నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, May 27, 2011

రోల్స్ రాయ్స్ కార్లతో చెత్త ఎత్తించిన మొనగాళ్ళు


రోల్స్ రాయ్స్ కారంటే వైభవానికి, ఐశ్వర్యానికి చిహ్నం. ఆమధ్య చిరంజీవి పుట్టిన రోజుకి ఆయన తనయుడు రామ్ చరణ్ ఏడు కోట్ల రూపాయలతో ఒక కారు కొని బహుమతిగా ఇచ్చాడట. ఇప్పుడు మన రోడ్ల మీద అంతగా లేవు కానీ మనకి స్వాతంత్ర్యం రాకముందు సంస్థానాధీశుల దగ్గర ఈ విలాసవంతమైన కార్లు చాలానే ఉండేవి. కష్టపడకుండా డబ్బు వచ్చి చేరుతుంటే, చేయడానికి పనేమీ లేకుండా సోమరిపోతుల్లా తిని కూర్చుని వీళ్ళు ఈ ఖరీదైన కార్లని కొని తమ గ్యారేజీల్లో పెట్టేవారు. 


 
అయితే ఇంత ఖరీదైన కార్లని మునిసిపాలిటీ చెత్త మోయడానికి వాడారని తెలిస్తే నమ్మశక్యంగా ఉంటుందా? కానీ ఇది నిజం. కనీసం నలుగురు మహరాజాలు ఈ అత్యంత విలువైన కార్లని చెత్తమోయడానికి వినియోగించారు. వాళ్ళు అలా చేయడానికి కారణం రోల్స్ రాయ్స్ కంపెనీ మీద కోపం. కొవ్వుపట్టి కొట్టుకోవడం అనేది ఇంకో కారణమనుకోండి. అది వేరే విషయం. ఆ వివరాలు ఒకసారి చిత్తగించండి.


 
ఒకసారి అల్వార్‌కి చెందిన మహరాజా జయ సింగ్ లండన్ పర్యటనలో ఉన్నప్పుడు రోల్స్ రాయ్స్ షోరూమ్‌కి వెళ్ళారు ఒక కారు కొందామని. ఆయనని అక్కడ కొత్తగా చేరిన ఒక సేల్స్ మాన్ గుర్తు పట్తలేదు. రాజా వారి సెక్రెటరీ అన్ని వివరాలు అడిగి చివరగా ఆ కారు రేటు గురించి మాట్లాడబోతే ఇది మీలాంటి వాళ్ళు కొనే కారు కాదులే పోవయ్యా అని దురుసుగా సమాధానమిచ్చాడట. దానితో అగ్గిమీద గుగ్గిలమైన రాజావారు ఉన్నపళాన పది కార్లు కొని పారేసి, వాటిని భారత దేశానికి తరలించి, పైకప్పు ఊడబీకించి చెత్త సేకరించడానికి పెట్టాడు. కార్లమీద లోగో కానీ, రోల్స్ రాయ్స్ బోనెట్ పైన ఉండే spirit of ecstacy బొమ్మకానీ చివర వరకూ పోకుండా జాగ్రత్తగా ఆ కార్లతో చెత్త తోలించారు రాజావారు.


 
ఇలాంటిదే మరొక కథ పాటియాలా రాజావారిది. ఈయనతో లండన్ షోరూమ్‌లో ఉన్న ఒక సేల్స్ మ్యాన్ సరిగా ప్రవర్తించనందుకు ఆగ్రహించిన రాజావారు అక్కడ ఉన్న 50 కార్లు అప్పటికప్పుడు కొనేసి, తన సంస్థానానికి తరలించి చెత్త మోయడానికి పెట్టేశారు. ఇదే పాటియాలాకి చెందిన మరొక మహరాజు భూపీందర్ సింగ్ గారి కథ మరొకటుంది. ఈయన కడు విలాసజీవి, శృంగార పురుషుడు. రాజావారికి పది మంది భార్యలు, 200 మంది ఉంపుడుగత్తెలు ఉన్నారట అప్పట్లో. ఈయనంటే రోల్స్ రాయ్స్ కంపెనీవారికి ప్రత్యేక భక్తి శ్రద్ధలుండేవి. ఆ కంపెనీ వారు ఎప్పుడు కొత్త మోడల్ తయారు చేసినా అయ్యగారు నాలుగయిదు కొనిపారేసేవారట. ఒక సారి(1913 లో) కంపెనీ వారు కొత్త మోడల్ గురించి రాజావారికి తెలియజేస్తే, మొత్తమ్ ఎన్ని కార్లు చేశారు అనడిగారట. ఇరవై అని కంపెనీ ప్రతినిధి చెప్పాక, అన్నీ నాకే అమ్మండి అని హుకుం జారీ చేశారు సారు వారు. దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ముందుగా బుక్ చేసుకున్న వాళ్లు ఉన్నారు. కావాలంటే అవి కాకుండా ఎన్ని మిగిలితే అన్నీ మీకే ఇస్తాం అని వాళ్ళు చెప్పినా రాజావారు శాంతించలేదు. ఆగ్రహంతో  తన వద్ద అప్పటికే ఉన్న రోల్స్ రాయ్స్ కార్లన్నిటినీ చెత్త మోయడానికి పంపేశారు.


 
మరొకటి భరత్‌పూర్ రాజావారి కథ ఉంది. ఈయన ఎప్పుడు కొన్నా మూడేసి కార్లు కొనేవారట. అంచేత ఈ రాజావారిక్కూడా రోల్స్ రాయ్స్ కంపెనీవారు కడు ప్రాధాన్యత ఇస్తారు. ఒకసారి రాజా వారి గ్యారేజ్‌లో ఒక కారు చెడిపోయింది. దాన్ని రిపేరు చేయడానికి మెకానిక్కులని పంపడంలో కంపెనీ ఆలస్యం చేసిందని ఆగ్రహించిన రాజావారు తన వద్దనున్న రోల్స్ రాయ్స్ కార్లన్నిటినీ మునిసిపాలిటికి అప్పగించారు. ఆ కార్లు చెత్త సేకరిస్తుండగా ఫోటోలు తీసి ఒక పత్రిక ప్రచురించింది. దానితో అప్పటికి రోల్స్ రాయ్స్ కార్లు వాడుతున్న పెద్ద తలకాయలన్నీ, వైస్‌రాయ్‌తో సహా కంపెనీ వారిమీద ఒత్తిడి తెచ్చి అప్పటికప్పుడు మెకానిక్‌లని పంపేలా చేసి రాజావారిని శాంతింపజేశారు.


మహరాజాలనీ, రోల్స్ రాయ్స్ కార్లనీ తలచుకొన్నప్పుడు మరొక మూడు ముచ్చట్లు చెప్పుకోవాలి. పాటియాలా మహరాజా భూపిందర్ సింగ్ గారు తన వద్దనున్న కార్లలో ఒక దానికి వజ్రాలతో పొదిగిన డాష్‌బోర్డ్ పెట్టించారు. ఆ కారుని ఎప్పుడు సర్వీసుకి పంపినా దానికి కాపలాగా నలుగురు సైనికులుండేవారు. 


జామ్‌నగర్ సంస్థానానికి చెందిన మహరాజాగారు తను తన భార్యకి బహూకరించబోయే Phantom II కారుకి తన భార్య వాడే పింక్ రంగు చెప్పులకి సరిగ్గా మ్యాచ్ అయ్యే రంగు వేయాలని ఆ చెప్పులని ఇంగ్లాండులోని ఫ్యాక్టరీకి పంపారట. 
 
ట్రావంకూర్ సంస్థానానికి చెందిన మహరాణీ సేతు పార్వతీబాయి తన 20/30 sedanలో ప్రయాణించేటప్పుడు ఆమెకాళ్ల దగ్గర ఒక చిన్న స్టూలు మీద ఒక మరుగుజ్జు కూర్చుని బయటవాళ్ళకి కనిపించకుండా ఆమె కాళ్ళు పిసుకుతూ ఉంటాడట.
 
PS: ముడ్డి మనది కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నాడట. అలాగే ఈ మహరాజులు, మహరాణులు ప్రజల డబ్బుతో, బ్రిటిషోడు ఇచ్చే రక్షణతో పనీ పాటా లేకుండా సోంబేరి బతుకు బతికినందువలన ఇన్ని వేషాలు వేయగలిగారు. టైటిల్‌లో మొనగాళ్ళు అని ఉన్నందువలన ఈ పిచ్చి నాయాళ్ళని హీరోలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నానని అనుకోవద్దని మనవి.

2 comments:

Anonymous said...

వీళ్ళదేముందండీ బొంగు. నేనైతే పొద్దున్నే లండన్ వెల్లోచ్చిన తరువాతే మిగతా పనులన్నీ చేసుకుంటాను!!

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

WOW