ఒకప్పట్లో యండమూరి వీరేంద్రనాధ్ నవల వెన్నెల్లో ఆడపిల్ల పాఠకులని విపరీతంగా ఆకట్తుకున్నది. అందులో చదరంగంలో గ్రాండ్ మాస్టర్‌కీ ఒక అమ్మాయికీ ఫోన్‌లో జరిగే పరిచయం, ఆ అమ్మాయి తనెవరో చెప్పకుండా తనెక్కడ ఉంటుందో, ఎలా కలుసుకోవాలో ఫోన్‌లో గణిత ఫార్ములాలు ఉపయోగించి సాల్వ్ చేసే క్లూలు ఇచ్చి హీరోని పరీక్షిస్తూ ఉంటుంది. హీరో కూడా మామూలుగా యండమూరి నవలల్లో ఉన్నట్టుగానే మేధావి కావడం వల్ల ఇట్టే సాల్వ్ చేసి పారేసి, కొన్ని కాకతాళీయ పరిస్థితుల మూలంగా ఆమెని కలుసుకోవడం మిస్సవుతూ ఉంటాడు. ఇలా మూడు వందల పేజీలు ఒకరినొకరు కలుసుకోకుండా గడిపేస్తారు.
ఆ తరువాత అదే ఆంధ్ర భూమి వీక్లీలోనే పయనమయే ప్రియతమా అని బొమ్మదేవర నాగకుమారి రాసిన ఒక సీరియల్‌లో కూడా హిరో హీరోయిన్లు చాలా వారాలు కలం స్నేహంతో పరిచయమయి అలానే ఉత్తరాలు రాసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ ఉత్తరాలు పోయి సోషల్ వెబ్ సైట్లు వచ్చేశాయి. వాటి ద్వారా పరిచయాలు ఏర్పడి వాటికే పరిమితమయేవి కొన్నయితే ఆ పరిచయాలు పెరిగేవి కొన్ని ఉంటాయి. కొన్ని సార్లు ఆన్‌లైన్‌లో ఏర్పడే ఈ పరిచయాలు విపరీత పరిణామాలకి దారి తీస్తాయి. ఒక ఉదాహరణ చూడండి.
అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలోని ఫీనిక్స్‌లో జరిగిన సంఘటన ఇది. ఒక పద్దెనిమిదేళ్ళ కుర్రాడు(అతని పెరు పోలీసులు బయట పెట్టలేదు) ఒక అమ్మాయితో ఆన్‌లైన్‌లో పరిచయం ఏర్పరచుకొన్నాడు. ఆ అమ్మాయి, ఆమెతో కలిసి ఉంటున్నరూమ్‌మేట్ ఇతన్ని తమ ఫ్లాట్‌కి రమ్మని ఆహ్వానించారు. ఎరగా సెక్స్ ఆశ చూపించారు. దానితో ఇతగాడు ఆశగా వారి ఫ్లాట్‌కి వెళ్ళాడు. ఆక్కడికి వెళ్ళాక మొదలయింది నరకం.
రెబెక్కా చాండ్లర్, రేవన్ లారాబీ
వెరయిటీ సెక్స్ అని చెప్పి ఇతని కాళ్ళూ చేతులు కట్టి వేశారు. ఇదేదో తమాషా ఆట అని అనుకున్న అతన్ని రెబెక్కా చాండ్లర్,రేవన్ లారాబీ అనే ఈ ఇద్దరు అమ్మాయిలు రెండు రోజులపాటు బ్లేడు పెట్టి వొళ్లంతా గాట్లు పెట్టి స్వర్గంలో విహరించాలని వచ్చిన చిన్న వాడికి నరకం ఎలా ఉంటుందో రుచి చూపించారు. ఎట్టకేలకు బయట పడి పోలీసులకు ఫోన్ చేయడంతో వాళ్లు వచ్చి ఆ ఫ్లాట్‌లో చూడగా The Werewolf's Guide to Life, The Necromantic Ritual Rule Book, Intro to Sigilborne Spirits లాంటి క్షుద్ర విద్యల పుస్తకాలు కనిపించాయి.
చేతులు కాళ్ళు కట్టేసి శృంగారం చేయడం, బ్లేడు పెట్టి కోయడం ముగ్గురూ ఇష్టపడే ప్రారంభించామనీ, మధ్యలో అడ్డం తిరిగి ఆ అబ్బాయికి కొన్ని గాట్లు ఎక్కువ పడ్డాయని ఆ అమ్మాయిలు పొలీసులతో చెప్పారు. పోలీసులు తలలు పట్టుకొని అతన్ని హాస్పిటల్‌లో చేర్పించి వైద్యం ముదలు పెట్టారు.