(ఇది నాకు మెయిల్‌లో వచ్చిన జోక్. కొద్దిగా మసాలా అద్ది ఇక్కడ పోస్టు చేస్తున్నాను)
అది NDTV వాళ్ళు entrtainer of the decade అవార్డు ప్రధానం చేస్తున్న సభా వేదిక. రజనీ కాంత్ కొంచెం ముందుగానే వచ్చి ఒక టేబిల్ వద్ద కూర్చుని ఉన్నాడు. ఇంతలో ఐశ్వర్యా రాయ్ వచ్చింది. "నమస్తే, సార్" అని విష్ చేసింది రజనీని చూసి. "ఏమ్మా, బావున్నావా" అని అడిగాడు రజనీ. "బావున్నాను సార్" అని ఆయన పక్కన్ కుర్చీలో కూర్చుంది. వెనకాలే వచ్చిన అమితాబ్‌కి అది నచ్చలేదు. చకచకా వచ్చి, "హలో రజనీ, హౌడూయూడూ" అని ఐశ్వర్యకీ రజనీకి మధ్యలో కుర్చీ లాక్కుని కుర్చున్నాడు. ఆ వెనకాలే వస్తున్న అభిషేక్ ఈ సీన్ చూసి కొంచెం సంతోషంగా నిట్టూర్చి తనూ ఐష్ పక్కన మరో కుర్చీలో కూర్చున్నాడు.
అమితాబ్, రజనీ కబుర్లలో పడ్డారు. మాటల మధ్యలో రజనీ ఎందుకో తన గురించి తను అతిశయోక్తితో గొప్పలు చెప్పుకుంటున్నాడని అమితాబ్‌కి అనిపించింది. "ఏమిటి రజనీ, నువ్వెంత సౌత్ సూపర్‌స్టార్ అయితే మాత్రం నీకు అందరూ తెలుసు, నువ్వు అందరికీ తెలుసు అనడం నాకంత నమ్మశక్యంగా లేదు" అన్నాడు అమితాబ్.
"సరే, ఇక్కడే చూపిస్తాను నీకు చూడు" అన్నాడు రజనీ. "అదీ చూద్దాం" అన్నాడు అమితాబ్. ఆ ప్రోగ్రాం జరుగుతున్నది బొంబాయిలో కాబట్టి రజనీకన్నా తనే అక్కడ ఎక్కువ పాపులర్ కదా అన్న నమ్మకంతో.
ఇంతలో అవార్డు ప్రధానం చేయాల్సిన చిదంబరం లోపలికి వచ్చాడు. నేరుగా వీళ్ళు కూర్చున్న టేబిల్ వద్దకు వచ్చి"ఎన్న రజనీ, సౌఖ్యమా" అనడిగి వెళ్ళిపోయాడు అమితాబ్ వైపు చూడకుండా. ఇప్పుడేమంటావ్ అన్నట్టు చూశాడు రజనీ. "మీరిద్దరూ సాంబార్ గాళ్ళే కదా. అదీ సంగతి" అన్నాడు అమితాబ్. కాస్సేపటికి నోబుల్ ప్రైజ్ విన్నర్ అమార్త్య సేన్ లోపలికి వచ్చాడు. ఖచ్చితంగా ఇతనికి రజనీ తెలిసే అవకాశం లేనేలేదు అని నమ్మకంగా అతని వైపు చూస్తూ ఉన్నాడు అమితాబ్. సేన్ కూడా నేరుగా వీళ్ళ వద్దకి వచ్చి రజనీని పలకరించి అమితాబ్ వైపు చూడకుండా వెళ్ళిపోయాడు. ఎప్పుడో చెన్నైకి వెళ్ళినప్పుడు ఏదో సందర్భంలో ఇద్దరూ కలిసి ఉంటార్లే అనుకొని, "కాస్సేపు చూద్దాం రజనీ" అన్నాడు అమితాబ్ బింకంగా. ఆ తరువాత మిజోరాం నుండి ఒక సామాజిక కార్యకర్త, ఉగాండా దేశం రాయబారి లోపలికి రాగానే నేరుగా రజనీ వద్దకి వచ్చి పలకరించడంతో అమితాబ్ డైలమాలో పడ్డాడు.
కాస్సేపటిలో కార్యక్రమం పూర్తయింది. అమితాబ్ రజనీని వదలకుండా తన కారులో ఎక్కించుకొని తీసుకుపోయాడు. "రజనీ, నీకు హాలీవుడ్‌లో ఏంజెలీనా జోలీ తెలుసా?" అనడిగాడు. "చాలాబాగా తెలుసు. కనీసం వారానికొక సారయినా ఫోన్ చేసి మాట్లాడుతుంది" చెప్పాడు రజనీ. అమితాబ్‌కి నమ్మకం కలగలేదు."కొయ్..కొయ్.." అని మనసులో అనుకొని, "సరే. నేను చూస్తే కానీ నమ్మను" అన్నాడు. ఇద్దరూ ఆ మరుసటి రోజే అమెరికాకి ప్రయాణమయ్యారు.
ఏంజెలినా జోలీ భవనం గేటు ముందు సెక్యూరిటీ గార్డు వీళ్ళ టాక్సీని ఆపి లోపల రజనీని చూడగానే సెల్యూట్ చేసి గేటు ఓపెన్ చేశాడు. అమితాబ్‌కి కాస్త ఆశ్చర్యమేసినా బింకంగా కూర్చున్నాడు. లోపల అంతా హడావిడిగా ఉంది. ఏంజెలినా పర్సనల్ స్టాఫ్ అందరూ బయట రెడీగా నించుని ఉన్నారు. ఆ సమయంలో లోపలికి వచ్చిన తాక్సీని చూసి ఆమె బాడీ గార్డు కొపంగా పరుగెత్తుకొచ్చాడు. అయితే లోపలనుంచి దిగుతున్న రజనీని చూడగానే అటెన్షన్‌లో నిలబడి సెల్యూట్ చేశాడు. " హాయ్,మాక్స్!హౌ డూ యూ డూ? ఈజ్ ఏంజీ గోయింగ్ ఫర్ షూటింగ్?" అనడిగాడు రజనీ. "ఎస్సర్" అని చెప్పాడు సదరు మాక్స్. ఇంతలో లోపలనుండి జీన్స్, టీ షర్ట్‌లో చక చకా నడుచుకుంటూ ఏంజెలీనా, ఆమె పక్కన బ్రాడ్ పిట్ బయటకొచ్చారు.
"హాయ్, తలైవా" అని పెద్దగా అరుచుకుంటూ వీళ్ల దగ్గరకొచ్చింది ఏంజెలీనా. బ్రాడ్ పిట్ తన జేబు లోంచి సెల్ ఫోన్ తీసి, ఎవరితోనో "షూటింగ్ ఇస్ కేన్సిల్‌డ్ టుడే" అని చెప్తున్నాడు. రజనీ చక చకా అతని వద్దకెళ్ళి, ఫోన్ తీసుకొని," No,Bradd. Don't cancel the shoot. Work is worship. We will leave in few moments" అని చెప్పాడు.
రజనీ, అమితాబ్ అక్కడి నుండి బయటకొచ్చారు. టాక్సీలో కూర్చున్నాక" రజనీ నీకు బరాక్ ఒబామా తెలుసా" అనడిగాడు అమితాబ్. "భలే వాడివే. పోయిన ఎలక్షన్‌లో వచ్చి తన తరఫున ప్రచారం చేయమని చాలాసార్లు అడిగాడు. రాజకీయాల రొంపిలోకి దిగనని తప్పించుకున్నాను. సరే పద DC దాకా వెళ్ళొద్దాం" అని ఇద్దరూ వాషింగ్‌టన్ వెళ్ళే విమానం ఎక్కారు.
వైట్‍హౌస్‌కి అరమైలు దూరంలోనే అన్ని వాహనాలని ఆపేస్తున్నారు. రజనీ టాక్సీలోంచి తల బయట పెట్టి అక్కడున్న చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వైపు చూసి చేయి ఊపాడు. అతను చకచకా పరుగెత్తుకొచ్చి రజనీకి సెల్యూట్ చేసి," మిస్టర్ ప్రెసిడెంట్ ఈజ్ లీవింగ్ ఫర్ ఏ మీటింగ్ విత్ రష్యన్ ప్రెసిడెంట్" అని ఇంగ్లీషులో చెప్పి లోపలికి వెళ్ళమన్నట్టు టాక్సీ డ్రైవర్‌కి సైగ చేశాడు. టాక్సీ నేరుగా వైట్‌హౌస్ ముందుకి వెళ్ళి ఆగింది. లోపల అంతా హడావిడిగా ఉంది. ఒక పది నల్లటి ఓడల్లాంటి కార్లు వరసగ నించుని ఉన్నాయి. వాటి చుట్టూ నల్ల కోట్లు వేసుకుని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అటెన్షన్‌లో నించుని ఉన్నారు.
ఇంతలో లోపల నుండి నల్ల సూట్‌లో బరాక్ ఒబామా చక చకా బయట కొచ్చాడు. బయట రెడిగా ఉన్న ఒక ఆఫీసర్ ఆయన చెవిలో ఏదో చెప్పాడు. ఒబామా మొహంలో చిరునవ్వు మెరిసింది. ఆయన తన కేన్వాయ్ వైపు వెళ్ళకుండా నేరుగా రజని ఉన్న టాక్సీ వైపు వచ్చాడు. రజనీ ఆయన్ని చూసి కారు దిగాడు. చేతులు జోడించి "నమస్తే" అన్నాడు ప్రెసిడెంట్. రజని ఆయన్ని కౌగిలించుకున్నాడు. ఒబామా తన జేబులోంచి తన బ్లాక్‌బెర్రీ తీసి ఒక నంబర్ డయల్ చేసి."మిషెల్లీ! రజనీ సార్ బయట ఉన్నారు. చక చకా మంచి కాఫీ రెడీ చెయ్యి. ఎవరినైనా పంపించి ఇండియన్ రెస్టారెంటు నుండి దోశెలు. ఇడ్లీ సాంబార్ తెప్పించు" అని చెప్పాడు. "నో,నో! పని మీద వెళ్తున్నట్టున్నావు. లేట్ చేయడం మంచిది కాదు. ఈ సారి తీరిగ్గా కలుద్దాం" అన్నాడు రజనీ ఒబామా చేతిలోంచి ఫోన్ పక్కకి తీసి.
"సరే ఇక్కడి నుంచీ ఎక్కడికీ సార్ మీ ప్రయాణం ఇండియాకేనా, మరెక్కడికైనానా?" అడిగాడు ఒబామా. అమితాబ్ వైపు చూశాడు రజనీ. అప్పటికి తేరుకున్న అమితాబ్ రజనీ చెవిలో "నీకు పోప్ కూడా తెలుసా రజనీ?" అనడిగాడు. రజనీ ఒబామా వైపు తిరిగి "నా ఫ్రెండ్ పోప్‌ని కలవలనుకొంటున్నాడు" అని చెప్పాడు. ఒబామా తన కోసం వెయిట్ చేస్తున్న ఏజెంట్లలో ఒకరిని పిలిచి, " వీళ్ళిద్దరినీ నా పర్సనల్ ఫ్లైట్‌లో వాటికన్‌కి తీసుకెళ్ళమని చెప్పు" అన్నాడు.అమితాబ్ కళ్ళు గిర్రున తిరగడం మొదలయింది.
ఆదివారం ఉదయం కావడంతో వాటికన్ చాలా రద్దీగా ఉంది. కాస్సేపటిలో పోప్ చర్చి పైన నుండి చేయి ఊపి భక్తులని ఆశీర్వదిస్తారని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. "ఇంత మందిలో మనం పోప్‌కి కనిపించం గానీ, నువ్వు ఇక్కడ నుంచి చూస్తూ ఉండు, నేనూ, పోప్ కలిసి బయటకొచ్చి చేయి ఊపుతాం" అన్నాడు రజనీ. "రజనీ ఇక్కడ సెక్యూరిటి బాగా టైట్‌గా ఉంది కదా" అన్నాడు అమితాబ్. "డోంట్ వర్రీ. అందరూ మనకి తెలుసులే" అని వడి వడిగా జనంలోకి వెళ్ళాడు రజనీ. కాస్సేపటిలో జనంలో కల కలం మొదలవడంతో అందరూ చూస్తున్న వైపుకి చూశాడు అమితాబ్.
అక్కడ పోప్ బెనెడిక్ట్ పైన చేయి వేసి బయటకొచ్చి చేయి ఊపుతున్నాడు రజనీ. అమితాబ్ పక్కన ఒక ఇటాలియన్ నిల్చుని ఉన్నాడు. "సార్ నాకొక విషయం చెప్తారా?" అనడిగాడు అతని ఇంగ్లీషులో అమితాబ్‌ని. అమితాబ్ తలుపాడు. "అక్కడ చేయి ఊపుతున్న రజనీని చూడండి. ఆయన పక్కన తెల్ల గౌను వేసుకొని టోపీ పెట్టుకొని చేతిలో కర్ర పట్టుకొని నించుని ఉన్న ఆ ముసలోడెవరో కొంచెం చెప్తారా".
అప్పుడు అమితాబ్‌కి మైండ్ బ్లాకయి కింద పడి పోయాడు.