నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, February 7, 2013

కోట్ల ఆస్తితో పిల్లనిచ్చిన మామగారిమీద సుబ్రావ్ ఎందుకు అలిగాడంటే .........(ఒక జోకు)


అల్లుడు అలక పాన్పు ఎక్కాడని తెలియగానే పరంధామం ఆశ్చర్యపోయాడు. తన ఒక్కగానొక్క కూతురు, ఆస్తి పాస్తులు, లక్షల కట్నం అంతా ఇచ్చిన తరువాత అల్లుడికి ఏం తక్కువయ్యిందని అలక పూనాడో ఆయనకి అర్ధం కాలేదు. అస్సలు సుబ్రావ్ ఆయనకి అల్లుడు అయిన విధమే ఒక విచిత్రం. అదేమంటే......
 
ఇంజనీరింగ్ పూర్తి చేసి, బెంగుళూరులో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సుబ్రావ్ ఒకసారి పండగకని సెలవు పెట్టి తన ఊరొచ్చాడు. పిసినారిగా పేరున్న సుబ్రావ్ కూడా ఊరిలో పొద్దు పోక సినిమాకి వెళ్దామని బయలు దేరాడు. ఊరిలో ఉన్న ఒకే ఒక హాలు  బుకింగ్ కౌంటర్‌లో తల పెట్టి "టిక్కెట్ ఎంత?" అనడిగాడు. ఆ టాకీస్‌కి ఓనర్, టికెట్ అమ్మేవాడు ఒకడే. అతను పిసినారి పరంధామం. టిక్కెట్ కౌంటర్‌లో ఎవరినయినా పెడితే వాడు మోసం చేస్తాడేమోనన్న భయంతో, ఇంత పనికి మళ్ళీ ఇంకొకడు ఎందుకు అన్న భావంతో ఆ పని కూడా తనే చేసేవాడు. 
 
"కుర్చీ పది రూపాయలు, బెంచి అయిదు రూపాయలు, నేల మూడు రూపాయలు" అని చెప్పాడు పరంధామం. "సరే, బెంచి టికెట్ ఒకటి కావాలి. ఇచ్చే రేటు చెప్పు" అన్నాడు సుబ్రావ్. తన జీవితంలో సినిమా టికెట్‌ని బేరమాడేవాడిని తొలిసారిగా చూసిన ఆనందంలో అహ నా పెళ్లంట సినిమాలో ఎండు పుల్లలు ఏరుకుంటున్న రాజేంద్ర ప్రసాద్‌ని చూసినప్పుడు కోట శ్రీనివాస రావుకి కలిగిన అనుభూతి కలిగింది పరంధామానికి. సినిమా టికెట్ ఫిక్సెడ్ అని సుబ్రావ్‌కి నచ్చజెప్పి బెంచి టికెట్ ఇచ్చి పంపాడు.

లైట్లు ఆరిపోయి న్యూస్ రీల్ వస్తుండగా పైన ఎప్పుడో తిరగడం మానేసి అలంకార ప్రాయంగా ఉన్న ఒక సీలింగ్ ఫ్యాను జారి సరిగా సుబ్రావ్ నెత్తి మీద పడింది. కెవ్వుమని అతను అరిచిన అరుపుకి ఊరు ఊరంతా ఉలిక్కి పడింది. పరుగెత్తుకు వచ్చిన పరంధామం పక్క వీధిలో ఉన్న ఆరెమ్పీ డాక్టర్ దగ్గర సుబ్రావ్‌కి చికిత్స చేయించాడు. ఆ క్రమంలో సుబ్రావ్ తాలుకు పుట్టు పుర్వోత్తరాలు తెలుసుకొని అతను తమ కులం వాడేనని గ్రహించి అతనిలో తన ఒక్కగానొక్క కూతురుకి మొగుడ్ని చూశాడు. అంతేకాక సినిమా టికెట్ కోసం బేరమాడ గలిగిన అతని పొదుపరి స్వభావానికి ముగ్ధుడయి సుబ్రావ్ తల్లి తండ్రులతో మాట్లాడాడు.

ఒక్కగానొక్క కూతురు, పరంధామానికి  హాలు గాక ఒక రైస్ మిల్లు ఓ యాభయి ఎకరాల మాగాణి, పాతిక ఎకరాల మామిడి తోట ఉన్నందువల్ల, అమ్మాయి కూడా చక్కగా ఉన్నందువల్ల సంబంధం కుదిరిపోయింది. బంధువులలో ముఖ్యమయిన వాళ్లనే పిలిచి ఆర్భాటాలేవి పెట్టుకోకుండా పొదుపుగా పెళ్ళి జరిపించి కార్యమ్ గదిలొకి అల్లుడిని పంపిస్తే ఇలా అలక వహించాడు సుబ్రావ్.
.........................
"అల్లుడూ, ఏమి తక్కువయిందని అలిగావు తండ్రీ?" అని చేతులు పట్టుకున్నాడు పరంధామం.

"మామ గారూ, మీరు నాకు కట్నమిచ్చారు, ఆస్తి నా పేరు మీద రాశారు. అంతా బాగా ఉంది కానీ, ఆ రోజు నేను సినిమా చూడ్డానికి మీకు అయిదు రూపాయలిచ్చి బెంచి టికెట్ కొన్నాను కదా. అసలు సినిమా మొదలవకుండానే నా నెత్తిన ఫ్యాన్ పడింది కదా?" అన్నాడు సుబ్రావ్.

"నిజమే బాబూ. అందువల్లనే కదా నేను నిన్ను చూసింది. ఈ పెళ్ళి జరిగిందీనూ?"

"అయితే నేను సినిమా చూడలేదు కాబట్టి ఆ అయిదు రూపాయలు నాకు వెనక్కి రావాలి కదా. మరి మీరు ఇచ్చారా?" అన్నాడు సుబ్రావ్

2 comments: