నిన్న, సోమవారం మధ్యాహ్నం అలా చానల్స్ తిప్పుతూండగా టీవీ9 లో ఒక దృశ్యం కనిపించింది. ఒక సభ తాలూకూ ఫోటో అది. కొందరు వేదిక మీద కూర్చుని ఉన్నారు. వారి వెనక రావణ వర్ధంతి సభ అన్న బ్యానర్ ఉంది. ఇంతలో ఓ ఫోటో స్థానంలో కంచె ఐలయ్య కనిపించాడు. ఎంతైనా మేధావి కదా అని చానల్ మార్చకుండా చూశాను. అది ఒక చర్చా కార్యక్రమం. కంచె ఐలయ్య, బీజేపీ నాయకులు భాను ప్రకాష్ రెడ్డి ఫోన్‌లో, మరొక ఆయన స్టూడియోలోనూ ఉంది చర్చిస్తూ ఉన్నారు. ఒక నిముషంలోనే విషయం అర్ధమై పోయింది. రామాయణంలో అసలు హీరో రావాణుడే అని ఐలయ్య సార్ అంటున్నారు. దానిని వాళ్ళిద్దరూ కౌంటర్ చెస్తూ ఉన్నారు.
అధికారం మొదటినుంచీ బ్రాహ్మణులూ, క్షత్రియులూ, రెడ్లూ, వెలమల చేతుల్లోనే ఉంది అని, ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు అది అంద లేదనీ అందులో భాగం రామాయణం అని ఒక వింత వాదన లేవనెత్తారు ఐలయ్య. అసలు రావణుడు పులస్త్య బ్రహ్మ వారసుడు అని, స్వచ్ఛమైన బ్రాహ్మణుడు అని ఆయనకి కౌంటర్ ఇచ్చారు స్టూడియోలోని వ్యక్తి (ఆయన పేరు తెలుసుకోలేక పోయాను). దానితో ఐలయ్యకి చిర్రెత్తుకొచ్చి, "నువ్వు బీసీవి, అగ్ర వర్ణాలవారికి బానిసగా వారికి కొమ్ము కాస్తున్నావ్" అని అంటే, "నువ్వు విదేశీ డబ్బుకి అమ్ముడు పొయ్యావ్" అని ఈయన కేకలేసుకున్నారు. అప్పుడు యాంకర్ కాస్సేపు బ్రేక్ తీసుకున్నాడు.
బ్రేక్ తరువాత ఐలయ్య తన విశ్వరూపం చూపించాడు. రావణుడిని, శూర్పణఖని, వాలినీ ఎస్సీ, ఎస్టీలుగా వర్గీకరించి పారేసి, రాముడు మహిళలని హింసించాడని ఒక అభియోగం మోపాడు. మీరు చెప్పిన ఈ ముగ్గురూ ఎస్సీ, ఎస్టీలకి ఏం చేశారయ్యా అన్న ప్రశ్నకి, వాళ్ళు వస్తు ఉత్పత్తి చేశారు అని, ఇరవయ్యో శతాభ్దం తాలూకూ కమ్యూనిస్టు భావజాలాన్ని త్రేతాయుగం నాటి పాత్రలకి అంట గట్టే ప్రయత్నం చేశాడు ఐలయ్య. ఒరేయ్ నాయనా అస్సలు రామాయణం మహా కావ్యాన్ని రాసిందెవరో నీకు తెలుసా అన్న ప్రశ్నకి, తెలంగాణాలో క్రీస్తు పూర్వం మల్లయ్య అని ఒక కవి ఉండేవాడు అని మొదలు పెట్టి నేను మూర్చపొయ్యేలా చేశారు ఐలయ్య గారు. క్రీస్తు పూర్వమే తెలంగాణా, రాయలసీమ, కోస్తాంధ్ర అని ఉండేవా అని షాకయ్యాను నేను.
శూర్పనఖని హింసించినందుకు లక్ష్మణుడు, అమ్దుకు ప్రోత్సహించినందుకు రాముడు శిక్షార్హులు అని ఐలయ్యగారి వాదన. ఇంకా నయం ఎలాగూ వాలి, శూర్పణఖ, రావణాసురల్ని ఎస్సీ, ఎస్టిలుగా తేల్చిపారేశాడు కాబట్టి వారితో యుద్ధం చేసినందుకు రామ లక్ష్మణుల మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టమంటాడేమో కంచె ఐలయ్య అని నేను భయపడుతూండగా చర్చని ముగించాడు యాంకరు. బ్రతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నాను.