నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Monday, January 10, 2011

స్వచ్చమైన అందాల నిలయం తలకోన

మొన్న నూతన సంవత్సరం నాడు తలకోన వెళ్ళాము. డిసెంబరు 31 అయితే గందరగోళంగా ఉంటుందని జనవరి 1,2 తేదీలలో ప్లాన్ చేసుకొన్నాం. అయితే జనవరి 1 న భాకరాపేట, తలకోన మధ్య రూటు ట్రాఫిక్‌తో విపరీతమైన రద్దీ ఉండడంతో మాకు చాలా ఆలస్యమైంది. అక్కడికి వెళ్ళాక తెలిసింది. జనవరి 1 నాడు చుట్టు పక్కల ఊర్ల నుండి జనం తలకోనలోని సిద్ధేశ్వరాలయానికి తండోపతండాలుగా వస్తారని.


తలకోన చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక సుందరమైన విహార కేంద్రం. ఇది నెరబైలు దగ్గర, ఎర్రావారిపాలెం మండలంలో ఉంది. తిరుపతి నుండి 50 కిలోమీటర్లు, చిత్తూరు నుండి 105, చెన్నై నుండి 220 కిమీ దూరం ఉంటుంది. శేషాచలం కొండలు ఇక్కడనుండి మొదలవుతాయని దీనికి తలకోన(head hill) అని పేరు వచ్చింది.


82 మీటర్ల ఎత్తు నుండి కిందికి దూకే జలపాతం, దట్టమైన అడవులు తలకోన ప్రత్యేకతలు. చాలా సినిమాలలొ అడవి భాగం(బొబ్బిలి రాజా, జల్సా, పులి, ఒసేయ్ రాములమ్మా) ఇక్కడ షూట్ చేశారు. ట్రెక్కింగ్ ప్రియులకి ఇక్కడ అనేక ట్రెక్కింగ్ రూట్‌లున్నాయి. అంత భయంకరంగా ట్రెక్కింగ్ చేయలేని వారికోసం కూడా ఒక చిన్న మార్గం ఉంది. జలపాతాన్ని చేరుకోవడానికి దాదాపు అయిదు వందల కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది అంత శ్రమ కలిగించదు కాని మోకాళ్ళ నొప్పులున్నవారికి కొంచెం శ్రమతో కూడిన విషయమే. 


జలపాతం ఇక్కడ మెయిన్ అట్రాక్షన్. 82 మీటర్ల నుంచి కిందికి దూకుతూ రెండు లెవెల్స్‌లో ఉంటుంది. పై లెవెల్‌కి పోవడం కొంచెం శ్రమ అనిపించినా ఒకసారి పైకి చేరాక అక్కడ ఆ సన్నివేశం చూశాక ఆ శ్రమ తేలిగ్గా మర్చిపోతాం. ఈ జలపాతం ఎక్కడ నుండి మొదలవుతుందన్నది తెలియదు. భూగర్భ ధార ఒకచోటనుండి పైకి ఉబికి కొండలలోనుండి కిందికి దూకుతుంది. 
  




 
APTDC వారి కాటేజీ




కాటేజీ ముందు దృశ్యం



బస వసతి కోసం ఇక్కడ రెండు సౌకర్యాలున్నాయి. ఒకటి ఆంధ్ర ప్రదేశ్ టూరిజం వాళ్ళు నడిపే గెస్ట్ హౌస్. ఇందులో ఒక్కో బ్లాకులో రెండు అంతస్థులలో ఒక్కో దానికీ మూడేసి చొప్పున ఆరు రూములుంటాయి. ఏసీ, నాన్ ఏసీ రూములు ఒక రోజుకి 350, 450 రూపాయలు అద్దె ఉంటుంది. ఈ రూములని 08584-272425 కి ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఇయర్ ఎండింగ్, న్యూ ఇయర్, శివరాత్రి ఇక్కడ బాగా డిమాండ్ ఉంటుంది. ఆ సందర్బాలలో బాగా ముందుగా బుక్ చేసుకోకపోతే రూం దొరకడం కష్టం. ఈ రూమ్‌లలో జంగిల్ రిసార్ట్‌లో ఉన్న ఫీలింగ్ కలగదు.


మరొకటి CBET( community based echo tourism) వాళ్ళు నడిపే రిసార్టు.  




  
Canopy rope walk

 ఇవి చెట్ల మధ్యలో ఉన్న లాగ్ హట్స్. నిజమైన జంగిల్ ఫీల్ ఇస్తాయి. ఇందులో అద్దె రోజుకి 500. వీటిని బుక్ చేసుకోవాలంటే 08584-272282 కి ఫోన్ చేయాలి. ఈ రిసార్ట్‌లో 40 అడుగుల ఎత్తులో 240 మీటర్ల పొడవైన canopy rope walk ఉంది.  


 


 దీని పైన నడవడం పిల్లలకూ, పెద్దలకూ ఒక మంచి అనుభూతి.  ఈ రెండు చోట్ల కూడా ముందుగా ఆర్డరిస్తే శాఖాహార, మాంసాహార భోజనం తయారు చేస్తారు. APTDC రూంలో మేము రెండు కేజీల చికెన్ బిరియాని ఆర్డరిస్తే అందులో అర కేజీ మించి చికెన్ కనిపించలేదు మాకు. 




                                               Monkeys feasting on the leftovers 




బయట కూడా రెండు మూడు హోటళ్ళు ఇలా ఆర్డరిస్తే ఆహారం తయారు చేస్తాయి. అందులో ఒకటి "ఒసేయ్ రాములమ్మా హోటల్". దీని వెనుక ఆసక్తికరమైన కథ ఉంది.  


http://hittingontheface.blogspot.com/2011/01/blog-post_09.html


ఇక్కడ ఒక పురాతనమైన శివాలయం ఉంది. నూతన సంవత్సరాది నాడు, శివరాత్రి నాడు వుట్టుపక్కల ఊర్లనుంచి వచ్చే భక్తులతో ఈ క్షేత్రం పోటెత్తి పోతుంది. మిగతా రోజుల్లో అంతగా రద్దీ ఉండదు. ఆ రోజుల్లో ఇక్కడ ఎలాంటి బాదరబందీ, హడావిడీ లేని జంగిల్ రిసార్ట్‌లో ఉన్న అనుభూతి కలుగుతుంది. నవంబర్ నుండి ఫిబ్రవరి తలకోన చూడటానికి మంచి సమయం.

1 comment:

P S Prakash said...

500 K M ట్రెక్కింగ్ ఎక్కడ చేయాలి