నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, January 28, 2011

వైశ్యులందరూ పిరికి పందలూ, రాయలసీమ రెడ్లందరూ రౌడీలూనా?


సూరి హత్య తరువాత న్యూస్ చానల్స్ వారికి బాగా మేత దొరికింది. ఈ సెటిల్‌మెంట్ దందా బ్యాచ్‌కీ, టాలీవుడ్‌కీ లింకు దొరికాక ఇక సందడే సందడి. ABN వాళ్ళయితే జగన్‌కి కూడా ముడిపెట్టి అదే"గన్" అని ఒక స్టోరీ వేసేశారు. ఇక నిన్న N TV  ప్రసారం చేసిన ఒక కథనంలో విచిత్రమైన వ్యాఖ్యానం చేసింది. భాను గాంగ్, బీ కంపెనీ అన్నారు దీనిని, ఒక సామాజిక వర్గం దగ్గరే అప్పులు తీసుకుంటారట. ఈ వర్గానికి డబ్బు కన్నా ప్రాణం మీద తీపి ఎక్కువట. వీళ్ళు డబ్బు కోసం పట్టు పడితే రాయలసీమకు చెందిన మరొక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళతో బెదిరించేలా చేస్తారట. దానితో ఆ డబ్బు ఇచ్చిన వాళ్ళు పోతో పోయింది డబ్బు అని వదిలేస్తారట.
     
బెదిరించేది రాయలసీమ రెడ్లు అని ఇట్టే చెప్పొచ్చు, మరి డబ్బు ఇచ్చేది ఎవరా అని అనుమానమొస్తే దానిని నివృత్తి చేయడానికా అన్నట్లు ఒక గుప్తా పేరు కూడా అప్పుడే చెప్పారు.

ఈ కథనం ప్రకారం వైశ్యులు పిరికి వాళ్ళు, రాయలసీమ రెడ్లు రౌడీలు అనుకోవాలని ఆ చానల్ ఉద్ధేశ్యమేమో! సరే ముఖ్యమంత్రిగా రోశయ్య గారి నిర్వాకం చూశాక ఆ అభిప్రాయం కలుగుతుందేమో కానీ కర్నూలులో టీజీ వెంకటేష్ మాటేమిటి? 
 
అక్కడ కమ్యూనిస్టులని కూడా ఈయన అదుపులో పెడుతున్నారు కదా? అలాగే ఫాక్షనిస్టు వార్తలూ, సినిమాలు చూసి రాయలసీమ రెడ్లు రౌడీలనుకోవడం సరియేనా? నీలం సంజీవరెడ్డి, కడప కోటిరెడ్డి, జయభారత్ రెడ్డి ఇలా ఎందరు ఆణిముత్యాల్లాంటి రెడ్లు సీమలో పుట్టలేదు?

అయినా ఒక సామాజిక వర్గాన్ని మొత్తం ఒక గాట కట్టేయడం సమంజసమేనా అని ఆ చానల్ పెద్దలు ఒక సారి ఆలోచిస్తే మంచిది.

ఎయిర్ బస్సు కన్నా ఎర్ర బస్సు నయమనిపించిన వేళ.



ఈ నెల 16 ఉదయం, పోర్ట్ బ్లెయిర్ నుంచి చెన్నైకి కింగ్ ఫిషర్ విమానంలో ప్రయాణం, 7:30 కి డిపార్చరు,గంట ముందుగా వెళ్ళి ఏర్‌పోర్టులో కూర్చున్నాం. ఏడు గంటలకు అనౌన్సుమెంటు...టెక్నికల్ రీజన్సు వల్ల అరగంట ఆలస్యంగా బయలు దేరుతుంది అని. అరగంటే కదా అని సర్దుక్కూర్చున్నాం. మరొక అరగంటలో మరో అనౌన్సుమెంటు. మరో అరగంట ఆలస్యం అని. అరగంటయినా, రెండు మూడు గంటలు ఆలస్యమయినా పెద్దగా పోయేదేం లేదు కాబట్టి నేను ఆలస్యానికి పెద్దగా ఫీలవలేదు కానీ, నాక్కొంచెం భయం వేసింది. ఆ మధ్య హిందూ పేపర్‌లో ఒక ఏవియేషన్ ఎక్స్‌పర్టు మూడు నాలుగు ఆర్టికల్సు రాశాడు. ఏర్‌లైన్స్ వాళ్ళు తగినంత మంది నిపుణులైన సిబ్బంది లేకుండా విమానాలు నడుపుతూ ప్రయాణీకుల ప్రాణాలతో ఎలా చెలగాటమాడుతుందీ అందులో వివరించాడు.
   
ఇది కూడా అలాంటి కేసేనా అనిపించింది. విమానం నడిపేందుకు ఎవరూ లేక, ఎవరినో ఒకరిని చూసేలోగా ఇలా సాంకేతిక కారణాలని చెప్పి ఆలస్యం చేసి చివరికి ఎవడో ఒకడికి విమానం అప్పగించి మా ప్రాణాలు వాడి గుప్పిట్లో పెట్టే ప్రయత్నం జరుగుతోందేమోననిపించింది


. నా భయాలని నివృత్తి చేస్తూ కాస్సేపటిలో అనౌన్స్‌మెంట్ వచ్చింది విమానం కేన్సిల్ అయినట్టూ, వివరాల కోసం కౌంటర్‌లో సంప్రదించాలని. అక్కడికి వెళ్తే ఎర్ర యూనిఫాంలో ఒక అమ్మాయి ప్రయాణీకులకి సర్ది చెప్పలేక నానా పాట్లు పడుతూ కనిపించింది.
  
మొత్తానికి తేలిందేమిటంటే ఆ రోజుకిక ప్రయాణం జరగదనీ, ఏర్‌లైన్స్ వాళ్ళు బస, భోజన వసతీ ఇస్తారనీ, మరుసటిరోజు ఉదయాన్న ఇంకో విమానంలో చెన్నై తీసుకెళ్తారనీను. మాకు పెద్దగా ఇబ్బందేమీ లేదు, ఆ రోజు ఎలాగూ ఆదివారం కాబట్టి forced holiday అని సర్ది చెప్పుకున్నాం. ఎటొచ్చీ చెన్నై నుంచి ఇతర ప్రదేశాలకీ, ఇతర దేశాలకీ వెళ్ళాల్సిన వారి బాధ, వాళ్ళ ఆవేశం చూస్తే పాపమనిపించింది.
  
ఎప్పుడైనా ఆర్టీసీ బస్సులో వెళ్ళల్సి వచ్చినప్పుడు ఆ బస్సు చెడిపోయి కేన్సిలైతే మరొక బస్సు అరేంజ్ చేసి పంపేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ఎర్ర విమానం ఆ పని చెయలేక పోయింది. అయినా విమానానికీ, బస్సుకీ పోలిక పెట్టడం భావ్యం కాదనుకోండి. మరుసటిరోజు పొద్దున్నే మరొక విమానం ఎక్కించి క్షేమంగా చెన్నైలో దింపాక బతుకు జీవుడా అనుకొంటూ నిట్టూర్చాం.

Monday, January 10, 2011

దీక్ష-౩ ఫ్రమ్ జగన్ ప్రొడక్షన్స్ అమెరికాలో విడుదల

జగన్ బాబు దీక్ష-1 ని విజయవాడ కృష్ణా నది ఒడ్డున విడుదల చేస్తే బాగా హిట్టయింది. ఈ సినిమా హిట్టో ఫట్టో సరిగా తెలియలేదు. జగన్ మీడియా సూపర్ డూపర్ హిట్టు అని ప్రచారం చేస్తే యెల్లో మీడియా అట్టర్ ఫ్లాపని చెప్పింది. సాక్షి బులెటిన్‌లలో ఇసక వేస్తే రాలనంత జనం కనిపిస్తే, ఆంధ్రజ్యోతి, స్టూడియో-N లు ఖాళీ గ్రౌండ్‌ని చూపించాయి. 
  
సరే మొత్తానికి ఫలితం ఎలా ఉన్నా, ప్రొడ్యూసరు హాపీ అయినట్టే ఉన్నాడు. కాబట్టే దీక్షకి సీక్వెల్ తీస్తున్నాడు. ఈ సారి నిడివి 48 నుంచి 24 గంటలకు తగ్గించాడు. కాకపోతే సినిమా బ్యాక్‌గ్రౌండ్ హైదరాబాద్ నుండి డిల్లీకి మార్చాడు. అసలు జగన్ ఏం చేసినా అది భారీ ఎత్తున ఉంటుంది. అశ్వినీ దత్, సుభాష్ ఘాయ్ సినిమాల్లాగా.


ఫస్ట్ పార్ట్ అందమైన నది ఒడ్డున, భారీ సెట్టింగు వేసి, లక్ష మంది ఎక్స్‌ట్రాలతో తీస్తే, సెకండ్ పార్ట్‌లో హైదరాబాద్ నుండి డిల్లీకి ప్రత్యేక రైలు, 1500 మంది ఎక్స్‌ట్రాలతో మొదటి దానికి ఏం తీసిపోకుండా తీయబోతున్నాడు. దీక్ష-2 హిట్టయితే, తరువాతి భాగం మాటేమిటి అన్న అనుమానమొచ్చిన వాళ్లకోసం ఈ పోస్టు.


డిల్లీ నడిబొడ్డున దీక్ష చేసి సోనియాకు, ప్రధానికీ తన సత్తా చాటాక జగన్ తదుపరి వేదిక కానున్నది న్యూయార్క్. న్యూయార్క్ నడిబొడ్దున, ఐక్యరాజ్య సమితి ముందు్, హైదరాబాద్ నుండి బోయింగ్ విమానంలో తరలించిన అయిదారొందల మందితో 12 గంటల నిరాహార దీక్ష చేసి బాన్ కి మూన్‌కి తన సత్తా ఏమిటో చాటాలి మన జగన్ బాబు.
    
అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి, సోనియా గాంధీ, మన్ మోహన్ సింగ్‌లే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాలకూ జగనన్న సత్తా తెలిసి వస్తుంది. కమాన్ జగన్,  అదేదో యాడ్‌లో సైఫ్ అలీ ఖాన్ చెప్పినట్లు  let's make ut large.

స్వచ్చమైన అందాల నిలయం తలకోన

మొన్న నూతన సంవత్సరం నాడు తలకోన వెళ్ళాము. డిసెంబరు 31 అయితే గందరగోళంగా ఉంటుందని జనవరి 1,2 తేదీలలో ప్లాన్ చేసుకొన్నాం. అయితే జనవరి 1 న భాకరాపేట, తలకోన మధ్య రూటు ట్రాఫిక్‌తో విపరీతమైన రద్దీ ఉండడంతో మాకు చాలా ఆలస్యమైంది. అక్కడికి వెళ్ళాక తెలిసింది. జనవరి 1 నాడు చుట్టు పక్కల ఊర్ల నుండి జనం తలకోనలోని సిద్ధేశ్వరాలయానికి తండోపతండాలుగా వస్తారని.


తలకోన చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక సుందరమైన విహార కేంద్రం. ఇది నెరబైలు దగ్గర, ఎర్రావారిపాలెం మండలంలో ఉంది. తిరుపతి నుండి 50 కిలోమీటర్లు, చిత్తూరు నుండి 105, చెన్నై నుండి 220 కిమీ దూరం ఉంటుంది. శేషాచలం కొండలు ఇక్కడనుండి మొదలవుతాయని దీనికి తలకోన(head hill) అని పేరు వచ్చింది.


82 మీటర్ల ఎత్తు నుండి కిందికి దూకే జలపాతం, దట్టమైన అడవులు తలకోన ప్రత్యేకతలు. చాలా సినిమాలలొ అడవి భాగం(బొబ్బిలి రాజా, జల్సా, పులి, ఒసేయ్ రాములమ్మా) ఇక్కడ షూట్ చేశారు. ట్రెక్కింగ్ ప్రియులకి ఇక్కడ అనేక ట్రెక్కింగ్ రూట్‌లున్నాయి. అంత భయంకరంగా ట్రెక్కింగ్ చేయలేని వారికోసం కూడా ఒక చిన్న మార్గం ఉంది. జలపాతాన్ని చేరుకోవడానికి దాదాపు అయిదు వందల కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది అంత శ్రమ కలిగించదు కాని మోకాళ్ళ నొప్పులున్నవారికి కొంచెం శ్రమతో కూడిన విషయమే. 


జలపాతం ఇక్కడ మెయిన్ అట్రాక్షన్. 82 మీటర్ల నుంచి కిందికి దూకుతూ రెండు లెవెల్స్‌లో ఉంటుంది. పై లెవెల్‌కి పోవడం కొంచెం శ్రమ అనిపించినా ఒకసారి పైకి చేరాక అక్కడ ఆ సన్నివేశం చూశాక ఆ శ్రమ తేలిగ్గా మర్చిపోతాం. ఈ జలపాతం ఎక్కడ నుండి మొదలవుతుందన్నది తెలియదు. భూగర్భ ధార ఒకచోటనుండి పైకి ఉబికి కొండలలోనుండి కిందికి దూకుతుంది. 
  




 
APTDC వారి కాటేజీ




కాటేజీ ముందు దృశ్యం



బస వసతి కోసం ఇక్కడ రెండు సౌకర్యాలున్నాయి. ఒకటి ఆంధ్ర ప్రదేశ్ టూరిజం వాళ్ళు నడిపే గెస్ట్ హౌస్. ఇందులో ఒక్కో బ్లాకులో రెండు అంతస్థులలో ఒక్కో దానికీ మూడేసి చొప్పున ఆరు రూములుంటాయి. ఏసీ, నాన్ ఏసీ రూములు ఒక రోజుకి 350, 450 రూపాయలు అద్దె ఉంటుంది. ఈ రూములని 08584-272425 కి ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఇయర్ ఎండింగ్, న్యూ ఇయర్, శివరాత్రి ఇక్కడ బాగా డిమాండ్ ఉంటుంది. ఆ సందర్బాలలో బాగా ముందుగా బుక్ చేసుకోకపోతే రూం దొరకడం కష్టం. ఈ రూమ్‌లలో జంగిల్ రిసార్ట్‌లో ఉన్న ఫీలింగ్ కలగదు.


మరొకటి CBET( community based echo tourism) వాళ్ళు నడిపే రిసార్టు.  




  
Canopy rope walk

 ఇవి చెట్ల మధ్యలో ఉన్న లాగ్ హట్స్. నిజమైన జంగిల్ ఫీల్ ఇస్తాయి. ఇందులో అద్దె రోజుకి 500. వీటిని బుక్ చేసుకోవాలంటే 08584-272282 కి ఫోన్ చేయాలి. ఈ రిసార్ట్‌లో 40 అడుగుల ఎత్తులో 240 మీటర్ల పొడవైన canopy rope walk ఉంది.  


 


 దీని పైన నడవడం పిల్లలకూ, పెద్దలకూ ఒక మంచి అనుభూతి.  ఈ రెండు చోట్ల కూడా ముందుగా ఆర్డరిస్తే శాఖాహార, మాంసాహార భోజనం తయారు చేస్తారు. APTDC రూంలో మేము రెండు కేజీల చికెన్ బిరియాని ఆర్డరిస్తే అందులో అర కేజీ మించి చికెన్ కనిపించలేదు మాకు. 




                                               Monkeys feasting on the leftovers 




బయట కూడా రెండు మూడు హోటళ్ళు ఇలా ఆర్డరిస్తే ఆహారం తయారు చేస్తాయి. అందులో ఒకటి "ఒసేయ్ రాములమ్మా హోటల్". దీని వెనుక ఆసక్తికరమైన కథ ఉంది.  


http://hittingontheface.blogspot.com/2011/01/blog-post_09.html


ఇక్కడ ఒక పురాతనమైన శివాలయం ఉంది. నూతన సంవత్సరాది నాడు, శివరాత్రి నాడు వుట్టుపక్కల ఊర్లనుంచి వచ్చే భక్తులతో ఈ క్షేత్రం పోటెత్తి పోతుంది. మిగతా రోజుల్లో అంతగా రద్దీ ఉండదు. ఆ రోజుల్లో ఇక్కడ ఎలాంటి బాదరబందీ, హడావిడీ లేని జంగిల్ రిసార్ట్‌లో ఉన్న అనుభూతి కలుగుతుంది. నవంబర్ నుండి ఫిబ్రవరి తలకోన చూడటానికి మంచి సమయం.

Sunday, January 9, 2011

తలకోనలోని ఒసేయ్ రాములమ్మా హోటలూ, దాని కథ.

తలకోనలో వాటర్‌ఫాల్‌కి వెళ్ళే దారి మొదట్లో కొంచెం ఎడమ వైపుగా ఒక చిన్న హోటల్, అంతకన్నా బంకు అంటే సరిగ్గా సరిపోతుంది, ఉంటుంది. దాని మీద ఉన్న బోర్డు ప్రకారం దాని పేరు "ఒసేయ్ రాములమ్మా హోటల్". ఆర్డర్ మీద భోజనం తయారు అని, నాటుకోడి స్పెషల్ అనీ మరికొన్ని వివరాలు ఉన్నాయి. కానీ నాలో ఉత్సుకత కలిగించిందేమిటంటే వీటికి కిందగా మరొక చిన్న లైన్ ఉంది, "సినీ రాములమ్మ మదర్-శాంతమ్మ" అని.




అప్పటికే మేము AP టూరిజం వాళ్ళ కాటేజీలో భోజనం ఆర్డర్ చేశాం కాబట్టి సినీ రాములమ్మ తల్లి చేతి నాటుకోడి రుచి చూడలేకపోయాం కానీ ఆ బోర్డు వెనకాల కథా కమామీషు తెలుసుకోవాలని మాకు భోజనం తెచ్చిన వాడినడిగాను దాని గురించి.


అతడు చెప్పిన దాని బట్టి విషయమేమిటంటే, ఒసేయ్ రాములమ్మ సినిమా కొంత భాగం షూటింగ్ తలకోనలో జరిగింది. అందులో విజయశాంతి చిన్న నాటి పాత్రని ఈ హోటల్ నడుపుకొనే శాంతమ్మ అనే ఆమె కూతురు పోషించింది. ఆ అమ్మాయి నటనకి మెచ్చిన విజయ శాంతి ఆమెని తనతో హైదరాబాద్ తీసుకెళ్ళి మరికొన్ని సినిమా అవకాశాలిప్పించింది. కొన్నాళ్ళకి వాళ్ళీద్దరికి పొరపొచ్చాలొచ్చాయి. దానితో ఆ అమ్మాయి విజయశాంతి నుండి విడిపోయి, తరువాత ఒక సినిమా వ్యక్తితో ప్రేమలో పడి, అతన్ని పెళ్ళి చేసుకుని తిరుపతిలో సెటిలై హాయిగా జీవిస్తోంది. 


తన కూతురు ఒసేయ్ రాములమ్మా సినిమాలో నటించిందన్న విషయాన్ని తన హోటల్ పబ్లిసిటీకి వాడుకోవచ్చునన్న సంగతి తెలుసుకున్న శాంతమ్మ ఆ పేరుతో బోర్డు చేయించి అలా తగిలించిందన్న మాట. 

Monday, January 3, 2011

అయ్యో పాపం!జస్ట్ మిస్ రాం గోపాల్ వర్మా!

మద్దెలచెరువు సూరి హత్యలో పెద్దగ ఆశ్చర్యపోయే, బాధ పడే అంశాలేమీ లేవు. కత్తితో బతికే వాడు ఆ కత్తితోనే చస్తాడని మన్ పెద్దలు ఏనాడో చెప్పిన విషయం నిజం చేయటానికే ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూ ఉంటాయి. 
 




 
సూరి హత్యకోసం మనం ఇక్కడ సంతాపాలూ, చింతకాయలూ ఏమీ పెట్టబోవడం లేదు. అయితే ఈ హత్య టైమింగ్ గురించే చిన్న మాట. ఇదే హత్య రాం గోపాల్ వర్మ తీసిన రక్త చరిత్ర సినిమాలలో ఏదో ఒకటి విడుదల కాకముందో, థియేటర్లలో ఆడుతూ ఉన్నప్పుడో జరిగి ఉంటే పాపం వర్మకి దిక్కుమాలినంత పబ్లిసిటీ వచ్చి నిర్మాత నాలుగు రాళ్ళు వెనకేసుకుని ఉండేవాడు కదా.
 
పోనీ ఇదే హత్య సినిమా ప్లాన్ చేస్తున్నప్పుడో, షూట్ చేస్తున్నప్పుడో జరిగి ఉంటే వర్మగారు తెర మీద మరింత రక్తం పారించి ఉండే వాడు కదా.


ఎటూ కాకుండా పోయిందే ఈ హత్యతో అని ఒక చిన్న నిట్టూర్పు.