లెస్బియన్ల, గే లని గుర్తిస్తూ ఎన్ని చట్టాలొచ్చినా ప్రజల్లో వారిపైన అపోహలు తొలగడం లేదు. శరత్ లాంటివారు ఎంతమంది ఎన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నా ఇంకా అలాంటి లైంగిక కార్యకలాపాలు తప్పు, లేదా నేరం అన్న అభిప్రాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ మధ్య రామ్ దేవ్ బాబా హోమో సెక్సువాలిటీ ఒక జబ్బు, ఈ జబ్బు పాలిట పడ్ద వారు జంతువులతో సమానం అని, తను వారికి ఆ జబ్బు నయం చేయగలనని ప్రకటించడం, గే, లెస్బియన్ హక్కుల కోసం పోరాడే బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ ఇదేమీ జబ్బు కాదు, నువ్వు చికిత్స చేయాల్సిన అవసరం లేదు, నీ పని నువ్వు చూసుకోవోయ్ అని ఘాటుగా సమాధానం చెప్పడం అందరికీ గుర్తుండే ఉంటుంది.
అయితే ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో లెస్బియన్ల మీద దాడులు పెరిగి పోయాయి. ఈ దాడుల్లో మానభంగం అన్నది ప్రధాన ఆయుధంగా మారింది. లెస్బియన్ల మీద మానభంగానికి పాల్పడడం ద్వారా వారిని ఆ అలవాటు నుంచి బయట పడేస్తున్నామని ఈ చర్యకి పాల్పడ్డవారు చెప్పుకొంటున్నారు. అందు చేత వీటికి CORRECTIVE RAPES అని ఒక గౌరవమైన పేరు పెట్టారు.
సౌత్ ఆఫ్రికా జాతీయ ఫుట్ బాల్ జట్టులో సభ్యురాలయిన యూడీ సిమెలాన్ అనే లెస్బియన్ హక్కుల కార్యకర్త పైన కొందరు దాడి చేసి ఆమెని సామూహిక మానభంగం చేసి్, కత్తులతో పొడిచి చంపిన సంఘటనతో ఈ అకృత్యాలు వెలుగులోకొచ్చాయి. సిమెలాన్ తనని లెస్బియన్‌గా ప్రకటించుకొని, బహిరంగంగా ఒక మహిళతో కలిసి జీవిస్తున్న మొదటి మహిళ.
ఈ సంఘటన తరువాత ఉవ్వెత్తున వెల్లువెత్తిన నిరసనతో అప్పటి వరకూ తమ మీద జరిగిన అకృత్యాలపైన ఫిర్యాదు చేయడానికి వెనుకాడిన లెస్బియన్లు బయటకి రావడం మొదలు పెట్టారు. లులేకి సిజ్వే అనే సామాజిక కార్యకర్త మాటల్లో వారానికి కనీసం పది మంది లెస్బియన్లు సామూహిక మానభంగానికి గురవుతున్నారు. కానీ ఫిర్యాదు చేయడానికి వెళితే పోలీసుల నుంచి కూడా వీరికి అవమానం ఎదురౌతుంది. నువ్వు ఆడవారితోనే చేస్తావు కదా, మగాళ్ళు నిన్ను ఎలా రేప్ చేస్తారు అని అవమానంగా మాట్లాడతారని, అందుకే ఎక్కువ మంది తమకి జరిగిన న్యాయాన్ని మౌనంగా భరిస్తారని ఆమె చెప్పారు.
లెస్బియన్, గే హక్కులని గుర్తించిన ఒకే ఒక్క ఆఫ్రికా దేశం సౌత్ ఆఫ్రికా. అయితే అక్కడ ప్రజల్లో మాత్రం వీరి పట్ల వివక్ష తొలిగిపోలేదు. ప్రతి సంవత్సరం అక్కడ నమోదయ్యే 50,000 రేప్ కేసుల్లో ఎన్ని లెస్బియన్ల మీద జరుగుతున్నాయో ఖచ్చితంగా తెలియదు. చాలా మంది ఫిర్యాదు దారులు తాము లెస్బియన్స్ అని చెప్పుకోవడానికి వెనుకాడుతారు.
ఈ అకృత్యాలకు ప్రధానంగా మూడు కారణాలున్నాయి. ఒకటి హోమో సెక్సువాలిటీ, అందునా ఆడవారి మధ్య, అసహజమైన చర్య అన్న నమ్మకం. ఇది మతానికి విరుద్ధం అన్న భావనతో ఈ దాడులు జరుగుతున్నాయాన్నది ఒక కారణం.
ఇక రెండవది, కొంచెం కండలు పెంచి, మగ రాయుళ్ళలా ఉన్న లెస్బియన్లు, (వీరిని Butch Lesbians అంటారు,) తమ ప్రియురాళ్ళను, తమ ఆడవారిని తమ నుంచి లాక్కుంటారన్న ఈర్ష్య, అసూయ, ద్వేషం.
"ఈ లెస్బియన్లు మమ్మల్ని కించ పరుస్తున్నారు. ఒక అమ్మాయి మరొక అమ్మాయితో శృంగారం చేస్తుంది అంటే, మేము చేతగాని వాఅమనేగా అర్ధం" అని చెప్పాడు ఇలాంటి కేసులో ఇరుక్కున్న తులాని బెంగు అనే వాడు. " ఒక సారి మేము రేప్ చేస్తే ఇలాంటి ఆడవాళ్ళు అమ్మాయిలయి పోతారు". ఇది మూడవ కారణం.
ఏప్రిల్‌లో నోక్సొలో నోగ్వజా అన్న అమ్మాయిని ఎనిమిది మంది కలిసి మానభంగం చేసి దాఋణంగా హత్య చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. 170,000 వేల మంది ప్రపంచ వ్యాప్తంగా సంతకాలు చేసి పంపడంతో సౌత్ ఆఫ్రికా ప్రభుత్వంలో చలనం వచ్చి ఈ కరెక్టివ్ రేప్ కేసుల మీద సీరియస్ యాక్షన్ మొదలయింది.