నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, December 11, 2012

పిచ్ గురించ్ అంత రగడ ఎందుకురా పిచ్చి నా ---------


పిఛ్ గురించి ఈసారి జరిగినంత రగడ గతంలో ఎప్పుడూ జరగలేదేమోననిపిస్తోంది. అయితే ఈ రగడ భారత్ చేతిలో ఓడిపోయిన పర్యాటక జట్టు కెప్టెన్ నుండి కాక మన కెప్టెన్ దగ్గరనుండి కావడం ఇందులో విశేషం. క్రికెట్ జట్టు కెప్టెన్ అంటే మన దేశంలో శ్రీ మహా విష్ణువు పదకొండవ అవతారంతో సమానం. కాబట్టి అతను ఏం కోరితే అదల్లా దక్కడం ఇక్కడ ఆనవాయితీ. జట్టులో కోరుకున్న ఆటగాళ్ళు, మైదానంలో తనకు నచ్చిన పిచ్ ఇవన్నీ అలా వస్తూ ఉంటాయి. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో మన స్పిన్నర్లు రెచ్చిపోవడంతో, ముంబాయిలో జరిగిన రెండవ మ్యాచ్‌కి కూడా స్పిన్ పిచ్ కావాలని పట్టు బట్టాడు ధోని. "మొదటి రోజు, మొదటి గంటా కాదు, మొదటి బంతి నుండే స్పిన్‌కి అనుకూలంగా ఉండి, మూడు రోజుల్లో ఫలితం వచ్చే పిచ్ కావాలి" అన్నది క్యూరేటర్‌కి అయ్యగారి అల్టిమేటమ్. అయ్యగారు కోరిన విధంగా పిచ్ రెడీ అయింది. ఫలితం కూడా మూడు రోజులా ఒక్క గంటలో వచ్చేసింది. కానీ గెలిచింది ధోని అండ్ కో కాదు, కుక్ సేన గెలిచింది. పిచ్ స్పిన్‌కి అనుకూలంగా ఉండాలని అడిగాడే కానీ, ప్రత్యర్ధి జట్టులో ఎవరూ స్పిన్నర్లు ఉండకూడదు అన్న నిబంధన పెట్టడం మర్చిపోయాడు బాస్. దానితో మన స్పిన్నర్ల కన్నా అవతలి జట్టులోని పనేసార్, స్వాన్‌లు పిచ్ అనుకూలించడంతో రెచ్చి పోయి బంతిని మెలికలు తిప్పడంతో మన వాళ్ళు చేతులెత్తేశారు.
   

ఏదో ఒకసారి అలా అయింది కానీ మళ్ళీ అలా జరగదులే అన్న ధైర్యంతో కలకత్తాలో జరిగే మూడవ మ్యాచ్‌కి కూడా తనకి నచ్చినట్లుగానే పిచ్ ఉండాలని ఆర్డరేశాడు ధోనీ భాయ్. అయితే ఈసారి ఇక్కడున్న క్యూరేటర్ ప్రబీర్ ముఖర్జీ ఎన్నో యుద్ధములనారితేరిన ఎనభై మూడేళ్ళ భీష్ముడు. సాక్షాత్తూ సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా ఉన్నప్పుడే అతనికి లొంగలేదు. ఎవ్వరి మాటా వినని సీతయ్య టైపు. అభిమానులు అయిదు రోజులు మ్యాచ్ చూడాలని టికెట్లు కొంటారు. వాళ్ళని అలరించేలా పిచ్ ఉండాలి కానీ, మూడు రోజుల్లో ఫలితాన్ని తేల్చి పారేసేలా కాదు అన్నది ఈయన ఫిలాసఫీ. అయితే ఈ సారి సారధి గంగూలీ కాదని ధోనీ అని మర్చిపోయాడు ఈ పెద్దాయన. బిసిసిఐ అధ్యక్షుల వారి యాజమాన్యంలో ఉన్న చెన్నయ్ ఐపీఎల్ జట్టుకి కూడా ధోనీయే కెప్టెన్ అనీ అతన్ని దేశంలో క్రికెట్‌కి సంబంధించిన అందరూ కొత్త అల్లుడిలాగా చూసుకోవాలన్న ఇంగిత ఙానం కూడా ఈ పెద్దాయనకి లేకపోయింది. ధోనీ ఆఙని ఈయన తిరస్కరించడంతో ఈయన్ని పక్కన పెట్టి మరొక క్యూరేటర్‌ని తెప్పించారు క్రికెట్ పెద్దలు. దానితో తిక్క రేగిన ప్రబీర్ ముఖర్జీ ఒక నెల సెలవు పెట్టి వెళ్ళిపోయాడు. ఈ మొత్తం వ్యవహారం మీడియకి ఎక్కి కంపు కావడంతో మళ్ళీ ముఖర్జీని బ్రతిమిలాడి మైదానంలోకి తీసుకొచ్చి, పిచ్ మాత్రం కొత్త క్యూరేటర్ ఆధ్వర్యంలో ధోనీ కోరినట్లుగానే తయారు చేయించారు. అయితే మ్యాచ్ ముగిశాక "కోరుకున్న పిచ్ దొరికినది, మ్యాచ్ పోయినది" అయ్యింది ధోని పరిస్థితి.
 
ఇప్పుడు ఈ సిరీస్‌లో మరొక్క మ్యాచ్ మాత్రం మిగిలి ఉంది. కనీసం దానిలో అయినా గెలిచి సిరీస్ సమం చేయాలి ధోని గ్యాంగ్. ఫాస్ట్ బౌలింగ్, స్పిన్, బ్యాటింగ్ ఇలా దేనికి అనుకూలించే పిచ్ అయినా గెలుస్తామన్న నమ్మకం లేదు కాబట్టి, ఈ నాలుగో మ్యాచ్‌లో గెలవడానికి ధోనీ కొన్ని కొత్త డిమాండ్లు ముందుకి తీసుకు రావొచ్చు.

౧.ఈ మ్యాచ్‌కి రెండు పిచ్‌లు ఉండాలి. ఒకటి పూర్తి బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉండాలి. దాని మీద భారత జట్టు బ్యాటింగ్ చేయాలి. ఇక ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ చేసేటప్పుడు దాని పక్కన మరొక స్ట్రిప్ రెడీ చేసి దాన్ని పూర్తిగా బౌలీంగ్‌కి అనుకూలించేలా చేయాలి.
౨. ప్రత్యర్ధి జట్టు బ్యాటింగ్ చేసే సమయంలో మైదానం అంతా ఇసుకతో నింపాలి. దానివల్ల బంతి బౌండరీని చేరుకోకుండా ఉంటుంది. మన వాళ్ళు బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు ఆ ఇసుక తీసేసి, గ్రౌండ్‌లోని గడ్డి అంతా కత్తిరించి బంతి మెరుపులా బౌండరీ వైపు దుసుకెళ్ళేలాగా చేయవచ్చు.
౩. గల్లీ క్రికెట్ ఆడే పిల్లలు కొన్ని సార్లు రెండు సార్లు అవుటయితే కానీ అవుట్ కాదు అన్న రూల్ పెట్టుకుంటారు. అది మన వాళ్ళకి వర్తింపచేయాలి. అంటే ఇంగ్లాండ్ బౌలర్లు మనల్ని ఆలౌట్ చేయాలంటే ఒక్కో ఇన్నింగ్స్‌లో ఇరవై వికెట్లు తీయాలన్నమాట.

ధోనీ భయ్యా ఈ కోర్కెల లిస్టు శ్రీనివాసన్ గారికి పంపించు. ఎలాగోలా ఆయన వీటిని ఇంప్లిమెంట్ చేస్తారు. ఆల్ ది బెస్ట్.