నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, May 31, 2011

ఏసీ బంగళా జైళ్ళు కావాలి మనకిప్పుడు


కనిమోళి తీహార్ జైలులో ఉన్న సెల్ గురించి చదివినప్పుడు నా హృదయం ద్రవించింది. ఆమె చేసింది చిన్నా చితకా స్కామా? వందల వేల కోట్ల రూపాయల స్కాము చేసిందే అన్న కనికరం కొంచెమైనా లేకుండా మామూలు ఖైదీలాగా పడేస్తారా? ఒక ఏసీ లేదు,ప్లాస్మా టీవీ లేదు, డబుల్ కాట్ బెడ్డు లేదు. కనీసం ఒక్కడైనా AK-47 పట్టుకున్న గన్ మ్యాన్ లేడు. వాక్సింగు, ఫేషియల్ చేయించుకోవడానికి జైలుకి అటాచ్డ్ బ్యూటీ పార్లర్ లేదు. ఎంత అన్యాయం, ఎంత అమానుషం.
 


కనిమోళి దుస్థితి చూశాక అయినా మన నాయకులు బుద్ధి తెచ్చుకోవాలి. ఎంతైనా నేటి నాయకులే రేపటి ఖైదీలు కాబట్టి అధికారంలో ఉన్నప్పుడే రేపు తాముండబోయే జైళ్ళని నిర్మించుకోవాలి. ప్రాచీన ఈజిప్టులో ఫారోలు తాము బతికున్నప్పుడే తమకి సమాధులుగా ఉండబోయే పిరమిడ్లని కట్టుకున్నట్లు వీళ్ళు కూడా మంచి మంచి సకల సౌకర్యాలున్న జైళ్ళని కట్టి పారేస్తే రేపెప్పుడైనా ఖర్మ కాలి తమ స్కాములు బయటపడి జైలు కెళ్ళాల్సిన అగత్యం కలిగితే ఇప్పుడు కనిమోళికి కలిగిన దుస్థితి కలగకుండా తప్పించుకోవచ్చు.
 


ఈ జైలులో సెల్లులు ఉండవు. ఒక్కో ఖైదీకి ఒక్కో సెంట్రలైజ్‌డ్ ఏసీ విల్లా ఉంటుంది. ప్రతి విల్లాలో బెడ్ రూమ్, కిచెన్, డైనింగ్ రూమ్ మొదలైన అన్ని సదుపాయాలూ ఉంటాయి. ప్రతి విల్లాకి ఒక వంటవాడు, పని వాళ్ళు ఉంటారు. విల్లాలలో ఉన్న ఖైదీలకోసం మినీ థియేటర్, క్లబ్, బ్యూటీ పార్లర్ మొదలయిన సదుపాయాలు ఉంటాయి. 


 
ఇలాంటి ఓ రెండో, మూడో వందలు కట్టి పడేస్తే ఏ దిగులూ లేకుండా మన నాయకులు స్కాములు చేసుకోవచ్చు. రేపెప్పుడైనా ఖర్మకాలి జైలుకెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినా ఇంటికన్నా జైలు పదిలం అనుకుంటూ హ్యాపీగా వెళ్ళి కూర్చోవచ్చు.

2 comments:

ANALYSIS//అనాలిసిస్ said...

మీరు అనవసరంగా రాజకీయ నాయకులకు కొత్త ఐడియాలు ఇస్తున్నట్టుంది కృష్ణగారూ ... చట్ట సభలు చేతిలో ఉన్నాయి కదా అని జైళ్లన్నీ A/C చేసేస్తున్నట్టు ఒక చట్టం చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే నేటి నాయకులే రేపటి ఖైదీలు కదా ... ఏమో రేపు ఎవడి పేరు బయటకొస్తుందో తెలీదు ... ఎవడు జైలుకెలతాడో తెలీదు ... అందుకని ముందు జాగ్రత్తగా వీళ్లంతా జైళ్ళన్నీ A/C లు చేసుకుంటే రేపు బయట తిరిగే సామాన్యుడి పరిస్థితి ఏంగావాలి ?

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

అప్పుడు అందరూ జైళ్లలోపలికి వెళ్ళడానికి పోటీ పడతారేమో? ఎవరు చూడొచ్చారు... తెల్ల కార్డుదారులకు నెలలో వారం రోజులు జైలు ప్రాప్తి అని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చినా రావొచ్చు.