1942. మహాత్మా గాంధీ ఇచ్చిన క్విట్ ఇండియా పిలుపు నందుకొని అందరు భారతీయులూ స్వాతంత్ర్య ఉద్యమంలో దూకి పరాయి పాలనకి వ్యతిరేకంగా పోరాడుతున్న రోజులు. ఉద్యమ తీవ్ర రూపం చూసి బ్రిటీషు వారు బెంబేలెత్తిపోయి తమ అణచివేతని తీవ్రతరం చేశారు. అయినా ఉద్యమం ఏమాత్రం చల్లారలేదు. వందే మాతరం అన్నది భారతీయులకి రణ నినాదమయింది.
అలాంటి రోజుల్లోనూ సుబ్బారావు తన పనేమిటో తాను చూసుకోవడమె కానీ ఇలాంటి పనులకి దూరంగా ఉన్నాడు. తానొక్కడు పోరాటం చేసినంత మాత్రాన స్వాతంత్ర్యం ఒకరోజు ముందు రావడం కానీ, తాను చేయనంత మాత్రాన ఒకరోజు ఆలస్యంగా రావడం కానీ ఉండదని నమ్మిన అతగాడు తాను, తన చిల్లరకొట్టు, భార్యా బిడ్డలూ లోకంగా గడిపేవాడు.
అలాంటి వాడు కూడా ఒక రోజు వీధిలో వెళ్తూ పోలీసు స్టేషన్‌ని, అక్కడ కాపలాగా ఉన్నబ్రిటీషు పోలీసులని చూసి ఆవేశపడి పోయాడు. ఆవేశంతో రెచ్చి పోయి ముందూ వెనకా ఆలోచన లేకుండా పిడికిలి బిగించి "వందే మాతరం" అని గొంతెత్తి అరిచాడు. ఆ కేక విని అయిదారు మంది పోలీసులు బిలా బిలా పరుగెత్తుకొచ్చి, "ఏంట్రా కూశావ్?" అనరిచారు. పోలీసులని వాళ్ళ చేతుల్లో లాఠీలు, తుపాకులనీ చూశాక సుబ్బారావుకి ఆవేశం ఒక్కసారిగా దిగిపోయింది.
"అబ్బెబ్బే, ఏం లేద్సార్. ఆ పక్కన పోతున్న సపోటా పండ్లు అమ్మే వాడిని వంద ఏ మాత్రం? అనడిగానంతే" అని జవాబిచ్చాడు. దానితో ఆ పోలీసులు మన వాడిని వదిలేసి స్టేషన్‌లోకి వెళ్ళిపోవడంతో బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకొని వెళ్ళి తన చిల్లర కొట్టులో కూర్చున్నాడు. ఆ తరువాత 1947 ఆగష్టు 16 వరకూ ఆ దారిలో నడవనే లేదు మన సుబ్రావ్.
5 comments:
భలే నవ్వు పుట్టించింది.
ఇది పదిహేను సంవత్సరాల పాత జోకు
అవునండీ. ఇది పాత జోకు. నేను ఎప్పుడో ఇరవై యేళ్ళ క్రితం విన్నాను. బావుందని రాశాను.
చాలా నవ్వుకున్నాము చదివి . ధన్యవాదములు
:))))))
Post a Comment