ప్రతి ప్రాధమిక పాఠశాలలోనూ పిల్లలకి బోధించే నీతి వాక్యాలలో చెరపకురా చెడేవు, ఎవరు తీసిన గొయ్యిలో వారే పడతారు అన్నవి ఖచ్చితంగా ఉంటాయి. అయితే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చదువుకున్న స్కూలులో ఇవి చెప్పినట్లు లేదు. అలా చెప్పి ఉంటే ముంబయిలో నిన్న ముగిసిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో మన వాళ్ళు అంత దారుణంగా దెబ్బ తిని ఉండే వాళ్ళు కాదేమో.
ముంబయిలో పిచ్ తయారు చేసే క్యూరేటర్‌కి స్పిన్ మ్యాచ్ కావాలని ధోనీ ఆర్డరేశాడు. మొదటి మ్యాచ్‌లో మన వారి స్పిన్ ఎదుర్కోలేక ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ తంటాలు పడ్డం చూసి అతను అలా అడిగాడు పాపం. మొదటి రోజు. మొదటి ఓవర్ కాదు మొదటి బంతి నుంచే పిచ్ మీద స్పిన్ తిరగాలని అయ్య గారు శాసించారు. భారత జట్టు కెప్టెన్, అందునా కపిల్, గంగూలీలా కాకుండా బీసీసీఐకి బాగా ఇష్టమైన కెప్టెన్ అలా కోరితే ఆఫ్ట్రాల్ ఒక క్యూరేటర్ కాదన గలడా?
మామూలుగా టెస్ట్ మ్యాచ్ పిచ్ అంటే మొదట్లో ఫాస్ట్ బౌలింగ్‌కి అనువుగా ఉండాలి. అంచేతనే అన్ని జట్లు ఫాస్ట్ బౌలింగ్‌ని సమర్ధంగా ఎదుర్కొని మొదటి ఒకటి రెండు గంటలు అవుటవకుండా ఆడగలిగే టెక్నిక్ ఉన్న వారినే ఓపెనింగ్ స్లాట్‌కి ఎంపిక చేస్తాయి. సునీల్ గవాస్కర్, జెఫ్ మార్ష్, డేవిడ్ బూన్, గార్డన్ గ్రీనిడ్జ్ ఇలా బాగా పేరు మోసిన ఓపెనర్లందరూ ఫాస్ట్ బౌలింగ్ ఆడడంలో సిద్ధ హస్తులయి ఉంటారు. తరువాత ఆట కొనసాగే కొద్దీ పిచ్ బ్యాటింగ్‌కి అనుకూలించి చివరి ఒకటిన్నర రెండు రోజుల్లో పిచ్ మీద పగుళ్ళు ఏర్పడి స్పిన్‌కి అనుకూలంగా మారుతుంది. ఆ స్థితిలో స్పిన్నర్లు రెచ్చి పోతుంటారు. ఇక ముంబయి మ్యాచ్ విషయానికొస్తే ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నప్పుడు మ్యాచ్ గెలిచేశానని అనుకొని ఉంటాడు. ఎందుకంటే చివరి ఇన్నింగ్స్ ఆడేది ఇంగ్లాండ్ కాబట్టి, వాళ్ళు మనవారి స్పిన్ బౌలింగ్‌ని తట్టుకొని నిలబడలేరని ఇక తనకి జయమ్ము నిశ్చయమ్ము అనుకొని ఉంటాడు.
కానీ జరిగింది అందుకు విరుద్ధంగా ఉంది. చెరపకురా చెడేవు అన్నట్టు తాను తీసికున్న స్పిన్ పిచ్ గుంతలో తనే పడ్డాడు ధోనీ భాయ్. ఇంగ్లండ్ జట్టులోని పానేసార్, స్వాన్‌లు వేసిన బంతులు మెలికల్ తిరుగుటుంటే పిచ్ మీద మిరకల్ జరిగి మన వాళ్ళు అయ్యయ్యో అంటూ దెబ్బ తిని ఓటమి పాలయ్యారు.
ఇతరుల తప్పులనుంచి పాఠాలు నేర్చుకొనేవాడు ఉత్తముడు, తన తప్పుల నుంచి నేర్చుకునేవాడు మధ్యముడు, అసలు పాఠాలు నేర్చుకోలేనివాడు అథముడు అని ఇంకొక నీతి కూడా ఉంది. ఇప్పుడు కొలకత్తాలొ జరగబోయే మూడో మ్యాచ్‌కి కూడా స్పిన్ పిచ్ కావాలని పట్టు పడుతూ తాను కనీసం మధ్యముండ అని కూడ అనిపించుకోలేక, అధముండ అని నిరూపించుకోబోతున్నాడు మహీ.