నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Monday, July 25, 2011

నీచ నికృష్ట పైశాచిక పరమ కిరాతక మగ ధీరలు


 భయమన్నది లేకుండా యుద్ధం చేసే వాడిని వీరుడు అంటారు. ఒకేసారి అనేక మందితో యుద్ధం చేసే వాడిని ధీరుడు అంటారేమో? మగధీర సినిమాలో కాలభైరవ వంద మందిని చంపికానీ చావడని సినిమాలో రెండు మూడు సార్లు చెప్పిస్తాడు దర్శకుడు. దానిని చివర్లో ఒక భీకర యుద్ధంలో చూపిస్తాడు. షేర్ ఖాన్‌ పంపిన సైతాన్ కి ఫౌజీలో వంద మందిని వీరోచితంగా చంపుతాడు కాల భైరవ. ఆ ధీరోచిత పోరాటం చూసి శత్రువు కూడా ముచ్చట పడుతాడు.

చేతిలో ఆయుధం లేని వాడిని చంపకూడదు అని చెప్తుంది హిందూ యుద్ధ ధర్మ శాస్త్రం. మహా భారతంలో చాలా చోట్ల నిరాయుధునితో యుద్ధం చేయనని చేతికి చిక్కిన శత్రువులని విడిచి పెట్టిన సందర్భాలు ఎన్నో. అభిమన్యుడిని నిరాయుధుణ్ణి చేసి, అందరూ చుట్టు ముట్టి చంపడం, శిఖండిని చూసి విల్లు పక్కన పడవేసిన భీష్ముడిపై అర్జునుడు బాణాలు వేయడం లాంటివి అసాధారణ సంఘటనలుగా లెక్క వేయాలి. అందర్నీ పోగొట్టుకొని మడుగులో దాక్కున్న దుర్యోధనుడు బయటకి వచ్చి, మాలో ఎవరితో యుద్ధం చేస్తావో చెప్పు అని పాండవులు అడిగినప్పుడు, గదా యుద్ధంలో ఒక్క భీముడు తప్ప వేరెవ్వరూ తనకి సమ ఉజ్జీలు కాదని తెలిసి కూడా భీముడినే యుద్ధానికి ఆహ్వానిస్తాడు. వీరుడి లక్షణమంటే అది.

 
నిరాయుధులనీ, సాధారణ పౌరులనీ వరుసలో నించోబెట్టి కత్తులతో నరకడంలో పోటీ పడి అది వీరత్వం అనుకునే వాళ్ళని ఏమనాలి. ఇద్దరూ సైన్యాధికారులు తమ వీరత్వానికి ఇలాంటి పైశాచిక పోటీ పెట్టుకొని ఆనందం పొందితే వాళ్ళని పశువులు అంటే అది ఆ మూగ జీవాలని అవమానించడం అవుతుంది. ఇది జరిగింది 1937 లో అప్పటి చైనా రాజధాని నాన్‌కింగ్‌లో. ఈ నీచ కార్యానికి ఒడబడింది చైనాని ఆక్రమించుకున్న జపాన్ సైన్యంలోని ఇద్దరు అధికారులు.


1937లో జరిగిన రెండవ చైనా జపాన్ యుద్ధంలో అప్పటి చైనా రాజధాని నాన్‌కింగ్‌ని జపాన్ ఆక్రమించుకొంది. ఈ ఆక్రమణలో భాగంగా జపాన్ సైనికులు నాన్‌కింగ్ ప్రజల మీద అంతులేని దురాగతాలకి పాల్పడ్డారు. జపనీయులు రాజధానిని ఆక్రమించుకోవడం తధ్యమని తెలుసుకున్న చైనా ప్రభుత్వం నాన్‌కింగ్‌ని ఖాళీ చేసి వెళ్తూ చివరి రక్తపు బొట్టు వరకూ పోరాడమని తన సైనికులకి ఆర్డర్ పాస్ చేసింది. అంతకు మునుపు షాంఘై నగరాన్ని ఆక్రమించుకొని జపాన్ సైనికులు అక్కడ చేసిన దురాగతాలు బాగా తెలిసిన సైనికులు తమ యూనిఫామ్ విప్పేసి సాధారణ ప్రజలలో కలిసి పోయారు. మరో వైపు ప్రజలు నగరాన్ని ఖాళీ చేయకుండా నగరం చుట్టూ సైనికులని కాపలాగా పెట్టింది చైనా ప్రభుత్వం.


ఇలాంటి పరిస్థితులలో జపాన్ ఇంపీరియల్ ఆర్మీకి చెందిన సైనికులు నాన్‌కింగ్‌లో ప్రవేశించారు. వచ్చీ రాగానే తమ రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. సైనికులు, ప్రజలు అన్న తేడా లేకుండా కనిపించిన వారిని కనిపించినట్లు చంపడం, చిన్నా పెద్దా, ముసలీ ముతకా అన్న తేడా లేకుండా ఆడవారిని మాన భంగం చేయడం మొదలు పెట్టారు. ఈ అకృత్యాల గురించి తెలిసినా జపాన్ ప్రభుత్వం తన సైనికులని వీసమెత్తు మాట అనక పోవడం వారిని మరింత ప్రోత్సహించినట్లయింది. సైనికులు తమ ఇష్టమొచ్చినట్లు దోపిడీలు, మాన భంగాలు చేయవచ్చని సైన్యాధికారులు తమ సైనికులకి ఆగ్న ఇచ్చినందువల్లనే వారు షాంఘై నుండి నాన్‌కింగ్‌కి ఆఘమేఘాల మీద దాడి చేయడానికి వెళ్ళారు అని అప్పట్లో సైన్యం వెంబడి ఉన్న ఒక విలేఖరి రాశాడు.
  
ఈ అకృత్యాలు అన్నింటిలోకి మరీ దారుణమైనది ఇద్దరు జపాన్ సైన్యాధికారుల తమ మధ్య పెట్టుకున్న పోటీ. ఇందులో ఎవరు ముందుగా కత్తితో వంద మందిని చంపుతారు అన్నది పోటీ. ఈ పోటీ గురించి అప్పట్లో టోక్యో నిచి నిచి షింబున్ అన్న పత్రికలో, ఇంగ్లీషు భాషలో వచ్చే జపాన్ అడ్వర్టైజర్ అన్న పత్రికలోనూ  క్రీడల పోటీలకు ఇచ్చినట్లు కవరేజ్ కూడా ఇచ్చారు.
 
ఈ అమానుషమైన పోటీలో పాల్గొన్న అధికారులు తోషియాకి ముకాయి, తుసుయోషి నోడా అన్న ఇద్దరు రాక్షసులు. పోటీ ఏమంటే ఇద్దరిలో ఎవరు ముందుగా వంద మందిని కత్తితో నరికి చంపుతారు అని. వీళ్ళ కత్తులకి బలిగా సాధారణ ప్రజలని చేతులు వెనక్కి విరిచి కట్టి నించో బెట్టారు వీరి కింద పని చేసే సైనికులు. అయితే ఆ చంపడంలో ఇద్దరూ పూర్తిగా మునిగి పోయి ఆ రాక్షసానందం అనుభవించడంలో వంద మందితో ఆగకుండా చంపుకొంటూ పోవడం వల్ల పోటీలో ఎవరు నెగ్గారు అన్నది నిర్ధారణ చేయడం కష్టమయింది అని డిసెంబరు 13, 1937 నాటి టోక్యో నిచి నిచి షింబున్ పత్రిక రాసింది. అందుచేత మరొక రోజు ఈ పోటీని నిర్వహించాలని అయితే ఈ సారి లక్ష్యం వంద మంది కాకుండా నూట యాభయి మందికి పెంచాలని నిర్ణయించి అప్పటికి పోటీని డ్రాగా ముగించారని ఆ పత్రిక రాసింది.
తోషియాకి ముకాయి, తుసుయోషి నోడా


అయితే నూట యాభయి మందిని చంపే పోటీ నిర్వహించడానికి వీలు కాలేదు పాపం వీరికి. జపాన్ సైనికుల అకృత్యాలు తెలిసిన ఆ దేశస్థులు గగ్గోలు పెట్టడంతో చక్రవర్తి స్వయంగా జోక్యం చేసుకొవడంతో ఈ పోటీకి వీలు లేకుండా పోయింది. 

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఈ పోటీకి సంబంధించిన వివరాలు సేకరించిన అంతర్జాతీయ మిలిటరీ ట్రిబ్యునల్ ఈ ఇద్దర్నీ చైనాకి రప్పించి యుద్ధ నెరాలకి గానూ విచారణ జరిపి జనవరి 1948 లో ఇద్దర్నీ ఉరి తీసింది. 

ఏప్రిల్ 2003 లో  వీరి వారసులు అసలు 100 మందిని చంపే పోటీ అనేది జరగనే లేదని వీరిని అన్యాయంగా శిక్షించారని కోర్టుకెళ్ళారు. అసాహి షింబున్, మైనిచి షింబున్ అనే పత్రికల మీద నష్ట పరిహారం కోరుతూ దావా వేశారు. అయితే విచారణలో వంద మందిని తాము చంపింది నిజమేనని ఆ ఇద్దరు ట్రిబ్యునల్ ముందు ఒప్పుకొన్నారని, అందు చేత అది అబద్ధమని చెప్పడం సరి కాదని కోర్టు కేసు కొట్టేసింది. 






6 comments:

karthik said...

ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం
నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం

Praveen Mandangi said...

హింస అంటే ఏమిటో తెలియాలంటే అమెరికా సామ్రాజ్యవాదుల హింస చూడాలి. అమెరికా సామ్రాజ్యవాదులు వియత్నాంలో విడుదల చేసిన విష వాయువులకి కడుపులో ఉన్న పిండాలకి కూడా చిత్ర విచిత్ర రోగాలు వచ్చాయి. అమెరికా సామ్రాజ్యవాదులు ఖ్మేర్ రోజ్ గెరిల్లాలని చంపడానికి యుద్ధ విమానాల ద్వారా వేసిన బాంబులకి బోలెడన్ని ఏనుగులు కూడా చనిపోయాయి. ఆ గేం ఆఫ్ డెత్‌తో పోలిస్తే ఇది చాలా చిన్నదే.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ప్రవీణ్, ఇదొక్కటే కాదు. రేప్ ఆఫ్ నాన్‌కింగ్‌లో భాగంగా జపాన్ వాళ్ళు చేసిన అకృత్యాలు చదివినా కడుపులో దేవినట్లవుతుంది. ఈ వంద మందిని చంపే ఆట అందులో చిన్న శాంపుల్ అంతే.

y.v.ramana said...

నేను మగధీర సినిమా చూళ్ళేదు. మీరు రాసినదాన్ని బట్టి నాకర్ధమయ్యిందేమంటే.. నిరాయుధుణ్ణి కాకుండా ఆయుధుణ్ణి చంపడం వీరత్వం అని. అసలు వీరత్వం, శూరత్వం, అమరత్వం లాంటి విశేషణాలు తమ దగ్గర జీతాలు తీసుకుని ఉద్యోగాలు చేస్తున్న సైనికుల్ని ఉత్సాహపరచటానికి రాజులు కనిపెట్టిన బూటకపు పదబందాలు. వందమందిని చంపినవాడు ధీరుడు కాదు. రక్తపిపాసి అవుతాడు. ఈ ' చంపుడు పందెం ' సినిమా చూళ్ళేదని ముందే చెప్పాను కనుక.. నా వ్యాఖ్యకి పరిమితులున్నయ్.
మీ పోస్ట్ చదివి మనసు పాడయ్యింది. అసలు యుద్ధమనేది ( మీరు ధర్మాధర్మ యుద్ధాలు అంటూ క్యాటగరైజ్ చేసినప్పటికీ ) ఎంత నీచమయిందో, ఎంత దుర్మార్గమయిందో తెలిపే పోస్ట్. థాంక్స్.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

వీరత్వం, శూరత్వం లాంటి పదాలకు ఖచ్చితమైన అర్ధం నాకూ తెలియదు. టైటిల్‌లో మగధీర అన్న పదం ఊరికే తగిలించానంతే. అసలు వీరస్వర్గం అన్న కాన్సెప్టు సైనికులు తమ ప్రాణాలని పణంగా పెట్టి యుద్ధం చేసేలా చేయడానికి కనుగొన్న తెలివైన మార్గం అని నా ఉద్ధేశ్యం. అసలు ఈ పోస్టు ఉద్ధేశ్యమేమంటే మనకి అంతగా తెలియని చరిత్రలోని ఒక చీకటి కోణాన్ని పరిచయమ్ చేయడం. ఈ మారణకాండలో భాగంగా ఆడవారి మీద జపాన్ సైనికులు చేసిన అకృత్యాల గురించి చదివితే మనిషన్నవాడికెవరికైనా కడుపులో దేవేస్తున్నట్టు ఉంటుంది. Thank you Yaramana.

Anonymous said...

హా ... ఇది నెను వెరె బ్లాగ్ లో చదివాను.
అసలు రెండవ ప్రపంచ యుద్ధం లో జపాన్ సైన్యం చెసిన అక్రుత్యాలు తెలిస్తే , వాళ్ళకు ఇంకొక త్సునామి వచ్చినా ఫర్వాలేదు అనిపిస్తుంది .