నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, February 18, 2011

తెలంగాణాని మరింత సాగదీయడానికి సోనియాకి ఒక ఉపాయం


తెలంగాణా చిక్కుముడి ఎలా విప్పాలో అందులోంచి ఎలా బయట పడాలో తెలియక కాంగ్రెస్ అధిష్ఠానం తల పట్టుక్కూర్చుంది. అయినా కమిటీ అంటే ఇచ్చిన కాల పరిమితిని దాటి సాగతీసి అప్పుడు కానీ నివేదిక ఇవ్వకూడదు కదా, కానీ ఈ శ్రీ కృష్ణ కమిటి దాన్ని వదిలి ఖచ్చితంగా చెప్పిన తేధీలోపే రిపోర్టు ఇచ్చి కాంగ్రెసోళ్ళ దుంప తెంచింది పాపం.
 
ఇప్పుడు తెలంగాణా సమస్యపైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవలసిన టైమొచ్చింది కాబట్టి ఏదో ఒకటి చేయాలి. అయితే ఇక్కడ ఏదో ఒకటి చేసేయడం అంత వీజీ కాదు. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం అన్నట్టు ఉంటుంది. మరింత సాగతీద్దామా అంటే అది ఎలా సాధ్యమో అర్ధం కావడం లేదు సోనియా గారికి. పరిష్కారం సంగతేమో కానీ, సాగతీతకి మాత్రం ఒక ఉపాయం ఇక్కడ రాస్తున్నాను.
 
శ్రీ కృష్ణ కమిటీ ఆరు పరిష్కార మార్గాలు చెప్పింది. ఈ ఆరు మార్గాలలో ఒక్కొక దాన్నీ పాటిస్తే దాని వలన వచ్చే లాభ నష్టాలని అధ్యయనం చేయడానికి ఒక్కొక కమిటీ చొప్పున ఆరు కమిటీలు వేసి వాటికి ఒకటో, రెండో సంవత్సరాలు టైమిస్తే కొన్నాళ్ళు వెసులుబాటు దొరుకుతుంది కదా! అప్పుడయినా ఏం చేయాలి? అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చు. అప్పటికి ఏమో గుర్రం ఎగరా వచ్చు, కేసీఆర్ సమైక్య వాది అయిపోనూ వచ్చు.
 
అప్పుడు ఏదయితే అదవుతుంది. అప్పటి దాకా మనం అధికారంలో ఉంటే, లేదా అప్పటికి ఎన్నికలయిపోయి మళ్ళీ మనకి అధికారం దక్కితే అప్పుడు చూసుకోవచ్చు. లేదా అప్పటికి వాళ్ల ఖర్మ కాలి ఎన్డీయ్యే వాళ్ళకి అధికారమొస్తే వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతూ ఉంటే మనం ప్రతిపక్ష స్థానంలో కూర్చుని తమషా చూస్తూ ఎంజాయ్ చెయ్యొచ్చు.

లేదా ఈ లోపల హాలీవుడ్ సినిమాలో చూపించినట్టు 2012 లో ప్రపంచం మటాషై పోయిందనుకోండి అప్పుడిక ఏ బదరా బందీ లేదు.

1 comment:

Sree said...

మీ సలహా అమలులో పెట్టడం చాలా కష్టమండీ. దానికంటే మంచి ఉపాయం, ప్రస్తుతానికి అభివృధ్ధికి ప్రాంతీయ కమిటీలు వేసి, 5 ఏళ్ళ తరువాత మరోసారి పరిశీలన జరిపిస్తామని ప్రకటించటం. విడగొట్టే ఆలోచనే ఉంటే అప్పట్లోగా ఎవరికి వారు రాజధానులు ఏర్పరచుకునే వీలు కూడా ఉంటుంది. 5 ఏళ్ళకి అధికారం లొ ఉంటే సరి, లేదా అప్పటి ప్రభుత్వం చూసుకుంటుంది.