మొన్న అమలాపురంలో కొందరు దుండగులు అంబేద్కర్ విగ్రహాలు నాశనం చేయగానే అన్ని పార్టీలకు చెందిన నాయకులు యుగాంతం వచ్చినట్లు రియాక్ట్ అయ్యారు. ఎక్కడెక్కడో ఉన్న వారందరూ వచ్చి ఆ విగ్రహాలను పరిశీలించి ఆ సంఘటనని ఖండించారు. చివరికి వి. హనుమంత రావు కూడా రంగంలోకి వచ్చాడు. అంబేద్కర్ విగ్రహాలని ప్రభుత్వమే పునరుద్ధరించాలని, కాంస్య విగ్రహాలని ఏర్పాటు చేయాలని, అన్ని అంబేద్కర్ విగ్రహాలకి ప్రభుత్వం రక్షణ ఏర్పాటు చేయాలని ఇలా ఎవరికి తోచినట్లు వారు స్టేట్‌మెంట్లు ఇచ్చి అంబేద్కర్ అంటే తమకి ఎంతో భక్తి ఉందని చాటుకోవాలని ప్రయత్నించారు. మరి కొందరయితే అంబేద్కర్ అసహ్యించుకున్న బ్రాహ్మణవాద రిచువల్స్ అయిన క్షీరాభిషేకం, గంగా జల, గంధపు అభిషేకం లాంటి వాటితో ఆ విగ్రహాలని శుద్ధి చేసే తిక్క పనులు కూడా చేశారు.
ఈ ఎపిసోడ్ మొత్తంలో అందరూ వినిపించిన రాగం ఏమంటే అంబేద్కర్ ఏ ఒక్క మతానికో, కులానికో చెందిన వ్యక్తి కాదు, భారత రాజ్యాంగ నిర్మాతగా మొత్తం జాతికే ఆరాధ్యనీయుడు, భారత జాతి మొత్తం గర్వించదగ్గ వ్యక్తి అన్నది. అంబేద్కర్ దళితుడు కాకపోయినా, దళిత ఓటు బ్యాంకుకి ఆయన ఐకాన్ కాకపోయి ఉన్నట్లయితే ఈ నాయకులు ఈ విషయంలో ఇంతగా స్పందించి ఉండేవాళ్ళా? రాజ్యాంగాన్నే ఎప్పుడో తుంగలో తొక్కిన ఈ నాయకులు రాజ్యాంగ నిర్మాతకి ఈ విలువ ఇచ్చేవారా?