నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, November 15, 2013

ఆనంద్ లాగా చెస్ ఆడాలని ఆనంద్ కి సలహా ఇచ్చిన పెద్ద మనిషి

విశ్వనాధన్ ఆనంద్ ప్రపంచ జూనియర్ చాంపియన్ షిప్ గెలిచి భారత దేశపు మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ అయ్యాక సీనియర్ స్థాయిలో చదరంగపు ప్రపంచంలో తన ముద్ర వేస్తున్న రోజులలో విమానంలో ఆయనకి ఒక సహ ప్రయాణీకుడు తారస పడ్డాడు. ఇప్పటిలాగా ఆప్పట్లో మీడియా లేదు, హిందూ లాంటి ఏవో కొన్ని వార్తా పత్రికలు మినహాయించే చదరంగాన్ని పెద్దగా కవరేజీ లెదు. అంచేత ఆనంద్ మొహం చాలా మందికి పరిచయం లేక పోవటాన అతనికి తాను మట్లాడుతున్నది ఎవరో తెలియకుండానే మాటలు కలిపాడు.

స్వతహాగా రిజర్వుడ్ అయిన అనంద్ అతనితో పెద్దగా కలివిడిగా మాట్లాడలేదు. ఒకటి రెండు మాటలయ్యాక "ఏం చేస్తుంటావ్ బాబూ?" అని ఆనంద్ ని అడిగాడు ఆ వ్యక్తి. "చెస్ ఆడుతాను" అని బదులిచ్చాడు ఆనంద్.

"చెస్ ఆడితే ఆనంద్ లాగా ఆడాలి. అప్పుడే ఉపయోగం ఉంటుంది. అలా ఆడలేకపోతే ఇంకేదైనా చూసుకో బాబూ" అని ఒక ఉచిత సలహా పడేశాడు ఆ పెద్ద మనిషి. 

"అలాగే. థాంక్స్" అని ఆనంద్ తన చేతిలొ ఉన్న పుస్తకంలొ తల దూర్చి తప్పించుకున్నాడు విషీ.

కొన్నాళ్ళ తరువాత ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనంద్ ఈ సంఘటనని వెల్లడించాడు.

Thursday, November 7, 2013

అటో చార్జీ కన్నా తక్కువ ఖర్చుతో అంగారక గ్రహ యాత్ర చేస్తున్న ISRO

మొత్తానికి మన వాళ్ళ అంగారక గ్రహ యాత్ర మంగళయాన్ రాకెట్ విజయవంతంగా దూసుకెళ్ళింది. అయితే ఇది అంగారక గ్రహాన్ని చేరాలంటే మరో పది నెలలు పడుతుంది. అప్పుడే ఈ ప్రయోగం విజయవంతం అని చెప్పగలం. అసలే పేదరికంలో కొట్టుమిట్టాడుతూ ప్రజలందరికీ సరిగా ఆహారం అందించలేని మనకు ఇవి అవసరమా అని కోంతమంది చేసే విమర్శల సంగతి అటుంచితే మనవాళ్ళు సాధించిన ఈ విజయాన్ని అభినందించకుండా ఉండలేం.
  
ఈ ప్రయోగానికి సంభందించిన ఖర్చునీ, ఈ రాకెట్ వెళ్ళే దూరాన్నీ చూస్తే మన శాస్త్రవేత్తలు చాలా తక్కువ ఖర్చుతో ఈ విజయాన్ని సాధించారని చెప్పెక తప్పదు. దాదాపుగా 80 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ రాకెట్ ప్రయోగానికి అయిన ఖర్చు 450 కోట్ల రూపాయలు. అంటే ఒక కిలోమీటర్ ప్రయాణానికి ఆరు రూపాయల కన్నా తక్కువ. ఇది ఆటో చార్జీ కన్నా తక్కువే!

Monday, September 2, 2013

అవినీతి మచ్చ కడిగిపారేయడానికి సీనియా గాంధీ గారికి పెద రాయుడు మార్గం

ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కకు మించిన అవినీతిలో కుంభకోణాలతో సతమతయి పోతూ ఉంది. మరొక వైపు బీజేపీ పార్టీ మోడీని తమ ప్రధాని అబ్యర్ధిగా దాదాపుగా ప్రకటించినట్లే. ఈ పరిస్థితిలో ప్రజల వద్దకు వెళ్ళి ఓట్లడగాలంటే మొహం చెల్లని స్థితిలో కాంగీయులు ఉన్నారు.
 
ఈ విషమ పరిస్థితి నుంచి తప్పించుకొని యువరాజు రాహుల్ గాంధీని గద్దె మీద కూర్చోబెట్టాలంటే రాజ మాత సోనియా గాంధీ గారికి ఒక చక్కని మార్గం పెదరాయుడు మార్గం ఉంది. పెదరాయుడు సినిమాలో గ్రామానికి పెద్దగా తీర్పులు చెప్పే వ్యక్తి స్వయానా తన తమ్ముడు పైన వచ్చిన అభియోగానికి శిక్షగా అతని కుటుంబాన్ని గ్రామం నుంచి వెలి వేస్తాడు. తమ్ముడు తన వాడయినా ధర్మం ధర్మమే అనేది ఆయన  సిద్ధాంతం. 
 
ఇలాంటిదే ఒక ఉదాహరణ మహా భారతంలో కూడా ఉంది. సంజయుడు ద్రుతరాష్ట్రుడికి  నీతి బోధిస్తూ ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తినీ, గ్రామం కోసం కుటుంబాన్ని, రాజ్యం కోసం గ్రామాన్ని వదిలి పెట్టాలని చెప్తాడు. ఇప్పుడు అదే సిద్ధాంతాన్ని అనుసరించి అవినీతిలో కూరుకుపోయిన అల్లుడు రాబర్ట్ వాద్రాకి కూతురు చేత విడాకులు ఇప్పించి అతనితొ బంధం తెంచి వేసుకుంటే రేపు ఎన్నికల వేళ నీతికీ, న్యాయానికీ కట్టుబడి స్వయానా అల్లుడినే కాదనుకున్న ఉన్నత, ఉత్తమ కుటుంబం మాది సోనియా రాహుల్ బాబు ధైర్యంగా ప్రజల లోకి వెళ్ళ వచ్చు. 
 
ఎవరయినా దీనిని చదివిన కాంగ్రెస్ వాళ్ళు ఈ విషయాన్ని అమ్మ గారితో విన్నవించి చూడండి.ఏమయినా ఫలితం ఉంటుందేమో చూద్దాం.

Sunday, July 28, 2013

సమయం చాలని బిజీరాయుళ్ళు ఈ ఒక్క యోగాసనం వేసినా చాలు

 యోగా వల్ల అనేక లాభాలు ఉన్నాయన్నది నేడు ప్రపంచం అంతా అంగీకరించిన విషయం. అందువల్లనే నేడు పాశ్చాత్య ప్రపంచంలో ఇబ్బడి ముబ్బడిగా యోగా శిక్షణ కేంద్రాలు వెలుస్తున్నాయి. అంతే కాక వెన్నునొప్పిని తగ్గించడానికి యోగా ఉపయోగపడుతుంది అని అమెరికన్ స్పైన్ అసోసియేషన్ శాస్త్రీయంగా కూడా ధృవీకరించింది.
 
అయితే ఇన్ని ఉపయోగాలు అందించే యోగాని సాధన చేయడాన్ని తప్పించుకోవడానికి చాలా మంది చెప్పే సాకు సమయం లేదు అని. రోజుకి కేవలం అర గంట వెచ్చిస్తే సరిపోయేదానికి కూడా సమయం చాలని బిజీ రాయుళ్ళు కేవలం ఓ అయిదు నిముషాలు వెచ్చించి సర్వాంగ ఆసనం ఒక్కటి వేస్తే చాలు. శరీరంలోని దాదాపు అన్ని భాగాలనీ ప్రభావితం చేస్తుంది ఈ ఆసనం.

వెల్లకిలా పడుకొని  నిముషం పాటు కాళ్ళూ, చేతులూ ఆడించి వార్మ్ అప్ చేసి ఈ ఆసనం చేయవచ్చు. ఇందులో కాళ్ళు రెండు పైకెత్తి, నడుము భాగాన్ని రెండు చేతులతో సపోర్ట్ చేస్తూ కాళ్ళని వీలయినంత వరకూ లంబ కోణంలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేయాలి.
 
 అలా చేశాక చేతులు క్రమేపీ కిందికి జరుపుతూ శరీరాన్ని పైకి ఎత్తే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు దృష్టి కాలి బొటన వేళ్ళ మీద నిలిపి వీలయినంత సేపు ఆసన స్థితిలో ఉండి ఆ పిమ్మట మెల్లిగా పూర్వ స్థితిలోకి రావాలి. 

ఈ ఆసనం వెన్నెముకని ఫ్లెక్సిబుల్‌గా ఉంచుతుంది. తలకి, మెదడుకీ రక్త ప్రసరణ పెంచుతుంది, థైరాయిడ్ సమస్యలని తగ్గిస్తుంది, కాళ్ళ వాపులనీ, వేరికోస్ వెయిన్స్‌నీ తగ్గిస్తుంది. అంతే కాకుండా శరీరాన్ని యవ్వనంగా ఉంచుతుంది.

ప్రతి రోజూ కనీసం అయిదు సార్లు ఈ ఆసనం వేసినా సరిపోతుంది.
దీని వల్ల యోగా మీద ఆసక్తి పెరిగి ఆసనాల సంఖ్యని, సమయాన్ని క్రమేపీ పెంచుకుంటూ పోతే మరీ మంచిది.

Wednesday, May 29, 2013

టెస్ట్ మ్యాచ్‌లో ఒక్క రోజులో రెండు హ్యాట్రిక్స్ నమోదు చేసిన బౌలర్


మూడు బంతుల్లో ముగ్గురు బ్యాట్స్ మెన్‌ని వరుసగా అవుట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేసుకోవడమనేది ప్రతి బౌలర్‌కీ కలగా ఉంటుంది. అయితే ఇది ఎప్పుడో కానీ సాధ్యం కాదు. అందునా అత్యుత్తమ శ్రేణి క్రీడాకారులు అడే టెస్ట్ మ్యాచ్ స్థాయిలో మరీ కష్టం. ఇద్దరు అవుటయ్యాక తరువత వచ్చే బ్యాట్స్ మన్ తన కున్న స్కిల్ అంతా ఉపయోగించి కనీసం ఆ ఒక్క బంతికీ అవుటవకుండా బయట పడాలని ప్రయత్నిస్తాడు. అలాగే ప్రత్యర్థి కెప్టెన్ కూడా తన జట్టులోని మెరికల్లాంటి ఫీల్డర్స్‌ని  బ్యాట్స్‌మన్ చుట్టూ మొహరింపజేసి ఆ మూడో బంతికి వికెట్ తీయాలని ప్రయత్నిస్తాడు. హ్యాట్రిక్ ఇంత కష్టమైన విషయం కాబట్టే దానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.
 
 అయితే ఒకే రోజు రెండు హ్యాట్రిక్స్ సాధిస్తే అది ఇంకెంత ప్రత్యేకమో చెప్పక్కర్లేదు కదా! క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకూ ఈ అరుదైన ఘనత సాధించిన బౌలర్ ఒక్కడే ఉన్నాడు. అతను జిమ్మీ మాథ్యూస్ అనే ఆస్ట్రేలియన్ ఆటగాడు. 1912 మే28 న సౌత్ ఆఫ్రికాతో  జరిగిన మ్యాచ్‌లో అతను ఈ అరుదైఅన్ ఘనత సాధించాడు. సౌత్ ఆఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో చివరి మూడు వికెట్లు తీసుకున్న ఈ బౌలర్, ఫాలో ఆన్ ఆడిన తరువాత రెండవ ఇన్నింగ్స్‌లో తన రెండవ హ్యాట్రిక్ కూడా అదే రోజు నమోదు చేశాడు.
 
ఇందులో మరొక చెప్పుకోదగ్గ ప్రత్యేకత ఏమంటే జిమ్మీ తీసుకున్న ఆరు వికెట్లలో మరొకరి పాత్ర లేదు. ఇద్దరిని క్లీన్ బౌల్డ్ చేసి, ఇద్దరిని ఎల్బీడబ్ల్యుగా, మరిద్దరిని కాట్ అండ్ బౌల్డ్ రూపంలో అవుట్ చేశాడు. 
అయితే ఇంత అరుదయిన ఫీట్ సాధించిన ఈ మ్యాచ్ తరువాత మ్యాథ్యూస్ మరొక టెస్ట్ మ్యాచ్ ఆడకుండనే అతని కెరీర్ ముగిసిపోవడం ఎవరికీ అర్ధం కాని విషయం.

Saturday, May 11, 2013

నా సెల్ ఫోన్ కెమెరాలో బందీలయిన హిమాలయాలు (Mighty Himalayas in my Mobile) Photos

గత వారం మనాలీ వెళ్ళినప్పుడు నేను నా Sony Xperia Z ఫోన్ కెమెరాతో తీసిన ఫోటొలు ఇవి. అన్నీ కూడా ఆటో మోడ్ వాడి తీసినవే. స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ టెక్నిక్స్ కానీ ఏమీ లేవు.



ఈ ఫోటో మేము దిగిన మౌంటెన్ టాప్ హోటల్ టెర్రాస్ నుంచి తీసింది. శీతాకాలంలో ఆ టెర్రాస్ పైన కూడా మంచు నిండి పోయి ఉంటుందని ఆ హోటల్ స్టాఫ్ చెప్పారు. మా రూము కిటికీలోంచి కూడ మంచుతో కప్పబడిన హిమాలయాలు దర్శనమిచ్చాయి. నిప్పుల కొలిమిలోనుండి వెళ్ళిన మాకు ఆ శీతల వాతావరణం బాగా నచ్చింది.


ఈ ఫోటొ కూడా పైన ఉన్న ఫోటో తీసిన చోట తీసిందే, కొంచెం జూమ్ చేశానంతే.





ఇది రోహ్‌తాంగ్ పాస్‌కి వెళ్ళే దారిలోని గులాబా అన్న చోట ఉన్న స్నో పాయింట్. రోహ్‌తాంగ్ పాస్‌కి వెళ్ళే దారిని మే రెండవ వారంలో తెరుస్తారట. అంచేత పర్యాటకులు ఈ స్నోపాయింట్‌లోనే మంచులో ఆడుకోవడం, సరదాగా స్కీయింగ్ చేయడం చెస్తారు.







స్నో పాయింట్‌లో కూర్చుని చూస్తే ఎదురుగా కనిపించే శిఖరం ఇది.




 మనాలీకి కొంచెం దూరంలో ఉన్న సోలాంగ్ వ్యాలీలో కేబుల్ కారు ఎక్కి ఈ శిఖరం మీదికి చేరుకోవచ్చు.



 

Thursday, February 7, 2013

కోట్ల ఆస్తితో పిల్లనిచ్చిన మామగారిమీద సుబ్రావ్ ఎందుకు అలిగాడంటే .........(ఒక జోకు)


అల్లుడు అలక పాన్పు ఎక్కాడని తెలియగానే పరంధామం ఆశ్చర్యపోయాడు. తన ఒక్కగానొక్క కూతురు, ఆస్తి పాస్తులు, లక్షల కట్నం అంతా ఇచ్చిన తరువాత అల్లుడికి ఏం తక్కువయ్యిందని అలక పూనాడో ఆయనకి అర్ధం కాలేదు. అస్సలు సుబ్రావ్ ఆయనకి అల్లుడు అయిన విధమే ఒక విచిత్రం. అదేమంటే......
 
ఇంజనీరింగ్ పూర్తి చేసి, బెంగుళూరులో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సుబ్రావ్ ఒకసారి పండగకని సెలవు పెట్టి తన ఊరొచ్చాడు. పిసినారిగా పేరున్న సుబ్రావ్ కూడా ఊరిలో పొద్దు పోక సినిమాకి వెళ్దామని బయలు దేరాడు. ఊరిలో ఉన్న ఒకే ఒక హాలు  బుకింగ్ కౌంటర్‌లో తల పెట్టి "టిక్కెట్ ఎంత?" అనడిగాడు. ఆ టాకీస్‌కి ఓనర్, టికెట్ అమ్మేవాడు ఒకడే. అతను పిసినారి పరంధామం. టిక్కెట్ కౌంటర్‌లో ఎవరినయినా పెడితే వాడు మోసం చేస్తాడేమోనన్న భయంతో, ఇంత పనికి మళ్ళీ ఇంకొకడు ఎందుకు అన్న భావంతో ఆ పని కూడా తనే చేసేవాడు. 
 
"కుర్చీ పది రూపాయలు, బెంచి అయిదు రూపాయలు, నేల మూడు రూపాయలు" అని చెప్పాడు పరంధామం. "సరే, బెంచి టికెట్ ఒకటి కావాలి. ఇచ్చే రేటు చెప్పు" అన్నాడు సుబ్రావ్. తన జీవితంలో సినిమా టికెట్‌ని బేరమాడేవాడిని తొలిసారిగా చూసిన ఆనందంలో అహ నా పెళ్లంట సినిమాలో ఎండు పుల్లలు ఏరుకుంటున్న రాజేంద్ర ప్రసాద్‌ని చూసినప్పుడు కోట శ్రీనివాస రావుకి కలిగిన అనుభూతి కలిగింది పరంధామానికి. సినిమా టికెట్ ఫిక్సెడ్ అని సుబ్రావ్‌కి నచ్చజెప్పి బెంచి టికెట్ ఇచ్చి పంపాడు.

లైట్లు ఆరిపోయి న్యూస్ రీల్ వస్తుండగా పైన ఎప్పుడో తిరగడం మానేసి అలంకార ప్రాయంగా ఉన్న ఒక సీలింగ్ ఫ్యాను జారి సరిగా సుబ్రావ్ నెత్తి మీద పడింది. కెవ్వుమని అతను అరిచిన అరుపుకి ఊరు ఊరంతా ఉలిక్కి పడింది. పరుగెత్తుకు వచ్చిన పరంధామం పక్క వీధిలో ఉన్న ఆరెమ్పీ డాక్టర్ దగ్గర సుబ్రావ్‌కి చికిత్స చేయించాడు. ఆ క్రమంలో సుబ్రావ్ తాలుకు పుట్టు పుర్వోత్తరాలు తెలుసుకొని అతను తమ కులం వాడేనని గ్రహించి అతనిలో తన ఒక్కగానొక్క కూతురుకి మొగుడ్ని చూశాడు. అంతేకాక సినిమా టికెట్ కోసం బేరమాడ గలిగిన అతని పొదుపరి స్వభావానికి ముగ్ధుడయి సుబ్రావ్ తల్లి తండ్రులతో మాట్లాడాడు.

ఒక్కగానొక్క కూతురు, పరంధామానికి  హాలు గాక ఒక రైస్ మిల్లు ఓ యాభయి ఎకరాల మాగాణి, పాతిక ఎకరాల మామిడి తోట ఉన్నందువల్ల, అమ్మాయి కూడా చక్కగా ఉన్నందువల్ల సంబంధం కుదిరిపోయింది. బంధువులలో ముఖ్యమయిన వాళ్లనే పిలిచి ఆర్భాటాలేవి పెట్టుకోకుండా పొదుపుగా పెళ్ళి జరిపించి కార్యమ్ గదిలొకి అల్లుడిని పంపిస్తే ఇలా అలక వహించాడు సుబ్రావ్.
.........................
"అల్లుడూ, ఏమి తక్కువయిందని అలిగావు తండ్రీ?" అని చేతులు పట్టుకున్నాడు పరంధామం.

"మామ గారూ, మీరు నాకు కట్నమిచ్చారు, ఆస్తి నా పేరు మీద రాశారు. అంతా బాగా ఉంది కానీ, ఆ రోజు నేను సినిమా చూడ్డానికి మీకు అయిదు రూపాయలిచ్చి బెంచి టికెట్ కొన్నాను కదా. అసలు సినిమా మొదలవకుండానే నా నెత్తిన ఫ్యాన్ పడింది కదా?" అన్నాడు సుబ్రావ్.

"నిజమే బాబూ. అందువల్లనే కదా నేను నిన్ను చూసింది. ఈ పెళ్ళి జరిగిందీనూ?"

"అయితే నేను సినిమా చూడలేదు కాబట్టి ఆ అయిదు రూపాయలు నాకు వెనక్కి రావాలి కదా. మరి మీరు ఇచ్చారా?" అన్నాడు సుబ్రావ్