రోశయ్య గారూ, మీరు ముఖ్యమంత్రి పదవి అధిరోహించింది మొదలు మీ స్వంత పార్టీ వారు, మీతో కలిసి జూనియర్లుగా పని చేసిన వాళ్ళు మిమ్మల్ని ఎన్ని మాటలన్నారో తలుచుకొంటే నాకు బాధేసింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అని ఒకడంటే, జనాన్ని ఆకర్షించలేడని ఇంకొకడంటే, వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించలేడని ఒకడు ఇలా ఎవరికి తోచైన్నట్టు వాళ్ళు మిమ్మల్ని నానా మాటలంటుంటే నాకు కాలింది.
బలహీన ప్రధాని అని మొదలుపెట్టి ఆ పదవికే వన్నె తెచ్చిన మన తెలుగువాడు నరసింహా రావుని, రిమోట్ కంట్రొల్ పి ఎం అని ఎందరు దెప్పినా బెస్ట్ పి ఎం అనిపించుకున్న మన్ మోహన్ సింగ్ నీ స్ఫూర్తిగా తీసుకొని మీరు మహా నాయకుడిగా ఎదగండి.
రోశయ్య గారూ ఇప్పుడు అధిష్టానం మీమీద పూర్తి కాలం బాధ్యత పెట్టి ఆపద్ధర్మ ముఖ్య మంత్రి అన్న టాగ్ మీ పైన తొలిగించింది కాబట్టి ఇక మీరు కూడా బలహీనమైన నాయకుడు అన్న ముద్ర చెరిపేసి మహా నాయకుడిగా ఎదగడానికి ప్రయత్నించండి. ఆ దిశగా ఏం చేయాలో మీకు తెలియదని కాదు గానీ అనుక్షణం బధ్యతలతో మీరు సతమతమౌతుంటారు, పైపెచ్చు ఆరోగ్యం కూడాఇంతకు ముందులా ఉన్నట్లు లేదు. కాబట్టి ఇలాంటి విషయాల గురించి మీరు ఎక్కువగా ఆలోచించకుండా ఆ దిశగా మీకొక రూట్ మ్యాప్ నేను అందిస్తున్నాను. చిత్తగించండి.ఇవన్నీ మీకు తెలియవని కాదు, అయినా వినదగునెవ్వరు చెప్పినా అన్నరు కదా.
1. మొదటిది డబ్బు: మనవాళ్ళు అనుకొన్న కొందరికి దండిగా డబ్బు అందేలా ఎర్పాటు చేయండి. అవసరమైనప్పుడు వాళ్ళు ఆ డబ్బు మనకోసం బయటకు తీసేలా ఉండాలి. అంతే కానీ డబ్బు పెట్టెలు లోపల దాచి ఖాళీ చేతులు చూపే వాళ్ళని చేరతీయవద్దు. వాళ్ళకి ఆ డబ్బు ఎలా అందించాలో మీకు తెలియంది కాదు. ఇన్ని సంవత్సరాలు ఆర్ధిక మంత్రిగా చేశారు కదా మరి.
ముఖ్యంగా గనులు మీద కేంద్రీకరించండి. బయ్యరం, ఓబుళాపురం గనులని ఇప్పుడున్న వారి దగ్గర నుండి లాక్కోండి. అమ్మ గారినడిగితే ఈ దిశగా పార్లమెంటులో ఒక చట్టం వచ్చేలా చేస్తుంది. ఆ గనులని మన వారికి అప్పగించండి. మనకి కావలసినప్పుడు వాళ్ళు మనకి డబ్బు నిండిన సూట్ కేసులు అందించేలా ఉండాలి.
2. ప్రభుత్వ ఉద్యోగులు: వీళ్ళని గుప్పిట్లో ఉంచుకోవడం మనకి ఎంతైనా అవసరం. మన దివంగత నేత చేసిన పనే కదా. అందరు ఉద్యోగస్తులనీ అవినీతి నిరోధక చట్టం పరిధిలో నుండి మినహాయించండి. ఇక వాళ్ళు మనం అధికారంలో ఉండడానికి వాళ్ళ శాయశక్తులా కష్టపడతారు. ఏదైనా పోస్టు వచ్చే పదేళ్ళలో ఖాళీ అవుతుంది అంటే దానికి ఇప్పుడే ఇంకొకడిని నియమించే ఏర్పాటు చేయండి. ఈ రెండో వాడు ఆ పోస్టు ఖాళీ అయినంతవరకూ పనేమీ లేకుండా జీతం తీసుకొంటూ ఉంటాడు. పదేళ్ళలో ఆ ఉద్యోగం తలూకూ లోటుపాట్లు తెలుసుకొని అహికారం తన చేతికి వచ్చీ రాగానే కలెక్షన్ మొదలు పెడతాడు. ఇంకొక అడ్వాంటేజి ఏమంటే దీనివలన నిరుద్యోగం కూడా తగ్గుతుంది.
3. అటూ ఇటూ ఊగిసలాడే వాళ్ళు: వీళ్ళని పిలిచి డబ్బు నింపిన సూట్ కేసులు చూపించి ఇవి నీకే అయితే అంతా ఒకేసారి కాదు, సంవత్సరానికింత అని అందిస్తాను అని చెప్పండి. కుక్కల్లా మీవెంట పడి తిరుగుతూ ఉంటారు.
4. వ్యతిరేకులు: ఇంటెలిజెన్సు వగైరా వాళ్ళని ఉసిగొలిపి వాళ్ళ చిట్టా మీదగ్గర ఉంచుకొని తోక జాడించినప్పుడల్లా దాన్ని విప్పండి. తోక ముడుచుకొని ఉంటారు.
5. వెర్రి జనం: అదీ ఇదీ అని ప్రతి వాడికి నెలకింతని ముట్టేలా ఏదో ఒక పధకం ప్రవేశ పెట్టండి. నేను లోగడ రాసిన ఒక పోస్టు చూడండి. మీ ఫోటొ ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తారు. మహా నాయకుడు అని కీర్తిస్తారు.
6. మీడియా: మనకంటూ ఒక చానల్, ఒక వార్తా పత్రిక ఉండాలి. డబ్బు పొయ్యాలే గానీ ఇది ఎంత సేపు. మన పత్రికకీ చానల్ కీ ప్రభుత్వ ప్రకటనలు గుప్పించితే వాటి ఖర్చు ప్రభుత్వ ఖజానా నుండే పెట్టుకోవచ్చు.
మీరు కొంచెం సీరియస్ గా తీసుకొని ఇవన్నీ ఆచరించండి. రెండు మూడేళ్ళలో మీరు తిరుగు లేని నాయకుడై పోతారు. రేపెప్పుడైనా ఆయువు తీరి మీరు పోతే కనీసం వెయ్యి మందికి పైగా గుండెలు ఆగో, ఆత్మహత్యలు చేసుకొనే చావక పోతే నన్నడగమని మీ ఆత్మకి చెప్పండి.
ఇవన్నీ చెసుకొంటూ పొతే బొక్కసానికి బొక్క పడి పోదా అన్న అనుమానం వద్దు. ముందు మన పదవి సంగతి, మన వాళ్ళ సంగతీ, వచ్చే ఎన్నికల్లో గెలుపు సంగతీ చూసుకొందాం. ఆ తరువాతే మిగతావన్నీ.
2 comments:
eppudu rajasekarudu mana telugu wadikichina appurva charitra la undi. beutiful aalochana.
sari kotta "rajasekhara" charithram. maha naayakudu kaavali anukune vaariki syllabus.
Post a Comment