నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, September 28, 2011

గోకుడు+నాకుడు=దూకుడు


సినిమా విడుదలయిన రెండో రోజే దూకుడు సినిమా చూసే అవకాశం మహేష్ బాబు అభిమాని అయిన మావాడి వల్ల నాకు కలిగింది. నాకుగా నేను అయితే ఇలాంటి మెయిన్ హీరోల సినిమాలు మొదటి వారంలో చూడను. టికెట్లు దొరకడం కష్టమని, అబ్బో సూపర్ అని ఊదర గొట్టి తీరా సినిమా చూడబోతే చావగొడతారు అన్నది నా పూర్వ అనుభవం. కొమరం పులి, నాగవల్లి, పరమ వీర చక్ర లాంటివి మచ్చుకు కొన్ని నా అనుభవంలో.
 


"ఎలా ఉంది సినిమా?" అనడిగాడు వాడు సినిమా నుండి తిరిగి వస్తూంటే. "బాగా ఉంది" అన్నాను నేను. "ఇంతకు ముందు ఖలేజా కూడా బావుంది అని చెప్పావు. కానీ అది మటాషయింది." "అవును ఆ సినిమా నాకు నచ్చింది. ఎక్కువ మంది జనానికి నచ్చలేదు. కానీ ఈ సినిమా ఆడియెన్స్‌కి కచ్చితంగా నచ్చుతుంది. కామెడీ పండింది కదా" అన్నాను. "ఏముంది దీనిలో కొత్తగా. అన్ని సీన్లూ ఎక్కడో చూసినట్లే అనిపిస్తున్నాయి."


 
"అబ్బాయీ, మైసూర్ పాక్, లడ్డు... ఇలాంటి స్వీట్లు చేసినప్పుడు ఆ పాత్రల్లో అడుగున ఆ స్వీట్ అంటుకొని ఉంటుంది. దాన్ని బాగా గోకి ఆ మిశ్రమాన్ని తింటే భలే రుచిగా ఉంటుంది. ఇదీ అలాగే అనుకో. మీ ఫాన్స్ అప్పుడే పోకిరి, మగధీర రికార్డ్స్‌ని ఈ సినిమా బ్రేక్ చేస్తుందని అంటున్నారుగా."


ఇంత చెప్పినా ఆ మహేష్ వీరాభిమాని మొహంలో అసంతృప్తి తగ్గలేదు. 


మైసూర్ పాక్ లాజిక్ సరిగా అర్ధం కాలేదని కామెంట్ వచ్చాక ఈ పేరాగ్రాఫ్ యాడ్ చేస్తున్నాను. గిన్నెలోని పిండిని పూర్తిగా మైసూర్ పాక్ చేశాక అడుగున మిగిలిపోయిన పిండిని గోకి నాకితే ఎలా రుచిగా ఉంటుందో, శ్రీని వైట్ల తన బుర్రలోని ఐడియాలన్నీ ఇప్పటికే వాడేసినా, ఆ బుర్రలో అడుగున మిగిలిన ఐడియాలని గోకి ఈ సినిమాలో చూపించాడు. అయినా సినిమా బాగానే వచ్చింది అని నా అభిప్రాయం. ఈ సినిమా మొత్తం ఇదివరలో అక్కడక్కడా కొన్ని సినిమాలలో చూసినట్లు అనిపించవచ్చు. అయినా టోటల్‌గా సినిమా ఓకే అన్నది ఈ పోస్టు ఉద్దేశ్యం.

Monday, September 19, 2011

భూమిని నమ్మి దున్నితే కడగండ్లు, తవ్వి అమ్మితే కోటానుకోట్లు


భూమిని నమ్ముకొని వ్యవసాయం చేయడం అనేది చాలా కష్టాలతో కూడుకున్న విషయమైపోయింది. నాట్లు వేయాలంటే వర్షాలుండవు. గింజలు కల్తీవి అయి ఉంటాయి. ఒకవేళ నాట్లు వేసినా, వేశాక అవి సరిగ్గా ఎదగాలంటే తగిన నీరుండదు. ఎరువులు, పురుగు మందులు కొంటే అవి కల్తీవి అయి చస్తాయి. ఇన్ని తంటాలు పడి పంట పండిస్తే దళారుల చేతులలో మోసపోవాల్సి వస్తుంది. ఇది భూమాతని నమ్ముకొని వ్యవసాయం చేసి నలుగురికీ తిండి పెడదాం అనుకొనే రైతన్న పరిస్థితి.


 
అదే భూమాతని అడ్డంగా తవ్వేసి ఆమె గర్భంలోంచి విలువైన ఖనిజ సంపదను అడ్డంగా దోచేసే వారి సంగతి చూడండి. ఇళ్ళలో బంగారు సింహాసనాలు, కోట్ల కోట్ల డబ్బులూ, అధికారం... అబ్బో! 


 

ఇంకా కావాలంటే దేవుడికి కూడా బంగారు కిరీటాలిచ్చి ఆయన్ని కూడా మంచి చేసుకోవచ్చు.



Sunday, September 18, 2011

MOTOR MOUTH vs MOTOR MOUTH


Motor mouth అని రాఖీ సావంత్‌కి ముద్దు పేరు. అయితే మన రాష్ట్రంలో ఈ పేరు పెట్టాలంటే అంబటి రాంబాబుని మించిన వాడు లేడు. ఏ టాపిక్ అయినా బండ గొంతు వేసుకొని రెచ్చి పోతూ ఉంటాడు. అందుకే అన్ని చానళ్ళూ తమ డిస్కషన్ ప్రోగ్రామ్స్‌‍కి ఈయన్ని పిలుస్తూ ఉంటారు. జగన్ కూడా ఈ టాలెంట్ చూసే ఏమో ఈయన్ని అధికార ప్రతినిధిగా పెట్టుకున్నారు.


  
రాంబాబు అంత కాకపోయినా ఆ లెవెల్‌లో బండ గొంతు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణది. వాల్యూమ్‌లో రాంబాబుతో సమ ఉజ్జీ కాకపోయినా చెత్త వాగుడులో అంబటికి ఈయన ఏమాత్రం తీసిపోడు. ఆ సంగతి ఈయన నిర్వహిస్తున్న యంగిస్తాన్, ఓపెన్ హార్ట్ ప్రోగ్రాములు ఒక ఎపిసోడ్ చూసినా అర్ధమవుతుంది. ఇప్పుడు ఈ రెండు మోటార్ మౌత్‌లు ఒకదానితో ఒకటి తలపడుతున్నాయి. అంబటి రాంబాబు రాసలీలల ప్రోగ్రామ్ ఏబీఎన్ వాళ్ళు టెలికాస్ట్ చేయడంతో రసవత్తరమైన ఈ సమ ఉజ్జీల పోటీ చూసే భాగ్యం దక్కింది.


  Ambati sex scandal twist,women removes the screen
రాధాకృష్ణ గారిది కూడా ఏమంత గొప్ప చరిత్ర కాదని అంబటి సాక్ష్యాలు సేకరించినట్లు ఆదివారం సాక్షిలో వచ్చిన ఆయన స్టేట్‌మెంట్ చూస్తే అర్ధమవుతుంది. ఇప్పుడు ఈ ఇద్దరు ఒకరి బతుకుని ఒకరు బజారుకీడ్చుకొని రచ్చకెక్కుతారో, లేక అంబటి నుండి తగిన ప్యాకేజీ వస్తే ఈ సెక్స్ స్కాముని అటకెక్కిస్తారో చూడాలి.

ఆ చర్చిలో దేవుళ్ళూ, దేవతలూ అందరూ వ్యభిచారులే!


అమెరికాలో ఆరిజోనా రాష్ట్రంలోని, ఫీనిక్స్‌లో ట్రేసీ ఎలీస్ అనే అమ్మడు గాడ్డెస్ టెంపుల్ (GODDESS TEMPLE) పేరిట గత కొంత కాలంగా ఒక చర్చిని నడుపుతూ ఉంది. ఈ చర్చిలో తనని తాను ఈమె దేవతా మాతగా చెప్పుకొనేది. ఇక్కడ ఉండే మిగతా స్త్రీలందరూ దేవతలే. ఈ విషయాలు ఈ చర్చి అఫీషియల్ వెబ్ సైట్‌లో  ఉన్నాయి. స్పిరిచువాలిటీని, సెక్సువాలిటీని ఏకం చేయడం ఈ చర్చి ప్రధాన లక్ష్యం. వీరి కార్యక్రమాలలో నగ్న శిక్షణ, సెక్స్ ఎడ్యుకేషన్, ఆగిపోయిన శృంగార జీవితం మళ్ళీ ప్రవహించేలా చేయటం ప్రధానమయినవి. ఇవి చేయడానికి ఈ చర్చిలొ కొందరు దేవతలు నియమించబడ్డారు. అయితే ఈ సేవలు లేదా ప్రయోజనాలు చేసినందుకు "భక్తుల" వద్దనుంచి వీరు ఫీజు తీసుకోరు. భక్తులు వీరికి కానుకలు సమర్పించుకోవాలి. ఏ సేవకు ఎంత కానుక అనేది వీళ్ళే నిర్ణయిస్తారు ముందుగానే. వీరి వెబ్ సైట్‌లో వీరే చెప్పుకున్నది ఏమంటే, "సెక్స్ పవిత్రమైనది, దివ్యమైనదీను. మన శరీరాలని నయం చేసే శక్తి దానికి ఉంది. ఆ సెక్స్ శక్తిని మనం ఆలింగనం చేసుకొంటే మనకి ఆనందం, శక్తి, విజయం ప్రాప్తిస్తాయి."


   
ట్రేసీ ఎలీస్‌తో కొందరు దేవతలు
Leader: Goddess Temple founder Tracy Elise was among 18 individuals arrested on Wednesday after the raid 
గృహాన్నినడుపుతున్న మేడమ్ ట్రేసీ ఎలీస్


గత రెండేళ్ళుగా సాగుతున్న ఈ చర్చి కార్యకలాపాలను గమనిస్తున్న ఇరుగు పొరుగు వారికి ఇదేదో జమకుజమ లస్కుటపా వ్యవహారమని అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మతానికి సంబంధించిన విషయం కావడంతో పోలీసులు చర్య తీసుకోవడానికి భయపడ్డారు. పౌరులకు మత స్వేచ్చ కలిగిస్తూ అమెరికా రాజ్యాంగానికి సవరణ చేసినప్పటినుంచీ మత పరమైన విషయాలలో పోలీసులు కలగజేసుకోవడానికి అక్కడ కూడా మన దేశంలోలాగే జంకుతున్నారు. 


అయితే ఒక స్థానిక పత్రిక ఈ చర్చి గురించి రాయడంతో పోలీసులు కలగజేసుకోకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. దానికి తోడు ఒక వెబ్ సైట్‌లో అడల్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో ఈ ఆలయం గురించి ఒక ప్రకటన వచ్చింది. అందులో ఈ చర్చికి చెందిన  అయాటా అనే దేవత ఫోటో అర్ధ/ముప్పావు నగ్నంగా ఉండడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆరు నెలలు నిఘా పెట్టి, రహస్యంగా కొందరు పోలీసులని మారు వేషాలలో ఆ చర్చిలోకి పంపి పక్కాగా సాక్ష్యాలు సేకరించిన పోలీసులకి దిమ్మ తిరిగే నిజాలు బయట పడ్డాయి. 
 
అయాటా అనే దేవత


పోలీసుల మాటల్లో చెప్పాలంటే ఇదొక వ్యభిచార గృహం. ఇక్కడ దేవతలు అని చెప్పుకొనే వారంతా వ్యభిచారులు. ఇక్కడ ఉన్న దేవుళ్ళు కొంత మంది బ్రోకర్లు, మిగిలిన వాళ్ళు విటులు. ట్రేసీ ఎలీస్ దేవతా మాత కాదు, వ్యభిచార గృహం నడిపే మేడమ్. అక్కడ దొరికిన ఆధారాలను బట్టి పోలీసులు 30 మంది పైన కేసు నమోదు చేసి అందులో 18 మందిని అరెస్టు చేసి మిగిలిన వారికోసం వెదుకుతున్నారు. ఇదే మేడమ్ ఎలీస్ అరిజోనాలోనే సెడోనా అనే మరో చోట కూడా ఇలాంటిదే మరొక గృహం నడుపుందని తెలిసి దానిమీద కూడా దాడులు జరిపి అక్కడ మరికొంతమంది దేవుళ్లని, దేవతలని అరెస్టు చేశారు. 
PHOTO: Phoenix Goddess Temple, an alleged brothel


"చాటు మాటుగా ఇలాంటి కొంపలు నడిపే వారిని చాలా మందిని చూశాం కానీ ఇలా మతం, చర్చి ముసుగులో వ్యభిచారం నడపడాన్ని చూడడం మాకిదే మొదటి సారి. ఎవరికీ అనుమానం రాకుండా చాలా తెలివిగా నడుపుతున్నారు వీళ్ళు. సెక్స్‌ని వీళ్ళు పవిత్ర కలయిక అని, విటులని భక్తులు అని, విటులిచ్చే డబ్బుని నైవేద్యం అని కోడ్ పెట్టుకున్నారు" అని చెప్పాడు ఫీనిక్స్ పోలీస్ ప్రతినిధి స్టీవ్ మార్టోస్.




తరువాత తెలిసిందేమంటే ఈ ట్రేసీ ఎలీస్‌కి గతంలో సీటెల్‌లో కూడా ఒక బ్రోతల్ నడిపి పట్టుపడ్డ చరిత్ర ఉందని. ఒకసారి పోలీసులకి చిక్కిన అనుభవంతో ఈ సారి పక్కాగా ఎవరికీ దొరక్కుండా ఉండడానికి చర్చి ముసుగులో కంపెనీ పెట్టి కూడా దొరికిపోయింది.పాపం.

Wednesday, September 14, 2011

పిచ్చి నమ్మకాలతో తమ పిల్లల ఉసురు తీస్తున్న తిక్క చర్చి, దాని వెర్రి సభ్యులు


మార్చి,2008. 15 నెలల వయసున్న అవా వర్తింగ్‌టన్ చనిపోయింది. కారణం నిమోనియా, సరయిన యాంటీ బయోటిక్స్ వాడితే తేలిగ్గా నయమయ్యే జబ్బు. అయినా చనిపోయింది. అదే సంవత్సరం జూన్‌లో ఆ అమ్మాయి దగ్గర బంధువు నీల్ బాగ్లీ చనిపోయాడు. కారణం మూత్ర నాళానికి అవరోధం. చిన్న ఆపరేషన్‌తో పూర్తిగా నయమయ్యే వ్యాధి. 
  


జూన్, 2011. తిమోతీ, రెబెక్కా వైలాండ్‌ల కూతురు అయిలానా కంటి మీద గడ్డతో బాధ పడుతోంది. బఠాణీ గింజ సైజులో మొదలయిన గడ్డ క్రికెట్ బంతి సైజుకి వచ్చి, ఆ అమ్మాయి కంటి చూపు శాశ్వతంగా కోల్పోయే పరిస్థితికి వచ్చింది. పై రెండు కేసుల్లోనూ, ఈ అమ్మాయి కేసులోనూ తల్లి తండ్రులు తమ పిల్లలను హాస్పిటల్‌కి తీసుకుపోవడం కానీ, డాక్టర్లకి చూపడం కానీ చేయలేదు. అయిలానా విషయంలో పోలీసులు కలగజేసుకొని ఆమెని బలవంతంగా హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించడం వల్ల ఆమె కన్ను దక్కింది.
  


ఆగస్టు, 2011 లో డేల్, షానాన్ హిక్‌మన్‌లకు ఒక కొడుకు పుట్టాడు. నెలలు నిండక ముందే పుట్టిన ఈ శిశువు బరువు బాగా తక్కువగా పుట్టాడు. అయినా హాస్పిటల్‌కి తీసుకుపోకపోవడం వలన పుట్టిన తొమ్మిది గంటలకే మరణించాడు. సరయిన వైద్యంతోఈ శిశువుని కాపాడ్డం వీలయి ఉండేది. మరొక విషయమేమిటంటే నెలలు నిండకముందే డెలివరీ జరిగినా, ఇంత హై రిస్క్ డెలివరీని ఈ చర్చిలో సభ్యులుగా ఉన్న ఆడవారే చేశారు. వారెవరికీ మిడ్ వైఫ్ ట్రైనింగ్ కానీ అనుభవం కానీ లేదు.




 
పైన పేర్కొన్న అన్ని సంఘటనలూ ఎక్కడో వైద్య సదుపాయం లేని మూడవ ప్రపంచ దేశాలలో జరిగినవి కావు. అత్యంత అభివృద్ధి చెందిన అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రంలో జరిగినవి. ఈ అన్ని సంఘటనల్లో పిల్లలకి వైద్య సలహా తీసుకోక పోవడానికి కారణం వారి తల్లి తండ్రులకి ఉన్న మత విశ్వాసాలే. 


వీళ్ళందరూ ఫాలోయర్స్ ఆఫ్ క్రైస్ట్ అన్న చర్చికి చెందిన వారు. ఆ చర్చి నమ్మకాల ప్రకారం ఏ జబ్బుకీ మందులూ, ఆపరేషన్లు  ఉపయోగించకూడదు. ఏ జబ్బు అయినా ప్రార్ధన వలన కానీ, ఆ చర్చిలో ఉన్న ఫాదర్ ఆయన చేతులు పేషంట్ల కళ్ళ మీద ఉంచడం ద్వారా కానీ తగ్గాల్సిందే. ఎంత ప్రాణం మీదకి వచ్చే జబ్బు అయినా వీళ్ళు హాస్పిటల్‌కి వెళ్ళనే వెళ్ళరు.


  
ఈ దిక్కుమాలిన చర్చిని పంతొమ్మిదవ శతాబ్ధం చివరిలో అమెరికాలోని కాన్సాస్‌లో స్థాపించారు. 1940లో ఈ చర్చి ఓరెగాన్‌కి వచ్చి స్థిరపడింది. ఈ చర్చి సభ్యులు కొన్ని నమ్మకాలని నమ్మి వాటిని ఆచరిస్తారు. ఆధునిక వైద్యాన్ని బహిష్కరించడం అందులో ఒకటి. ఒకవేళ ఎవరైనా సభ్యులు చాటుమాటుగా డాక్టర్ల దగ్గరికి వెళ్ళినట్టు తెలిస్తే వారిని చర్చి నుండి బహిష్కరిస్తారు. 


ఇరవయ్యవ శతాబ్ధం రెండవ అర్ధంలో ఈ చర్చి ఉన్న చోటల్లా శిశు మరణాల సంఖ్య అధికంగా ఉండడంతో ఈ చర్చి వార్తల్లో కెక్కింది. ఓరెగాన్‌లో శిశు మరణాలు మిగతా దేశంతో పోలిస్తే 26 రెట్లు అధికంగా ఉన్నాయి. ఈ మరణాలు కూడా తేలిగ్గా నివారించదగ్గ కారణాలు, అంటే ఇన్‌ఫెక్షన్లు, నెలలు నిండక ముందు పుట్టడం లాంటి కారణాలతోనే సంభవిస్తాయి. ఈ చర్చి ఆవరణలోని శ్మశానంలో పూడ్చిపెట్టిన 78 మంది రికార్డులని పరిశీలిస్తే అందులో 38 మంది ఏడాది తిరక్కుండానే చనిపోయినట్లు, వారిలో 21 మంది చాలా సాధారణ, నివారించ దగ్గ కారణాలతో చనిపోయినట్లు వెల్లడైంది.


దాంతో అప్పటివరకూ మత స్వేచ్చ పేరిట తమ పిల్లల్ని హాస్పిటల్‌కి తీసుకు వెళ్ళాలా లేదా అన్నది తమ ఇష్టమని, అది తమ మత స్వాతంత్ర్య హక్కు అని వాదిస్తూ వచ్చిన ఈ చర్చి సభ్యులకి శిక్ష పడేలా 1999లో ఓరెగాన్ రాష్ట్ర చట్టాన్ని సవరించారు. మొదట్లో చెప్పిన కేసుల్లో నీల్ బాగ్లీ కేసులోనూ, అయిలానా కేసులోనూ తల్లి తండ్రులని కోర్టు శిక్షించింది.  డేవిడ్ హిక్‌మన్ కేసు ఇప్పుడు విచారణలో ఉంది. కాబట్టి ఈసారి ఎప్పుడైనా జబ్బు పడ్డప్పుడు ఎవరయినా తాయెత్తో, దారమో కట్టుకొని కనిపిస్తే చీ..చీ.. మనది ఎంత వెనక పడ్డ దేశమో అని ఈసడించుకోకండి. 



అంతకన్నా పిచ్చి నాయాళ్ళు ఎంత మందో ఉన్నారు.





Tuesday, September 13, 2011

నిజ జీవితంలో స్లమ్ డాగ్ మిలియనీర్ అపర్ణా మాలికర్


స్లమ్ డాగ్ కాదనుకోండి, ఫార్మర్ మిలియనీర్ అని పిలుచుకోవచ్చు అపర్ణా మాలికర్‌ని. మిలియనీర్ అన్నది కూడా నిజం కాదు. అపర్ణ గెలిచింది 6 లక్షల 40 వేలు మాత్రమే. కానీ ఆమె కథ ఆ సినిమాకి ఏమాత్రం తీసిపోదు. రైతు ఆత్మహత్యలకి పేరు గాంచిన మహారాష్ట్ర యవత్ మాల్ జిల్లాకి చెందిన 27 సమ్వత్సరాల అపర్ణ మాలికర్‌కి కొద్ది రోజుల క్రితం వరకూ జీవితం అంధకారంగా ఉండేది. ఆమె భర్త ఆమెని, ఇద్దరు కూతుళ్ళని వారి ఖర్మకి వాళ్ళని వదిలి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు కుతుళ్ళని పెంచుతూ, వ్యవసాయం కోసం భర్త చేసిన అప్పులని మోస్తూ అదే వ్యవసాయాన్ని ముక్కుతూ, మూలుగుతూ లాగుతుండగా, విధి ఆమెకి ఒక అనుకోని అవకాశాన్ని అందించింది. కౌన్ బనేగా కరోర్‌పతి ప్రోగ్రామ్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది ఆమెకి.
  Aparna Malikar (on left), the impoverished Vidarbha farm widow, who won Rs.6.4 lakh on TV show KBC. She holds a photo of show host Amitabh Bachchan.


కిశోర్ తివారీ అనే ఒక సామాజిక కార్యకర్త కృషి వలన ఆమెకి, అదే ప్రాంతానికి చెందిన మంజూష అనే మరో అమ్మాయి KBC స్పెషల్ షోలో పాల్గొనడానికి ఎంపికయ్యారు. మంజూష తండ్రి కూడా రైతే, ఆమె చిన్నప్పుడే అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అపర్ణ హాట్ సీట్‌లో అమితాబ్‌కి ఎదురుగా కూర్చుని ప్రశ్నలని ఎదుర్కొనడానికి ఎంపికయింది. అప్పటివరకూ తన ఊరు దాటి బయటకి రాని అపర్ణ తన బెరుకుని పొగొట్టుకొని అమితాబ్ అడిగే ప్రశ్నలకి సమాధానాలిచ్చి 6.40 లక్షలు గెలుచుకున్నాక ఆమెకి ఒక కష్టమయిన ప్రశ్న ఎదురయింది. అప్పటికే ఆమె తన లైఫ్ లైన్స్ అన్నీ వాడేయడం వలన అప్పటికి గెలుచుకున్న డబ్బుని కాపాడుకోవడం కోసం పోటీ నుండి వైదొలగింది.
 


"ఆ ప్రశ్నకు సమాధానం సంత్ తుకారాం అని నాకు తెలుసు. అయినా చాన్స్ తీసుకోదలచుకోలేదు" అని చెప్పిందామె తరువాత. ఆమె కథ విని కదిలిపోయిన బచ్చన్ తన వంతుగా ఆమెకి మరొక యాభయి వేలు ఇచ్చాడు. తను గెలుచుకున్న డబ్బుని ఏం చేయాలో కూడా ఆమె అప్పుడే నిర్ణయించుకొంది. ముందుగా  తన భర్తని బలి తీసుకున్న  అప్పుని తీర్చేయాలి, కూతుళ్ళ చదువు కోసం కొంత డబ్బు పక్కన పెట్టాలి, కూలి పోవడానికి సిద్ధంగా ఉన్న పాక తీసేసి పక్కా ఇల్లు కట్టుకోవాలి.


అపర్ణ, మంజూషల కథలు విని అమితాబ్ కూడా కదిలి పోయాడు. "వీళ్ళ బాధని, వేదనని వర్ణించడానికి నా దగ్గరున్న మాటలు చాలవు. కానీ ఇది మన కళ్ల ముందు కనిపిస్తున్న కౄరమైన వాస్తవం" అని తన బ్లాగ్‌లో రాసుకున్నాడు అమితాబ్. అంతే కాకుండా రైతు ఆత్మహత్యలని నివారించడానికి తన వంతు సాయం చేస్తానని కిశోర్ తివారీకి మాట కూడా ఇచ్చాడట. ఈ విషయమై ఇప్పటికే కృషి చేస్తున్న దీపా మెహతా, షర్మిలా ఠాగోర్, పి. సాయి నాథ్ లాంటి ప్రముఖులకి బచ్చన్ కూడా జత కలవబోతున్నాడు. 


గత వారం షూటింగ్ జరుపుకున్న ఈ ఎపిసోడ్ ఈ నెలాఖరులో ప్రసారం అవుతుంది.