మీడియా చేతిలో ఉంటే ఏం చేయవచ్చో చాలా కాలం క్రితమే గోబెల్స్ అనే పెద్ద మనిషి నిరూపించి గోబెల్స్ ప్రచారం అన్న ఒక కాన్సెప్టుకే సృష్టి కర్తగా వాసికెక్కాడు. సరయిన మీడియా లేని ఆ రోజుల్లోనే అంత చేసినప్పుడు అనేక రూపాల్లో మీడియా తన విశ్వరూపం చూపించే ఈ రోజుల్లో ఇంకెంత చేయగలమో నిరూపించాలని కంకణం కట్టుకున్న మీడియా అధినేతలు తమ విశ్వరూపాన్ని నానా రూపాల్లో ఆవిష్కరిస్తున్నారు. ఈ కోవలో మొదటి వరుసలో ఉండేవారిలో సాక్షి అధినేత జగన్ ఒకరు.
రాష్ట్రంలో ఇప్పుడు గాంధీ విగ్రహాలని మించి రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ఉన్నాయి. గాంధీగారి కన్నా మిన్నగా రాజశేఖర్ రెడ్డి గారికి గుడులు కూడా కట్టేశారు. వాటిలో ఒకదానికి (నాకు తెలిసి ఒకటి. ఇంకా ఎక్కువ ఉన్నాయేమో తెలియదు) ఏర్ కండీషనింగ్ కూడా ఉంది. ఆయన విగ్రహం పొలంలో పెట్టాక కొన్ని చోట్ల దిగుబడి కూడా ఎక్కువయిందట. ఇక సాక్షి పత్రికలో రోజుకొకటి చొప్పున ఆయన కొటేషన్లు వేస్తుంటారు. ఆయనకి మహానేత అన్న పేరు కూడా ఫిక్స్ చేసేశారు సాక్షి వాళ్ళు, గాంధీగారికి మహాత్మ లాగా.
రాజశేఖర్ రెడ్డి మరణించిన కొత్తలో, అప్పటికింకా జగన్ కాంగ్రెస్‌లో ఉండి సోనియా మాత దర్శనం కోసం వేచి ఉండే రోజుల్లో "మా నాన్న గాంధీ అంతటి వాడే" అని జగన్ ఒక స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు ఆయన స్థాయి గురించి ఎవరికయినా అనుమానాలు మిగిలి ఉంటాయేమోనని. ఈ విషయాన్ని అర్ధం చేసుకోలేని ఈ బ్లాగరు ఈ టాపిక్‌మీద వెటకారం వెళ్ళగక్కిన "జగన్ మోహన్ రెడ్డి గాంధీ సన్నాఫ్ రాజ శేఖర్ రెడ్డి గాంధీ" అనే పోస్టు ఇక్కడ చదవచ్చు .http://hittingontheface.blogspot.in/2010/07/blog-post_11.html
ఇప్పుడు జగన్ సహచరులు మరొక మెట్టు పైకెక్కి రాజశేకర్ రెడ్డిని ఒక మెట్టు పైకి ఎక్కించారు. శనివారం బెంగుళూరులో యోగి వేమన 600 జయంతి ఉత్సవాలు నిర్వహించిన ఒక సంస్థ వారు వైఎస్సార్ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, గురునాధ రెడ్డి, నెల్లూరు జిల్లాకి చెందిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనే ముగ్గుర్ని అతిధులుగా ఆహ్వానించారు. వేమన కవికీ ఈ నాయకులకి ఏం సంబంధం ఉందో ఏమో, లేక ఆ నిర్వాహకులు వీరి పార్టీకి చెందిన వారో తెలియదు.
విషయమేదయినా స్వామి భజన చేయడం, స్వామి భక్తి ప్రదర్శించడం లక్షణాలుగా ఒకప్పట్లో రాజుల దగ్గర భట్రాజులని ఉండేవాళ్ళు. ఆ జాతికి తగ్గట్లుగా ఈ భట్రాజులు యోగి వేమన, రాజశేఖర్ రెడ్డి ఇద్దరూ ఒకలాంటి వారే అని ఒక దాఋణమయిన స్టేట్‌మెంట్ ఇచ్చేసి, దాన్ని సమర్ధించుకోవడానికి వివరణ కూడా ఇచ్చారు. ఆనాడు యోగి వేమన సమాజంలో కుళ్ళు కడిగి పారేస్తే, ఈనాడు యోగి రాజన్న సమాజంలో పేదరికాన్ని మాయం చేసిపారేశాడట. అవ్వ!