. అలా వెళ్ళకపోతే నువ్వు అడిగింది అధిష్టానం ఇస్స్తున్నప్పుడు ఇంకా అభ్యంతరం ఎందుకు అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఒకవేళ అలా వెళ్తే మడమ తిప్పినట్లవుతుంది. జగన్ ఓదార్పు ఆగే ప్రశ్నే లేదు అని ఇప్పటికే కొండా సురేఖ లాంటి వాళ్ళు జగన్ కాళ్ళకి ముందర బంధం వేసి బిగించేశారు.
ఇప్పుడు ఈ పరిస్థితిలో జగ ఏ ఎత్తు వేస్తాడు, అధిష్టానం పన్నిన ఈ చకరబంధం నుండి ఎలా బయట పడతాడు అన్నది ఆసక్తికరమైన విషయం.
ఇప్పటికే జగన్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు ఐటీ శాఖ నోటీసులు పంపింది కాబట్టి తెగేదాకా లాగడం ఎందుకని అధిష్టానికి దాసోహం అంటాడా లేక "నాదారి రహదారి.better not come in my way" అని నరసింహలో రజనీ కాంత్ లాగా దూసుకుపోతాడా అన్నది వేచి చూస్తే కానీ తెలీదు.

ఎత్తి పోతల దిశగా కొమరం పులి: నా ప్రెడిక్షన్

సెప్టెంబరు నెలలో తెలుగు సినిమా ప్రేక్షకులకి పండగే పండగ(theoritically,at least). రజనీ కాంత్, శంకర్ ల అతి పెద్ద బడ్జెట్ సినిమా రోబో, మూడు సంవత్సరాలుగాషూటింగ్ జరుపుకొంటూ ఉన్న మహేష్ సినిమా ఖలేజా, ఇదుగో వస్తుంది, అదుగో వస్తుంది అంటూ ఎప్పటికప్పుడు వుడుదల వాయిదా పడుతూ వస్తున్న పవణ్ కల్యాణ్ కొమరం పులి ఈ నెలలో రాబోతున్న మూడు ముఖ్యమైన సినిమాలు.
మొదటి రెండు సినిమాల మాటేమో కానీ కొమరం పులి మాత్రం ఎత్తి పోనున్నదని నా అంచనా. ముఖ్యంగా మొదట్లో రిలీజ్ డేట్ ప్రకటించి రవి తేజ డాన్ శీను తో పోటీ పడలేక వాయిదా వేసుకోవడం ఆ సినిమాపైన వాళ్ళకి నమ్మకం లేకపోవడం వల్లనే అని నా అంచనా. తరువాత ఈ సినిమా పంపిణీ హక్కులు తీసుకున్న అల్లు అరవింద్ మొదటి వారం టికెట్ ఖరీదు 75 రూపాయలు చేయించుకోవడానికి ప్రభుత్వం నుండి ఆర్డర్ పాస్ చేయించడానికి ప్రయత్నిస్తుండడం కూడా సినిమా ఎక్కువ రోజులు ఆడే అవకాశం లేకపోవడం చేతనే అని నా అభిప్రాయం. సినిమా చెత్త అని పది మందికీ తెలిసే లోపలే వీలయినంత దోచేసుకుందాం అన్న ఆలోచన అరవింద్ ది.చిరంజీవి క్యాంప్ అడిగితే పెద్దాయన రోశయ్య కాదనగలడా?

అన్నిటికన్నా ఎక్కువగా ఈ సినిమా లేచిపోతుంది అన్న అభిప్రాయం నాకు కలిగించింది సినిమా ట్రైలర్. All style, no substance అన్నట్లు ఉంది ఆ ట్రయిలర్. పవన్ కల్యాణ్ హెలికాప్టర్లనుండి ఊగులాడుతూ తుపాకితో కాలుస్తూ ఉంటాడు, రెండు చేతుల్తో రెండు తుపాకులు పట్టుకొని పేలుస్తూ ఉంటాడు. ఇలా ట్రయిలర్ ఆద్యంతం స్టయిలిష్ గా ఉంది. సినిమా అంతా స్టయిలే ఉంటుంది, విషయం ఉండదు అని నా అంచనా.
బ్లాగు మిత్రులు ఈ పోస్టు చదివి మనసులో ఉంచుకోండి. కొమరం పులి విడుదల తరువాత మళ్ళీ ఈ పోస్టు పెడతాను. అప్పుడు చూద్దాం. నా ప్రెడిక్షన్ నిజమో కాదో.

Monday, August 30, 2010

రాక్షసుడు ఓబుల రెడ్డి చరిత్ర ఇంతకన్నా అందంగా చూపడం ఎలా సాధ్యం?

రామ్ గోపాల్ వర్మ తీస్తున్న రక్త చరిత్ర సినిమా మొదటినుండీ వివాదాస్పదమే. ఆయనకి కావలసింది కూడా ఇదే. ఆయన స్వయంగా వెళ్ళి పరిటాల, సూరి వర్గీయులని,కుటుంబీకులని కలవడం మొదలుకొని ఈ సినిమా వార్తల్లో నిలిస్తూంది. ఇందులో ఎవరిని హీరోగా ఎవరిని విలన్ గా చూపిస్తారో అని అందరూ ఆసక్తితో చూస్తుంటే, నా సినిమాలో హీరోలు,విలన్లూ లేరు. పరిస్థితుల చేతిలో బందీలైన వాళ్ళ గాధ ఈ సినిమా అని వర్మ చెప్పుకొచ్చాడు.
సినిమా తాలూకూ స్టిల్స్ బయటకు రాగానే ఒక గుండు సీన్ మొదట సంచలనం రేపింది. అందులో పరిటాల పాత్రధారి ఒక వ్యక్తికి గుండు గీస్తుంటే చూస్తూ నించును ఉంటాడు. ఒక స్టల వివాదంలో పరిటాల వర్గీయులు చిరంజీవి తమ్ముడు, హీరో పవన్ కల్యాణ్ కి గుండు కొట్టించిన ఎపిసోడ్ అది అని చిరంజీవి అభిమానులు గోల చేశారు. సినిమా రిలీజయ్యేదాకా అగండి అని వర్మ చెప్పడంతొ అది సద్దు మణిగింది.

ఇప్పుడు ఒబుల్ రెడ్డి సోదరి, అతడి అనుచరులమని చెప్పుకొంటూ కొందరు సినిమాలో ఓబుల రెడ్డి పాత్రని చెడుగా చూపించారంటూ వర్మపైన కేసు పెడతామని, వర్మని చంపుతామని బెదిరించడంతో మరొక వివాదం మొదలయ్యింది.
రమణా రెడ్డి, ఓబుల్ రెడ్డి కుటుంబం, పరిటాల కుటుంబం మధ్య నెలకొన్న శత్రుత్వం ఈ సినిమా ప్రధానాంశం. రెండు కుటుంబాల మధ్య ఉన్న పగ, ప్రతీకారం హత్యలు, ప్రతి హత్యలు వెరసి అనంతపురం జిల్లా ఫాక్షన్ మొత్తం సినిమాలో ఉంటుంది.

అయితే ఓబుల్ రెడ్డి ఒక సగటు రాయల సీమ ఫాక్షనిస్టు కాదు. ఫాక్షనిస్టులు సాధారణంగా తమకి అడ్డు నిలిచిన వాళ్ళని, ప్రత్యర్ధులనీ చంపడం, కాంట్రాక్టులు చేసే వాళ్ళ దగ్గర డబ్బు వసూలు చేయడం, తరతరాలుగా వస్తున్నా హత్యలు, ప్రతిహత్యల అకౌంట్లు ఏవైనా బaలన్సు ఉంటే వాటిని పూర్తి చేయడం ఇలా ఉంటారు. అందుకే తెలుగు సినిమాలలో ఫాక్షనిస్టులు సూపర్ హిట్ హీరోలయ్యారు.

ఈ ఓబుల్ రెడ్డిది ఒక నీచ, నికృష్ట, హేయమైన చరిత్ర. ఇది రక్త చరిత్ర కాదు. కన్నూ మిన్నూ గానని కామ పిశాచ చరిత్ర. అందంగా, కంటికి నదురుగా ఏ ఆడది కనిపించినా ఎత్తుకు పోవడం, మాన భంగం చేయడం, కిరాతకంగా హింసించడం వీడి ప్రవృత్తి. వీళ్ళ ఇంటికి దగ్గరలో ఒక మహిళ కళాశాల ఉండేది. ఓబుల్ రెడ్డి కుటూంబంలో పెత్తనం మొదలు పెట్టాక ఆ కాలేజీలో విద్యార్ధుల సంఖ్య దారుణంగా పడిపోయి ఒకానొక దశలో కాలేజీ మూసివేసే దశకి చేరుకొంది. ఓబుల్ రెడ్డి ఇంటి ముందు నుంచి అమ్మాయిలను పంపడానికి వాళ్ళ తల్లి తండ్రులు ఎవరూ సాహసించలేదు.
ఒక ఇంజనీరు భార్యని వీడూ, వీడి మనుషులూ ఎత్తుకెళ్ళి అతి కిరాతకంగా సమూహిక మానభంగం చేసిన కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. వీడు కేవలం కామ పిశాచి మాత్రమే కాదు. అతి కిరాతకమయిన శాడిస్టు కూడా. తన్ శత్రువర్గానికి చెందిన ఒక మనిషిని పొట్టలో రిగ్గుతో రంధ్రం వేసి చంపాడు. ఇలా అనంతపురంలో ఎవరిని కదిలించినా ఓబుల్ రెడ్డి రాక్షస కృత్యాలు కథలు కథలుగా బయటకొస్తాయి.

అయితే ఈ మహానుభావుడి చావు కూడా ఇతడి స్టాండర్డుకి ఏ మాత్రం తగ్గ లేదు. పరిటాలకి అనుకూలంగా పని చేసే ఒక నక్సల్ విభాగం సభ్యులు ఇతడిని హైదరాబాద్ లో ఒక హోటల్ లో చంపారు. ఓబుల్ రెడ్డి ముగ్గురు అనుచరులతో కలిసి ఒక వేశ్యతో రాస క్రీడలు సాగిస్తుండగా హంతకులు లోపలికి ప్రవేశించారు. ఓబుల్ రెడ్డి భయంతొ బాత్ రూమ్ లో దాక్కున్నాడు. ఏం జరుగుతుందో తెలిసే లోగా ముగ్గురు అనుచరులనీ, ఆ వేశ్యనీ నరికి చంపారు. అటు పిమ్మట బాత్ రూం లోంచి ఓబుల్ రెడ్డిని బయటకు లాగి అతడి పురుషాంగాన్నీ, వృషణాలనీ కోసి, అటుపిమ్మట తాపీగా గొంతు కోసి చడీ చప్పుడు లేకుండా పరారయ్యారు.
ఓబుల్ రెడ్డి హీన చరిత్రకు నిదర్శనమేమిటంటే అతడి మరణం అతడి వర్గీయులని కూడా ఆనందింప చేయడం.

ఇలాంటి ఒక నీచ, నికృష్ట, అదమాధమ, రాక్షసుడికి సోదరిగా, వర్గీయులుగా తమని తాము ఎవరైనా చెప్పుకొంటే అది వాళ్ళు సిగ్గు పడాల్సిన విషయం. కాబట్టి అతడి సోదరినని చెప్పుకొంటున్న ఉషా రాణి గానీ ఇతర వర్గీయులు గానీ దయచేసి తెలుసు కోవలసిన విషయం ఏమిటంటే ఎవరైనా ఓబుల్ రెడ్డి గురించి ఎంత తక్కువగా చూపించినా కూడా అది సభ్య సమాజం ఖాండ్రించి ఉమ్మేసే విషయమే అవుతుంది.

Sunday, August 29, 2010

రాష్ట్రంలో ఇన్నాళ్ళకి ఒక పద్ధతికి వచ్చిన రాజకీయ వ్యవస్థ

ఒక సంవత్సర కాలం ముందు వరకూ ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయం చాలా అస్తవ్యస్తంగా అన్యాయంగా అవతతవకలుగా నానా కంగాళీగా ఉండేది. ప్రధాన ప్రతిపక్షం అదికార పక్షం మీద పోరాటం చేయడం మాట అటుంచి తనకున్న ఎమ్మెల్యేలే అటువైపు పోకుండా వాళ్ళని కాపలా కాసుకోవడానికే పూర్తి సమయం కేటాయించాల్సివచ్చింది. మరో ప్రతి పక్షం అయిన ప్రజా రాజ్యం తమ పోరాటం ఎవరితో చేయాలో తెలియక, ఏదో క్షణంలో అధికార పార్టీ నుండి ఆహ్వానం అందక పోతుందా అందిన మరు క్షణం అందులో విలీనం కాక పోతామా అని వేచి చూస్తూ అప్పుడప్పుడూ రాజకీయాల్లో ఉన్నాం అందులోనూ ఆపోజిషన్లో ఉన్నాం కాబట్టి ఎవరో ఒకర్ని విమర్శించాలి కాబట్టి తెలుదేశమోళ్ళని తిట్టి పోస్తూ ఉండేవాళ్ళు. ఇక కమ్యూనిస్టుల గురించి పురావస్తు శాఖ వాళ్ళు అప్పుడప్పుడూ శిధిలాల కింద చూడ్డం తప్పించి వాళ్ళని మిగతా వాళ్ళందరూ మర్చి పోయారు. తెలంగాణా కేసీఆర్ తన కారుని ప్రీ ఓన్డ్ కారులు అమ్మే వాళ్ళకి అమ్మకానికి పెట్టి ఇంట్లో కూర్చుని తలుపులు బిడాయించుకొని ప్రజల దృష్టి లోంచి పూర్తిగా చెరిగి పోయాడు.
అన్నింటి కన్నా అన్యాయం కాంగ్రెస్ లో ఉండే ఆపోజిషన్ ది. కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి వాదులకు స్వంత పార్టినీ దాన్ని నడిపే నయకులనీ దుమ్మెత్తి పోయడం అన్నది జన్మ హక్కు. అది కూడా లేకుండా పోయింది. గత ప్రభుత్వంలో కొమ్ములు మొలిచి, తోకలు పొడవైన జానా రెడ్డీ, దివాకర్ రెడ్డిలకు ఈసారి మంత్రి పదవి దక్కక పోయినా ఒక్క మాట అనేదానికీ లేకుండా పోయిందంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు.
రాజశేఖర్ రెడ్డి మరణంతో ఒక్కసారిగా అంతా మారి పోయింది. పార్టీ సుప్రీమ్ సోనియా గాంధీ ఈ మార్పుకి శ్రీకారం చుట్టింది. రోశయ్యని ముఖ్యమంత్రి చేయడంతో ఈ మార్పు మొదలయ్యింది. రోశయ్య 100 మీటర్ల స్ప్రింట్ లో పరుగెత్తే వాడిలాగా ఒక కాలు కుర్చీలో ఇంకో కాలు కిందా పెట్టి ఎప్పుడు దిగమంటే అప్పుడు దిగేస్తాను అని కూర్చోవడం, ఇంకో పక్క జగన్ నేను జనాన్ని ఓదార్చాల్సిందే అని రాష్ట్రమంతా తిరిగేయడం, కాంగ్రెస్ లోని ముసలీ ముతకా లీడర్లు బయటకి వచ్చి మేమింకా బతికే ఉన్నమంటూ టీవీ కెమెరాల ముందుకి రావడంతో అలికిడి మొదలైంది.

చంద్ర బాబు ఒక్కసారిగా ఊపు తెచ్చుకొన్నాడు. కేసీఆర్ ఒక దీక్షతో చచ్చిన వాడికి అమృతం పోసినట్టు లేచికూర్చున్నాడు. దానికి తోడు కేంద్రం శ్రీకృష్ణ కమిటీ ఒకటి వేయడంతో ఈ ప్రక్రియ వేగవంతమయ్యింది. చివరికి చిరంజీవి కూడా నాకేం తక్కువ అని హుంకరించడం, ప్లీనరీలు పెట్టడం చేయసాగాడు. ఇప్పుడు మజా వచ్చింది AP రాజకీయాల్లో.

కాంగ్రెసోళ్ళు కాంగ్రెసోళ్ళని తిడుతూ ఉన్నారు. కేసీఆర్ పులయి పోయాడు. వచ్చే ఎన్నికలు తరువాత అధికారం తనదే అని చంద్రబాబు ధీమాగా ఉన్నాడు. చిరంజీవి ఉప ముఖ్యమంత్రి అయిపోదామని కలలు కంటున్నాడు.

రాజాశేఖరా చచ్చి ఎంతపని చేశావు స్వామీ!