మరో వారంలో మొదలవ్వబోయే కామన్ వెల్తు గేమ్సుకి ప్రిపరేషన్స్ సరిగా లేవని మీడియా, విమర్శకులు, క్రీడాకారులు, బ్లాగర్లూ దుమ్మెత్తి పొస్తున్నారు. డెబ్బై, ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టి ఇలాగేనా చేసేది అని అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. డబ్బంతా కాంట్రాక్టర్లు మెక్కేస్తున్నారు, నాణ్యత అస్సల్లేదు, అన్ని స్టేడియంలు కంపు కంపుగా ఉన్నాయని ఫోటోలు తీసి మరీ పరువు తీస్తున్నారు. దేశ ప్రతిష్ఠ యమునా నదిలో కలిసిపోతుందని ఏడ్చి పెడబొబ్బలు పెడుతున్నారు.
కానీ ఎంతమందికి తెలుసు ఇదంతా కావాలని చేస్తున్న వ్యవహారమని. మనకి కామన్వెల్తు గేమ్సు సరిగ్గా, నభూతో నభవిష్యతి అన్న చందంగా నిర్వహించడం చాలా చిన్న విషయమని ఎంత మందికి తెలుసు. ఎప్పుడో ఎనభయ్యవ దశకంలోనే ఆసియా క్రీడలు అదిరిపోయేలా చేశాం మనం. ఇప్పుడు సెన్సెక్స్ ఇరవై వేలని తాకిన ఈ రోజుల్లో ఈ గేమ్స్ చేయడం ఒక లెఖ్ఖా?
పొట్టి నాయాళ్ళు చైనా వాళ్ళు ఒలింపిక్స్ ఆర్గనైజ్ చేయగా లేనిది, చీకటి ఖండం అని చెప్పే ఆఫ్రికా వాళ్ళు ప్రపంచ కప్ ఫుట్ బాల్ చేయగా లేనిది మనం వెధవది కామన్ వెల్త్ గేమ్స్ ఆర్గనైజ్ చేయలేమా?
అయితే, స్టేడియంలో పైకప్పు ఊడిపోవడం, స్టేడియం బయట బ్రిడ్జి కూలిపోవడం ఇవన్నీ ఒక పథకంలో భాగమే!
ఏ క్రీడల్లోనయినా అతిధి దేశం పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉంటే మర్యాదగా ఉంటుంది. అయితే ఈ క్రీడల్లో మనకి అగ్రస్థానం దక్కే అవకాశం ఉందా? లేదని అందరికీ తెలిసిన విషయమే.ఆ దిశగా ఇదొక మార్గం.
ఇప్పుడు చూడండి. ఆస్ట్రేలియాకి చెందిన మహిళ డిస్కస్ చాంపియన్ డేని శామ్యూల్స్ భయపడిపోయి ఆరోగ్యం, భద్రతా కారణాలతో తను ఈ గేమ్సులో పాల్గొనడం లేదని చెప్పింది. దాంతో మన దేశానికి చెందిన క్రిష్ణ పూనియాకి ఆ విభాగంలో స్వర్ణం దక్కే చాన్సుందని నిపుణుల అభిప్రాయం.
ఇలాగే బ్రిటన్ వాళ్ళూ, న్యూజీలాండోళ్ళూ.వాళ్ళతో బాటూ ఇంకొన్ని దేశాలవాళ్ళూ ఈ గేమ్సుకి రాకుండా ఎగ్గొడితే మనకి పతకాల పంటే కదా?
అసలు విషయం ఇదీ! అది తెలుసుకోకుండా సురేష్ కల్మాడీ లాంటి దేశభక్తులని ఈ మీడియా దుమ్మెత్తి పోయడం ఏమైనా బావుందా?